
సాక్షి, కృష్ణా జిల్లా : తారకరామా ఎత్తిపోతల పథకం పనులను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మంగళవారం పరిశీలించారు. అందులో భాగంగా జి కొండూరు మండలం పినపాక, కట్టుబడిపాలెం సమీపంలో ఉన్న పంపు హౌస్‌లను ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇందులో నాలుగు పంపుహౌస్‌లు ఉంటే కేవలం ఒకటే పనిచేస్తుందని తెలిపారు. చాలా కాలంగా పనులను పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. మోటర్లకు మరమత్తుల చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
రైతులకు నీళ్లు అందించాల్సిన సమయంలో పంపు సెట్లు పని చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నాలుగు పంపు హౌస్‌లు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ఆయన వెంట అధికారులు, రైతులు, వైఎస్సార్‌సీపీ నాయకులు ఎత్తిపోతల పథకం పనులను సందర్శించారు.