గ్రామాల్లో మంత్రి లోకేశ్‌ అనుచరుల వీడియోలు

Videos Of Minister Lokesh's Followers In Villages - Sakshi

పోలీసులకు అప్పగించిన వైఎస్సార్‌ సీపీ నేతలు

ఆలమూరు (కొత్తపేట): డాక్యుమెంటరీ, షార్ట్‌ ఫిల్ము పేరిట గ్రామాల్లో కొంతమంది యువకులు శనివారం ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు. వారిని ప్రశ్నిస్తే మంత్రి నారా లోకేశ్‌ అనుచరులమని, గ్రామాల్లో వీడియో తీసి ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు పంపించారని చెబుతున్నారు. పెదపళ్ల, చింతలూరు గ్రామాల్లో వేర్వేరు వాహనాల్లో నలుగురు యువకులు వచ్చారు. పెదపళ్లలో మండల పరిషత్‌ ప్రత్యేక పాఠశాల ఆవరణ, చింతలూరులో శ్రీ నూకాంబికా ఆలయం ప్రవేశ మార్గం వద్ద వారు వీడియో తీశారు. ప్రభుత్వ పథకాలపై అభిప్రాయాలను అక్కడ మహిళల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారి వద్ద ఉన్న పుస్తకాల్లో టీడీపీకి చెందిన కొందరి నేతలు ఫొటోలు ఉండటంతో స్థానికులకు అనుమానం వచ్చింది.

వారి ఫిర్యాదుతో వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి నామాల శ్రీనివాస్‌ వారిని నిలదీస్తే పొంతన లేని సమాధానాలిచ్చారు. అమరావతికి చెందిన యువకుడు సందీప్‌ వీడియోలు తీయాలని పంపాడని ఆ యువకులు తెలిపారు. పెదపళ్లలో దొంగచాటుగా వీడియోలు తీస్తున్న ఇద్దరు యువకులను ఎంపీటీసీ ఏడిద మెహర్‌ప్రసాద్‌ అడ్డుకున్నారు. వారిపై మండల కోడ్‌ ఆఫ్‌ కాండక్టు (ఎంసీసీ) బృందానికి ఫిర్యాదు చేయడంతో వారు సంఘటన స్థలానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు.

ఆ రెండు గ్రామాల్లో నిబంధనలకు వ్యతిరేకంగా వీడియోలు తీస్తున్న నలుగురు యువకులను ఎంపీడీఓ టీవీ సురేందర్‌రెడ్డి, ఎస్సై టి.క్రాంతికుమార్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అయితే ఎంసీసీ బృందం సభ్యులు మాత్రం వీరి వద్ద పార్టీ జెండాలు లేకపోవడం వల్ల వెంటనే కేసులు నమోదు చేయలేమని చెప్పడం విమర్శలకు తావిచ్చింది. దీనిపై వైఎస్సార్‌ సీపీ నేత శ్రీనివాస్‌ నియోజకవర్గ ఆర్‌ఓకు, ఎంసీసీ బృందానికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేయకుంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు మోరంపూడి వాసు, పెద్దింటి కాశీ, మార్గాని యేసు తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top