మూగ జీవాలపై వైరల్‌ పంజా

Viral Diseases Cattle In Srikakulam District - Sakshi

వ్యాధులతో బాధ పడుతున్న పశువులు

జిల్లాలో 42 వేల ఆవులు, ఎద్దులకు అనారోగ్యం

మరింత వ్యాపించే అవకాశం

రక్త నమూనాలను పరీక్షకు పంపిన వైద్యులు

సాక్షి, పాలకొండ: జిల్లాలోని పశువులు వ్యాధులతో నీరసించిపోతున్నాయి. మొదట్లో చిన్న కురుపు వస్తుంది. రెండు రోజుల్లో అది పుండుగా మారి గాయం ఏర్పడుతుంది. ఇలా శరీరమంతా పుళ్లు మాదిరిగా ఏర్పడతాయి. ఈ గాయాలపై చీము పట్టి పురుగులు చేరుతున్నాయి. ఒక్కరోజు వ్యవధిలోనే పక్కన ఉన్న పశువులకు వ్యాపిస్తోంది. దీంతో అవి ఆహారం తీసుకోవడంలేదు. కాళ్ల కింద పుళ్లు కావడంతో నడవలేక పోతున్నాయి. వారం రోజుల్లో పశువులు పూర్తిగా క్షీణించిపోతున్నాయి. ఆవులు, ఎద్దులకు మాత్రమే ఈ వైరల్‌ వ్యాధి సోకుతోంది. దున్నలు, గేదెలలో ఈ లక్షణాలు కనిపించడం లేదు. జిల్లాలో పసువుల సంఖ్య 2.23 లక్షలు కాగా ఇంతవరకూ 42 వేల ఆవులు, ఎద్దులు అనారోగ్యం పాలయ్యాయి.

పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, కొత్తూరు, పాతపట్నం, మెళియాపుట్టి, రేగిడి తదితర మండలాల్లో వైరల్‌ వ్యాధుల ప్రభావం కనిపిస్తోంది. పాలకొండ మండలంలోని సింగన్నవలస, పరశురాంపురం, వెలగవాడ, కొండాపురం, ఎన్‌కే రాజపురం తదితర గ్రామాల్లో 90 శాతం పశువులు ఈ వ్యాధితో బాధపడుతున్నాయి. ఈ వ్యాధికి ఏ మందులు వినియోగించాలో తెలియక రైతులు వేప ఆకులు, పసుపు కొమ్ములు ముద్ద చేసి రాస్తున్నారు. వ్యాధి సోకిన పశువుల రక్త నమూనాలను పశు వైద్యులు సేకరించి పరీక్షలకు పంపించారు. ప్రతి గ్రామంలోనూ వైద్యశిబిరాలు నిర్వహించేలా చర్యలు తీసుకుం టున్నారు. వ్యాధి సోకిన పశువులకు సమీపంలో ఇతర పశువులు ఉంచకుండా రైతులకు అవగాహన కలిగిస్తున్నారు.

శరీరమంతా వ్యాపిస్తుంది..
ముందు శరీరంపై తామర వచ్చినట్లు కనిపిస్తుంది. రెండు రోజుల్లో గాయాలు కనబడుతున్నాయి. ఒక్కరోజులో శరీరం మొత్తం వ్యాపిస్తుంది. వాపులు ఏర్పడి పశువులు ఆహారం తీసుకోవడంలేదు. 
–మునికోటి రవి, రైతు, పరశురాంపురం 

జిల్లా అంతటా వ్యాధి లక్షణాలు.. 
జిల్లా అంతటా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. రైతుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. వ్యాధిని గుర్తించేందుకు చర్యలు తీసుకున్నాం. ప్రధానంగా పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, కొత్తూరు, పాతపట్నం, మెళియాపుట్టి, రేగిడి తదితర మండలాల్లో ఎక్కవగా పశువులు ఈ వ్యాధికి గురయ్యాయి. వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. నివారణ చర్యలు చేపట్టేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం.
–కృష్ణారావు, పశుసంవర్ధక శాఖ ఏడీ

పశువులు నడవలేక పోతున్నాయి..
వారం రోజులుగా రెండు ఎద్దులకు, ఆవుకు ఈ వ్యాధి సోకింది. కాళ్ల కింద పుళ్లు ఏర్పడి నడవలేక పోతున్నాయి. గాయాలు పెద్దవి గా ఉంటున్నాయి. ప్రైవేటుగా వైద్యం చేయిస్తున్నా ఫలితం మాత్రం కలగలేదు. రూ.60 వేలు విలువ చేసే రెండు ఎద్దులు పూర్తిగా నీరసించిపోయాయి.
–కాయల సత్యనారాయణ, సింగన్నవలస, రైతు 

వ్యాధి నిర్ధారణకు చర్యలు తీసుకున్నాం
వ్యాధి సోకిన పశువుల నుంచి రక్త నమూనాల సేకరించి ల్యాబ్‌ పంపించాం. ఈ విషయం ఉన్నతాధికారులకు నివేదించాం. కొండ ప్రాంతం సమీపంలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. దీనికి కారణమైన వైరస్‌ను గుర్తించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతం వ్యాధి సోకిన పశువులకు యాంటీ బయోటిక్‌ ఇంజక్షన్‌లు వేస్తున్నాం. 
–ప్రదీప్‌ సాహు, మండల పశువైద్యాధికారి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top