సెల్‌ఫోన్‌ నిషేధం ఎత్తివేసినట్లేనా.!?  

Vijayawada Durga temple Bans Cell phones Issues  - Sakshi

సాక్షి, విజయవాడ : దుర్గగుడిలో సెల్‌ఫోన్‌ నిషేధం ఉన్నట్లా.. లేనట్టా..!  ఈ విషయం ఎవరికి అర్థం కావడం లేదు. ఏమి తెలియని భక్తులు గంటల తరబడి క్యూలైన్‌లో నిల్చుని సెల్‌ఫోన్‌ కౌంటర్‌లో భద్రపరుచుకుంటే.. అధిక శాతం మంది భక్తులు సెల్‌ఫోన్‌లతో క్యూలైన్‌లోకి ప్రవేశించి దర్శనం పూర్తి చేసుకుంటున్నారు. దర్శనం పూర్తయిన తర్వాత బయటకు వచ్చి ఆలయ ప్రాంగణంలో సెల్ఫీలు, ఫొటోలు దిగుతుంటే కౌంటర్‌లో సెల్‌ఫోన్‌ భద్రపరుచుకున్న భక్తులు ఆశ్చర్య పోవడం వారి వంతవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పేద ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల స్ఫూర్తితో దుర్గమ్మ భక్తులకు దేవస్థానం ఉచిత సేవలను అందించాలని నిర్ణయించినట్లు ప్రకటిస్తూ దుర్గగుడి ఈవో గత నెల 30వ తేదీ నుంచి సెల్‌ఫోన్లు భద్రపరుచుకునే కౌంటర్ల టికెట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే కౌంటర్ల నిర్వహణ భారం అనుకున్నారో.. లేక తనిఖీలు ఎందుకులే అనుకున్నారో ఏమో... నాటి నుంచి క్యూలైన్ల వద్ద తనిఖీలు ఎత్తి వేశారు. దీంతో భక్తులు సెల్‌ఫోన్లు పట్టుకుని ఆలయంలోకి ప్రవేశిస్తున్నారు.

మూడేళ్లగా నిషేధం అమలు :
మూడేళ్ల కిందట ఆలయ భద్రత విషయంలో మరింత కట్టుదిట్టంగా వ్యవహరించాలనే బావనతో అప్పటి ఈవో దుర్గగుడిలోకి భక్తులెవరూ సెల్‌ఫోన్‌తో ప్రవేశించకుండా నిషేధాజ్ఞలు అమలు చేశారు. దీంతో భక్తుల సెల్‌ఫోన్లు భద్రపరుచుకునేందుకు దేవస్థానం కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు కౌంటర్ల నిర్వహణ బాధ్యత ప్రైవేటు కాంట్రాక్టర్‌కు అప్పగించింది. అయితే భక్తుల నుంచి అధిక మొత్తంలో రుసుం వసూలు చేస్తున్నారనే కారణాన్ని చూపి కొద్ది నెలల కిందట కౌంటర్లను దేవస్థానం స్వాధీనం చేసుకుంది. ఇటీవల దుర్గగుడి ఈవో వీ.కోటేశ్వరమ్మ  ఆ సేవలను ఉచితం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉచిత సేవలతో సెల్‌ఫోన్‌ నిషేధాజ్ఞలు తుడిచి పెట్టుకుపోయాయి. క్యూలైన్ల వద్ద భక్తులకు కనీస తనిఖీలు లేకపోవడంతో  ఆలయంలోని సెల్‌ఫోన్లతో  ప్రవేశించడమే కాకుండా, భక్తులు నేరుగా అమ్మవారిని తమ సెల్‌ఫోన్‌లతో ఫొటోలు  తీస్తున్న  ఘటనలు పునరావృతం అవుతున్నాయి. రాజగోపురం, రావిచెట్టు వద్ద భక్తులు సెల్‌ఫోన్లతో తిరుగుతున్నా కనీస హెచ్చరికలు లేవు.

ఆదాయం కోల్పోతే.. వదిలేస్తారా..!
సెల్‌ఫోన్‌ కౌంటర్ల నిర్వహణతో దేవస్థానానికి ప్రతి రోజు వేలాది రూపాయల ఆదాయం సమకూరేది. ఆదాయం కోసం దేవస్థానం క్యూలైన్ల వద్ద ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని నియమించి మరీ హెచ్చరికలు జారీ చేసేవారు. భక్తులు క్యూలైన్‌ వద్దకు ఫోన్‌తో వస్తే.. వారు కుటుంబ సభ్యులతో ఉన్నా.. లేక చిన్న పిల్లలతో ఉన్నా సరే వెనక్కి పంపి మరీ కౌంటర్‌లో ఫోన్‌ పెట్టుకుని రావాలని సూచించే వారు. అయితే కొద్ది రోజులుగా క్యూలైన్ల వద్ద పరిస్థితి మారిపోయింది. కౌంటర్‌లో సేవలు ఉచితం కావడంతో సెల్‌ఫోన్‌ నిషేధం గురించి సెక్యూరిటీ సిబ్బంది మర్చిపోయినట్లు ఉన్నారు.. కనీసం తనిఖీలు లేవు.. సెక్యూరిటీ సిబ్బంది పక్కనే ఉన్నా క్యూలైన్‌లో అమ్మవారిని ఫొటోలు తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేవస్థానం వ్యవహరిస్తున్న తీరుపై కొంత మంది భక్తులు మండిపడుతున్నారు. సెల్‌ఫోన్ల నిషేధం అమలు చేస్తే ఖచ్చితంగా అమలు చేయాలని, లేని పక్షంలో పూర్తిగా నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top