ఆపద్బాంధవా..! | Sakshi
Sakshi News home page

ఆపద్బాంధవా..!

Published Sun, Jan 12 2014 2:32 AM

vaikunta ekadasi grand celebrations Ananthapuram district

 అనంతపురం, న్యూస్‌లైన్ నెట్‌వర్క్ : ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని జిల్లాలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి క్యూలైన్లలో నిలబడిన భక్తులు.. శనివారం తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వారం నుంచి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతపురంలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కదిరి ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామిని కదిరి పరిసర మండలాలతో పాటు కర్ణాటక నుంచి వచ్చిన భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజామున 2.30 గంటలకు స్వామి వారిని వైకుంఠ ద్వారం (ఉత్తర గోపురం) వద్దకు తీసుకురాగానే భక్తులు ‘గోవిందా..గోవింద’ అంటూ తన్మయత్వం పొందారు. 3 గంటల నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు అర్చకులు వైకుంఠ ద్వార ప్రవేశంలో ప్రత్యేకంగా శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు.
 
 మధ్యాహ్నం 3 గంటల వరకు వైకుంఠ దర్శనభాగ్యం కల్పించారు. లక్ష మందికి పైగా భక్తులు హాజరైనట్లు ఆలయ అధికారులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సతీసమేతంగా తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణతో పాటు పలు రాజకీయ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.
 
 డీఎస్పీ దేవదానం ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టారు.
 ఉరవకొండ మండల పరిధిలోని పెన్నహోబిలంలో ఉత్తర గోపురం నుంచి లక్ష్మీనరసింహస్వామిని   భక్తులు దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారికి మహా మంగళహారతి, దీక్షాహోమం, అర్చన చేపట్టారు. ముక్కోటి ఏకాదశి విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు ద్వారకనాథాచార్యులు భక్తులకు తెలియజేశారు. ఏర్పాట్లను ఈఓ బోయపాటి సుధారాణి పర్యవేక్షించారు. గుంతకల్లు మండల పరిధిలోని కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి మూలవిరాట్‌కు వేకువజామున నిత్యాభిషేకం చేసి బెంగళూరు నుంచి తెప్పించిన పుష్పాలతో అలంకరించారు. అనంతరం ఉత్సవ విగ్రహాన్ని పల్లకిపై తీసుకొచ్చి ఉత్తర ద్వారంలో కొలువుదీర్చగా.. భక్తాదులు దర్శించుకున్నారు.
 
 జిల్లా నుంచే కాకుండా కర్నూలు, బళ్లారి నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. ఈఓ ఎంవీ సురేష్‌బాబు, అనువంశిక ధర్మకర్త కె.సుగుణమ్మ ఏర్పాటను పర్యవేక్షించారు. హిందూపురంలోని శ్రీపేట వెంకటరమణస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ద్వారంలోకి వెళ్లడానికి ముందు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏడు ద్వారాల నుంచి భక్తులు వెళ్లారు. ఇందుకోసం ఆలయానికి 900 అడుగుల దూరంలో క్యూకట్టారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్వామివారిని భక్తాదులు దర్శించుకున్నారు.  కొత్తచెరువు మండలం చెన్నకేశవపురంలోని చెన్నకేశవస్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన ఏడు ద్వారాల నుంచి వెళ్లి భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. తాడిపత్రిలోని చింతల వెంకటరమణ స్వామి దేవాలయంలో తెల్లవారుజామున 2 గంటల నుంచే భక్తులు బారులు తీరారు.   
 

Advertisement
Advertisement