బదిలీ బహుమానం!

VC Prasanthi Transfer to Kurnool - Sakshi

అహుడా వీసీకి స్థానచలనం

కర్నూలు కమిషనర్‌గా నియామకం

అధికార పార్టీ ఒత్తిళ్లే కారణమా?

అనంతపురం న్యూసిటీ: అధికారులు నిక్కచ్చిగా వ్యవహరిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని టీడీపీ నేతలు మారోమారు చాటుకున్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో వ్యవహరించే అహుడా వీసీ ప్రశాంతిపై బదిలీ వేటు పడింది. ప్రభుత్వం ఆమెను కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్‌గా నియమిస్తూ గురువారం జీఓ విడుదల చేసింది. ఈ ఏడాది జూన్‌ 8న అహుడా వీసీగా ప్రశాంతి బాధ్యతలు చేపట్టారు. ఇదేఏడాది అక్టోబర్‌ 11న ఆమెకు ఐఏఎస్‌గా పదోన్నతి లభించింది.

అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే వీసీ బదిలీ జరిగినట్లు చర్చ జరుగుతోంది. బాధ్యతలు తీసుకున్న అనతి కాలంలోనే జిల్లాలోని రాప్తాడు, పెనుకొండ, అనంతపురం రూరల్, గోరంట్ల తదితర ప్రాంతాల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన లేఅవుట్ల విషయంలో కఠిన చర్యలు తీసుకున్నారు. ప్రత్యక్షంగా పర్యటించి సంబంధిత బిల్డర్లపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు లోబడి నిర్మాణాలు చేపట్టాల్సిందేనని అల్టిమేటం జారీ చేశారు. పెనుకొండలో నిర్మాణాలను సైతం తొలగించేందుకు చర్యలు చేపట్టారు. మంత్రి పరిటాల సునీత నియోజకవర్గం రాప్తాడులోనూ అక్రమ లేఅవుట్లపై ఉక్కుపాదం మోపారు. ఇకపోతే గతనెల 28న కియా సమీపంలోనూ అక్రమ నిర్మాణాలపై కొరడా ఝలిపించారు. ఆహుడా పరిధిలో ఎలాంటి అక్రమాలనైనా సహించేది లేదని ఆమె తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే వీసీని ఆగమేఘాలపై బదిలీ చేయించినట్లు ప్రచారం జరుగుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top