ఐఎస్‌ఎల్‌ సొమ్ము స్వాహాపై విజిలెన్స్‌ విచారణ

Vigilance Enforcement Officers enquiry - Sakshi

పైడికొండ, ఆనూరులలో అధికారుల బృందం ఇంటింటా పర్యటన

విచారణ పూర్తయితే తేలనున్న అవినీతి బాగోతం

తొండంగి(తుని) : కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్‌ అమలులో భాగంగా అమలు చేస్తున్న వ్యక్తిగత మరుగుదొడ్ల(ఐఎస్‌ఎల్‌) నిర్మాణ పథకంలో లబ్ధిదారులకు తెలియకుండానే మరుగుదొడ్లు నిర్మించినట్టు చూపించి నిధులు కాజేసిన వ్యవహారంపై విజిలెన్స్‌ అధికారులు మంగళవారం విచారణ ప్రారంభించారు.పైడికొండ పంచాయతీలో పైడికొండతోపాటు ఆనూరు గ్రామాల్లో అధికారులు, కాంట్రాక్టర్‌ కలిసి 684 మరుగుదొడ్లు నిర్మించినట్టు ఆన్‌లైన్‌ రికార్డుల్లో చూపించారు.

వీటిలో సగానికి పైగా లబ్ధిదారులకు తెలియకుండానే మరుగుదొడ్లు లేని ఇళ్ల వద్ద, దీర్ఘకాలం క్రితం సొంత ఖర్చులతో మరుగుదొడ్లు నిర్మించుకున్న వారి వివరాలు నిర్మించినట్టు చూపారు. ఈ విధంగా ఒక్కో లబ్ధిదారుడి పేరు మీద రూ.15వేల చొప్పున సుమారు పైడికొండ పంచాయతీ పరిధిలో సుమారు రూ.60 నుంచి 70 లక్షల వరకు నిధులు కాజేసినట్టు ‘సాక్షి’ ఈ బాగోతాన్ని గతేడాది డిసెంబర్లో ప్రత్యేక కథనంతో వెలికితీయడం అప్పట్లో దుమారం రేగింది.

ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో ఆనూరు గ్రామంలోని బాధిత ప్రజలు జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పైడికొండలో బాధిత గ్రామస్తులందరూ వ్యవహారానికి కారకులైన గ్రామ కార్యదర్శి బుచ్చిరాజు, ఇతర అధికారులతోపాటు స్థానిక అ«ధికార పార్టీ నేతలను నిలదీసి జరిగిన అవినీతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు.

సదరు కాంట్రాక్టర్‌ ద్వారా కొంచెం నోరున్న నాయకుల నోరు మూయించేందుకు నేరుగా డబ్బులు పంపిణీ నిర్వహించారు. ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదుకు కలెక్టర్‌ ఆదేశాలతో జెడ్పీ సీఈవో ఆధ్వర్యంలో కొద్ది రోజుల క్రితం ఎంపీడీఓతో డ్వామా ఏపీఓ, ఇతర 34 మంది కూడిన బృందం పైడికొండ, ఆనూరు గ్రామాల్లో ఆన్‌లైన్‌ లబ్ధిదారుల రికార్డుల ప్రకారం ఇంటింటా పర్యటన నిర్వహించి వాస్తవ విషయాలను సేకరించి నివేదిక రూపొందించింది.

ఈ ప్రక్రియకు ముందు సదరు కాంట్రాక్టర్, అధికారులు కలిసి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించని వారి ఇళ్ల వద్ద ఆదరాబాదరాగా నిర్మాణాలు చేపట్టారు. కొన్నింటిని పూర్తి చేసినా అందరి లబ్ధిదారుల ఇళ్ల వద్ద వాటిని నిర్మించడంలో విఫలమయ్యారు. కాగా సొంత ఖర్చులతో మరుగుదొడ్డిని నిర్మించుకున్న వారికీ తమకు తెలియకుండా పేరు వాడుకున్నందుకు కూడా కాంట్రాక్టర్‌ నయానా, భయానా సొమ్ములు ముట్టజెప్పారని సమాచారం. 

ప్రారంభమైన విచారణ

పైడికొండ పంచాయతీలో జరిగిన ఐఎస్‌ఎల్‌ నిర్మాణ పథకంలో నిధుల దుర్వినియోగం, అవినీతి బాగోతాలపై విచారణ జరపాలంటూ ఆనూరుకు చెందిన బాధిత గ్రామస్తులు విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్‌ ఎస్పీ ఆదేశాల మేరకు విజిలెన్స్‌ డీఈ డీఎస్‌ఎన్‌ మూర్తి, మరికొంత మంది అధికారుల బృందం పైడికొండ, ఆనూరు గ్రామాల్లో విచారణ ప్రారంభించారు.

పైడికొండ పంచాయతీ కార్యాలయంలో రికార్డుల్లో వివరాలు సేకరించారు. అనంతరం గ్రామంలో ఇంటింటా లబ్ధిదారుల పేర్లు ఆధారంగా అధికారుల బృందం స్టేట్‌మెంట్లు నమోదు చేసుకున్నారు. సేకరించిన వివరాలతోపాటు విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని డీఈ మూర్తి తెలిపారు మరో రెండు రోజుల పాటు విచారణ జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. 

ఇతర గ్రామాల్లోనూ ఇదే తంతు?

పైడికొండ అక్రమాలు బయటపడడంతో మిగిలిన పంచాయతీల్లో ప్రజలు కూడా తమ వివరాలు దుర్వినియోగమయ్యాయేమోనని వెతుకులాటలో పడ్డారు. దీంతో పి.ఇ.చిన్నాయపాలెం, బెండపూడి తదితర గ్రామాల్లో కూడా లబ్ధిదారుల పేరుమీద భారీస్థాయిలో నిధులు కాజేసినట్టు తెలిసింది. దీంతో బాధిత ప్రజలు ఇప్పటికే ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మరికొంత మంది ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top