breaking news
Lalam Bhavani
-
w/o లాలం
జిల్లా పరిషత్‌లో ఏం జరుగుతోంది? చైర్పర్సన్ ఎవరు? అధికారిక సమావేశాలు నిర్వహిస్తున్న వారెవ్వరు? వేదికపై ప్రైవేటు వ్యక్తికి అధికారులు ఎందుకు స్థానం కల్పిస్తున్నారు? పాలనలో సదరు వ్యక్తి తలదూర్చి దిశానిర్దేశం చేస్తుంటే బసవన్నల్లా ఎందుకు తలలాడిస్తున్నారు? ఇలా అనేక ప్రశ్నలు జెడ్పీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జెడ్పీ చైర్‌పర్సన్‌గా లాలం భవాని ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ.. ఆమె భర్త లాలం భాస్కరరావు పెత్తనమే సాగుతోంది. సమావేశాల్లో అతని జోక్యం పెచ్చుమీరుతోంది. చైర్పర్సన్ డమ్మీ అన్నట్టు అధికారులు సైతం ఆమె భర్త కనుసన్నల్లోనే పనిచేస్తున్నారు. మంగళవారం జెడ్పీలో సమావేశం తీరు దీనికి అద్దం పట్టింది. విశాఖ రూరల్: టీడీపీ నాయకుడు లాలం భాస్కరరావు జిల్లా పరిషత్‌లో అంతా తానై నడిపిస్తున్నారు. చైర్పర్సన్ భర్త అన్న ముద్రతో అధికారులతో వేదిక పంచుకుంటున్నారు. కొత్త పాలకవర్గం ఏర్పాటైన తరువాత ఇప్పటి వరకు మూడుసార్లు అధికారులతో సమావేశా లు నిర్వహించారు. అన్నింటిలోను చైర్పర్సన్ భవాని పక్కనే వేదికపై కూర్చున్నారు. అంతటితో ఆగకుండా అధికారులకు, సిబ్బందికి అన్ని విషయాల్లోను ఆదేశాలు జారీ చేస్తున్నారు. మంగళవా రం కూడా అదే సీన్ కనిపించింది. జెడ్పీ సమావేశ మందిరంలో ఎంపీడీవోలతో అత్యంత రహస్యంగా సమావేశం నిర్వహిం చారు. ఇందులో వేదికపై చైర్పర్సన్ భవాని పక్కనే ఆమె భర్త భాస్కరరావు కూర్చున్నారు. ఒకవైపు చివరన జెడ్పీ సీఈవో మహేశ్వరరెడ్డి, మరోవైపు చివరన డీఆర్డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ ఉన్నారు. సమావేశం లో అధిక సమయం భాస్కరరావే ప్రసంగించారు. ‘సంక్షే మ పథకాలు ప్రజలందరికీ చేరాలి. పించన్లను ఆధార్‌తో అనుసంధానం చేయాలి’ అంటూ ఎంపీడీవోలను ఆదేశించారు. నిధులు పుష్కలంగా ఉన్నాయని, వాటిని సక్రమంగా విని యోగించుకుంటే జిల్లా అభివృద్ధి చెందుతుందని, సహకరించాలని సూచించా రు. అధికారులు కూడా ఆయన మాట లకు చక్కగా తలూపారు. చైర్పర్సన్ మాత్రం ప్రతీ సమావేశంలోను ఒకే డైలాగ్‌ను వల్లెవేస్తున్నారు. ఈ సమావేశంలో కూడా తనను తాను చైర్‌పర్సన్‌గా పరిచయం చేసుకొని, ‘నేను అన్నింటిపై అవగాహన పెంచుకుంటున్నాను, సహకరించండి’ అని మూడు ముక్క లు మాట్లాడి కూర్చుండిపోయారు. రహస్యంగా సమావేశాలెందుకో సాధారణంగా ఏ చిన్న సమావేశం నిర్వహించినా.. అందులో నిర్ణయాలు మీడియా ద్వారా ప్రజలకు చేరవేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులు పరితపిస్తుంటారు. కానీ విచిత్రంగా జెడ్పీ చైర్‌పర్సన్‌గా భవాని ఎన్నికయ్యాక నిర్వహిస్తున్న సమావేశాల విశేషాలను బయటకు పొక్కనీయడం లేదు. అసలు సమావేశం విషయాన్నే చెప్పడం లేదు. చైర్పర్సన్ భర్తగా అధికార దర్పాన్ని చెలాయించడం కోసమే అధికారులతో రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి జెడ్పీ చైర్పర్సన్ భర్త అయినప్పటికీ పరిషత్ పాలన, నిర్ణయాల్లో వేలు కూడా పెట్టకూడదు. కానీ భాస్కరరావు మాత్రం ఏ హోదోతో సమావేశాలు నిర్వహిస్తూ వేదికపై నుంచి ఆదేశాలు జారీ చేస్తున్నారో ఎవరికీ అర్ధం కావడం లేదు. అధికారులు సైతం ఆయన అడుగులకు మడుగులొత్తుతుండడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
జెడ్పీ పీఠంపై భవాని
- చైర్‌పర్సన్‌గా ఎన్నిక ఏకగ్రీవం - వైఎస్ చైర్మన్‌గా కొట్యాడ అప్పారావు - జెడ్పీటీసీలచే ప్రమాణ స్వీకారం చేయించిన కలెక్టర్ - 23 ఏళ్లకు టీడీపీకి అవకాశం విశాఖ రూరల్: ఊహించినట్టుగానే జెడ్పీ చైర్పర్సన్ ఎన్నిక లాంఛనమైంది. సుమారు 23 ఏళ్ల తరువాత జెడ్పీ పీఠాన్ని తెలుగుదేశం వశం చేసుకుంది. జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన ఎన్నికలో చైర్‌పర్సన్‌గా టీడీపీకి చెందిన రాంబిల్లి జెడ్పీటీసీ లాలం భవాని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లాలో 39 జెడ్పీటీసీలకు వైఎస్ఆర్సీపీ15 గెలుచుకోగా, 24 స్థానాలను టీడీపీ కైవసం చేసుకొని జెడ్పీ పీఠాన్నిదక్కించుకుంది. శనివారం ఉదయం 10 గంటల కు కో-ఆప్షన్ సభ్యుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. టీడీపీ బలపరిచిన గూనూరు జోసెఫ్ సత్య శ్రీరామమూర్తి, కొప్పిశెట్టి కొండబాబులు నామినేషన్లు వేశారు. మధ్యాహ్నం ఒంటి గంట కు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ తొలుత జెడ్పీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. వైఎస్ఆర్సీపీకి చెందిన అరకు జెడ్పీటీసీ కూనవనజ, డుంబ్రిగుడ సభ్యురాలు మండ్యగురు కుజ్జమ్మ, నర్సీపట్నం జెడ్పీటీసీ చదలవాడ సువర్ణలత, హుకుంపేట జెడ్పీటీసీ సాగరి వసంతకుమారి లు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం కో-ఆప్షన్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్‌పర్సన్‌గా లాలం భవాని మధ్యాహ్నం 3 గంటలకు ప్రిసైడింగ్ అధికారి ఆరోఖ్యరాజ్ జెడ్పీటీసీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ సూచనమేరకు జెడ్పీ చైర్‌పర్సన్‌గా లాలం భవాని పేరును అచ్యుతాపురం జెడ్పీటీసీ జనపరెడ్డి శ్రీనివాసరావు ప్రతిపాదించారు. దేవరాపల్లి జెడ్పీటీసీ గాలి వరలక్ష్మి బలపరిచారు. దీంతో సభ్యులందరూ మద్దతు తెలపడంతో భవాని ఏకగ్రీవంగా ఎన్నికయినట్టు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. అనంతరం వైస్‌చైర్మన్‌గా అనంతగిరి జెడ్పీటీసీ కొట్యాడ అప్పారావు పేరును భీమిలి జెడ్పీటీసీ సరగడ అప్పారావు ప్రతిపాదించగా, పద్మనాభం జెడ్పీటీసీ కశిరెడ్డి దామోదరరావు బలపరిచారు. మరో అభ్యర్థి నుంచి పోటీ లేకపోవడంతో అప్పారావు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరికి మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు సభ్యులు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రత్యేక సమావేశంలో భవాని మాట్లాడుతూ తనకు చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలతో పాటు తనను ప్రోత్సహించి అండదండగా నిలిచిన భర్త లాలం భాస్కరరావుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ త్వరలో జరగనున్న జెడ్పీ సమావేశంలో ప్రధానంగా రెండు ముఖ్యమైన తీర్మానాలు చేయాలని సూచిం చారు. విశాఖ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని, కేడీ పేటలో ఉన్న ఆయన సమాధిని టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేసి, పార్కు నిర్వహణకు జెడ్పీ సాధారణ నిధుల నుంచి నెలకు రూ.25 వేలు చొప్పున వెచ్చించే విషయంపై తీర్మానించాలని కోరారు. జిల్లాకు వచ్చే నిధులను ప్రణాళికాయుతంగా ఉపయోగించుకొని గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. జిల్లాలో వంద పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. దీనిపై ఈ నెల 9న హైదరాబాద్‌లో సమావేశం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ జెడ్పీ చైర్మన్ పదవి కీలకమైనదన్నారు. మంచిపనితీరుతో మోడల్ జెడ్పీగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. మైదన ప్రాంతాలతో పాటు ఏజెన్సీని కూడా అభివృద్ధి బాటలో నడిపించాలని సూచించారు. కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు కె.ఎస్.ఎన్.రాజు, పంచకర్లరమేష్‌బాబు, పీలా గోవింద్, బండారు సత్యనారాయణమూర్తి, వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు, జెడ్పీ సీఈవో మహేశ్వరెడ్డి, డీఆర్డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ పాల్గొన్నారు. గృహిణి నుంచి చైర్పర్సన్ వరకు రాజకీయ నేపథ్యం కుటుంబం నుంచి వచ్చినా.. లాలం భవాని నిన్న మొన్నటి వరకు గృహిణిగానే కుటుంబాన్ని తీర్చిదిద్దారు. కుటుంబ సభ్యులు, ప్రధానంగా భర్త లాలం భాస్కరరావు ప్రోత్సాహంతో జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్థాయికి ఎదిగారు. ఈమె స్వస్థలం రాంబిల్లి మండలం లాలం కోడూరు. 1962లో యలమంచిలి మండలం రాజానపాలెంలో జన్మించారు. తండ్రి రాజాన సత్యనారాయణ రాజకీయాల్లో ఉండేవారు. ఈమె విశాఖలోని మహిళా కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాయి. అనంతరం బీఎల్‌లో చేరినప్పటికీ మధ్యలోనే ఆపేశారు. వరుసకు మేనమామ అయిన లాలం భాస్కరరావును వివాహం చేసుకున్నారు. వీరి కుమార్తె వైద్యురాలు, కుమారుడు ఆస్ట్రేలియాలో ఎంఎస్ చదువుతున్నాడు. భర్త భాస్కరరావు దీర్ఘకాలంగా టీడీపీ నాయకునిగా జిల్లా రాజకీయాల్లో పనిచేస్తున్నారు. భవాని కూడా గత 15 ఏళ్లుగా ఈస్ట్‌కోస్ట్ ట్రస్ట్ ద్వారా ప్రజా సేవలో ఉన్నారు. భర్త ప్రోత్సాహం, వెన్నుదన్నుగా నిలవడంతో స్థానిక ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాంబిల్లి మండలం జెడ్పీటీసీ సభ్యురాలిగా విజయం సాధించి జెడ్పీ చైర్పర్సన్ పీఠాన్ని అధిష్టించారు.