నేడు ప్రేమికుల దినోత్సవం | valentine's day special | Sakshi
Sakshi News home page

నేడు ప్రేమికుల దినోత్సవం

Feb 14 2014 4:07 AM | Updated on Feb 10 2020 3:26 PM

నేడు ప్రేమికుల దినోత్సవం - Sakshi

నేడు ప్రేమికుల దినోత్సవం

‘నా భార్య పేరు వెంకటేశ్వరి. మా ఇద్దరి మతాలు వేరు. కళాశాల తరగతి గదిలో మా మధ్య పుట్టిన ప్రేమ పెళ్లికి దారితీసింది.

 నరసాపురం టౌన్, న్యూస్‌లైన్ : ‘నా భార్య పేరు వెంకటేశ్వరి. మా ఇద్దరి మతాలు వేరు. కళాశాల తరగతి గదిలో  మా మధ్య పుట్టిన ప్రేమ పెళ్లికి దారితీసింది. మేమిద్దరం నరసాపురం వైఎన్ కళాశాలలో డిగ్రీ చదువుతుండగా మా మధ్య ప్రేమ చిగురించింది. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అందుకు రెండువైపుల వారూ అంగీకరించలేదు. ధైర్యం చేసి మిత్రుల సహకారంతో వివాహం చేసుకు న్నాం. ఇది జరిగి 19 ఏళ్లు గడిచింది.  ఏటా ‘వాలంటైన్స్ డే’ను మేం పండగలా జరుపుకుంటున్నాం. మాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి అఖిల ఇంటర్మీడియెట్ సెకండియర్ చదువుతోంది. మా అబ్బాయి ఆకాష్ ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. నేను రాజకీయ రంగంలో ఉన్నాను. నరసాపురం మండలం మల్లవరంలంక సొసైటీ అధ్యక్షునిగా, డీసీసీబీ డెరైక్టర్‌గా సేవలందిం చాను. ప్రేమకు కుల మతాలు అడ్డుకాకూడదు. జీవితాంతం కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడుంటేనే వారు నిజమైన ప్రేమికులని నేను, వెంకటేశ్వరి ఇప్పటికీ నమ్ముతున్నాం. ప్రేమంటే ఆకర్షణ కాదు.. ఒకరిపై ఒకరికి గల నమ్మకం. ఇదే మనుషుల్ని నిలబెడుతుంది.’
 - రావి కోటేశ్వరరావు, నరసాపురం
 
 పైపై మెరుగులు ప్రేమ కాదు
 తణుకు టౌన్, న్యూస్‌లైన్ : ‘నేటి యువత పైపై మెరుగులకే ప్రాధాన్యం ఇస్తోంది. ఇటువంటి ప్రేమలు ఎంతోకాలం నిలవవు’ అంటున్నారు డాక్టర్ వంక వెంకటరామదాసు, వసుంధర దంపతులు. మాజీ ఎమ్మెల్యే వంక సత్యనారాయణ కుమారుడైన రామదాసు, వసుంధర వైద్య విద్య పూర్తిచేసిన అనంతరం ఏఐఎస్‌ఎఫ్‌లో విద్యార్థి సంఘ నాయకులుగా పనిచేశారు. ఆ దశలో వారిమధ్య పరిచయం ప్రేమకు దారితీసింది. వసుంధర తండ్రి కూడా కమ్యూ నిస్టు నాయకుడు కావడంతో వారిని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ‘అవతలి వారి స్వభావాన్ని అంచనా వేయకుండా పైపై మెరుగులు చూసి ప్రేమలో పడడం సరికాదు. ప్రేమను వ్యక్తం చేయడం నేడు ఫ్యాషన్‌గా మారింది. కులమతాలు, వేషధారణకు అతీతంగా నిలిచేదే ప్రేమ. వారే నిజమైన ప్రేమికులు’ అన్నారు.
 
 ఓర్పు, సహనం కావాలి
 నరసాపురం (రాయపేట), న్యూస్‌లైన్ : ‘ప్రేమికులకు ఓర్పు, సహనం కావాలి. పెద్దలను నొప్పించకుండా ఒప్పించే ప్రయత్నం చేయాలి. అవసరమైతే పెద్దలు ఒప్పుకునే వరకు నిరీక్షించాలి. పెళ్లికి తొందరపడకూడదు’ అంటున్నారు డాక్టర్ దంపతులు కొప్పర్తి నరేంద్రనాథ్, వినీల దంపతులు. గుజరాత్‌లో ప్రముఖ్ స్వామి మెడికల్ కళాశాలలో చదువుతున్నప్పడు తాము ప్రేమలో పడ్డామని చెప్పా రు. పెళ్లికి పెద్దలు అంగీకరించడంతో 2007లో ఒక్కటైనట్లు చెప్పారు. తమకు కవల పిల్లలు పుట్టారని చెప్పారు. ‘ఉమ్మడి కుటుంబాల్లో కలిసి ఉండటానికి ప్రేమికులు ఇష్టపడాలి. అప్పుడే ప్రేమకు పరిపూర్ణత దక్కుతుంది. దీనివల్ల పెద్దలపై పిల్లలకు ప్రేమాభిమానాలు పెరుగుతాయి. సంస్కృతి, సంప్రదాయాలు అలవడతాయి. ప్రేమ రెండు కుటుంబాలను కలిపేదిగా ఉండాలి. ఇరు కుటుంబాలు అర్థం చేసుకునేలా ప్రేమికులు వ్యవహరించాలి.’ అని పేర్కొన్నారు నరేంద్రనాథ్, వినీల.
 
 ఒకే అభిప్రాయంతో ఉండాలి
 తణుకు అర్బన్, న్యూస్‌లైన్ : ‘ప్రేమికులు పెళ్లితో ఒక్కటై.. ఒకే అభిప్రాయంతో నడిస్తే జీవితం మధురానుభూతిని మిగులుస్తుంది’ అంటున్నారు తణుకుకు చెందిన కొమ్మిరెడ్డి శ్రీనివాసు, దుర్గాభవాని దంపతులు. కళాశాలలో ప్రేమలో పడిన ఈ జంట తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడంతో స్నేహితుల సమక్షంలో ద్వారకాతిరుమలలో 1989లో పెళ్లి చేసుకున్నారు. ‘నా అభిప్రాయాలతో ఏకీభవించే భవానిని భార్యగా పొందడం నా అదృష్టం. ప్రేమ పెళ్లి వల్ల పెద్దల మనసు గెలుచుకోలేకపోయాం. పెళ్లి తరువాత ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అయినా స్వశక్తితో పైకి వచ్చాం. అనుక్షణం నా భార్య నాకు అండగా నిలిచింది. ప్రేమికులు ముందుగా పెద్దలను ఒప్పించుకునే పెళ్లి చేసుకోవాలి. లేకపోతే తరువాత వచ్చే ఇబ్బందులతో వైవాహిక జీవితంలో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. ప్రేమికులు దంపతులైన తరువాత ఎదురయ్యే కష్టాలను ఇష్టంగా భరిస్తే.. జీవితం మధురమే’ అని వివరించారు. పెద్ద కుమారుడు హేమ నాగ వెంకట కృష్ణచరణ్ మూడేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ప్రస్తుతం వారికి ఎం.ఫార్మశీ చదువుతున్న శ్రీవినయ్ సాయి దుర్గేష్ కుమార్ ఉన్నాడు.
 
 ఈ గ్రీటింగ్ ప్రత్యేకం
 పాలకోడేరు రూరల్, న్యూస్‌లైన్ : ప్రేమలో మునిగి తేలుతున్న ప్రేయసీప్రియులు ఒకరికొకరు ఊహించని బహుమతులను ఇచ్చుకుంటూ వారిని ఆశ్చర్యంలో ముంచెత్తుతుండడం తెలిసిందే. కొందరు పెళ్లి అనంతరం కూడా ఇదే తరహాలో బహుమతులను ఇవ్వడం అరుదు. అయితే పాలకోడేరు మండలం వేండ్రకు చెందిన టి.కృష్ణ తను ప్రేమించి పెళ్లాడిన భార్య మహాలక్ష్మికి అందజేసేందుకు ప్రత్యేకంగా గ్రీటింగ్‌కార్డ్‌ను తయారుచేశాడు. సహజంగా కళాకారుడు కావడంతో వెదురుపుల్లలు, ఐస్‌క్రీం పుల్లలతో సహజత్వం ఉట్టిపడేలా దీనిని తయారుచేసి భార్యపై తన ప్రేమను మరోసారి చాటాడు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement