సమైక్య ఉద్యమం రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. కుల,మతాలతో సంబంధం లేకుండా, తెలుగువారంతా కలిసి ఉండాలనే ఏకైక లక్ష్యంతో జిల్లా ప్రజలంతా ఏకమై సమైక్యరాష్ట్రం కోసం ఉద్యమిస్తున్నారు. గత నెల 31న ప్రారంభమైన ఉద్యమం శనివారం పదకొండోరోజుకు చేరింది.
జిల్లాలో సమైక్య ఉద్యమం అప్రతిహతంగా సాగుతోంది. జేఏపీ నేతలు ఉద్యమానికి శ్రీకారం చుడితే...ఉపాధ్యాయులు ఊతమయ్యారు...అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు చేయి కలిపారు.. ప్రజా సంఘాలు, న్యాయవాదులు ఉద్యమ ఉధృతికి తోడ్పాటునందిస్తున్నారు...తెలుగుతల్లి కోసం వ్యాపారులూ సమైక్య గళం వినిపిస్తున్నారు. అంధవిద్యార్థులు అండగా నిలిచారు. ఓ వర్గం కాదు...ఓ మతం కాదు..అందరూ ఉద్యమంలో పాల్గొంటున్నారు. సమైక్యవాణి ఢిల్లీకి వినిపించేలా పోరాటం సాగిస్తున్నారు.
సాక్షి, కడప:
సమైక్య ఉద్యమం రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. కుల,మతాలతో సంబంధం లేకుండా, తెలుగువారంతా కలిసి ఉండాలనే ఏకైక లక్ష్యంతో జిల్లాప్రజలంతా ఏకమై సమైక్యరాష్ట్రం కోసం ఉద్యమిస్తున్నారు. గత నెల 31న ప్రారంభమైన ఉద్యమం శనివారం పదకొండోరోజుకు చేరింది. జిల్లా అంతటా రిలే దీక్షలు, నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పట్టణాల నుంచి పల్లెల వరకూ ఉద్యమాన్ని తీసుకెళ్లి కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. ట్రాక్టర్లు, ఎద్దులబండ్లతో రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపేలా ప్రణాళిక రచించారు. 20వ తేదీ నుంచి గ్రామస్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నారు. కడపలో న్యాయవాదులు, ఉపాధ్యాయల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు.
మంత్రులు సీ రామచంద్రయ్య, అహ్మదుల్లా ఇళ్లను ముట్టడించారు. సీఆర్‌సీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పూలు, గాజులు వేసుకోవాలని కోరుతూ వాటిని ఇంటికి తగిలించి వెళ్లారు. మంత్రి అహ్మదుల్లా ర్యాలీలో పాల్గొని సమైక్య నినాదం చేశారు. బ్రెయిలీ స్కూలు విద్యార్థులు ‘అంధుల సంయుక్త కార్యాచరణ సమితి’ పేరుతో అంధుల పాఠశాల నుంచి ర్యాలీ నిర్వహించారు. కృష్ణా సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. క్రీడాకారులు, క్రీడాభిమానులు ర్యాలీ చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు నిత్యానందరెడ్డి చేపట్టిన ఆమరణనిరాహారదీక్ష ఆరోరోజుకు చేరింది. దీక్షాశిబిరం వద్ద కళాకారులు ఆడిపాడారు. మెడికల్, ఫార్మామెడికల్ జే ఏసీ నేతలు ర్యాలీ నిర్వహించారు. పశుసంవర్ధకశాఖ అధికారులు నోటికి నల్లరిబ్బన్ ధరించి మౌనర్యాలీ చేపట్టారు. ఎన్‌ఆర్‌ఐ ట్రస్టు అధ్యక్షుడు తోటకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ, వంటావార్పు నిర్వహించారు.
ఆంటోని కమిటీ రద్దు చేయాలని ఎమ్మెల్యే వీరశివారెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్తు కార్మికుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. కడప ప్రెస్‌క్లబ్‌లో మంత్రి అహ్మదుల్లా, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, లింగారెడ్డి, వీరశివారెడ్డి, ఎమ్మెల్సీలు దేవగుడి నారాయణరెడి,్డ మాజీ మంత్రులు రామసుబ్బారెడ్డి, బ్రహ్మయ్య, మాజీ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డితో పాటు పలువురు రాజకీయానేతలు సమావేశం నిర్వహించారు. సమైక్య ప్రకటన వెలువడేదాకా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని కార్యాచరణ రూపొందించారు.
ప్రొద్దుటూరులో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల నిర్వాహకులు భారీ ర్యాలీ నిర్వహించారు. చెక్కభజన, డప్పులు, వాయిద్యాలతో హోరెత్తించారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి దగ్ధం చేశారు. ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. హిజ్రాలు కూడా ర్యాలీ నిర్వహించారు. సోనియా దిష్టిబొమ్మకు శవయాత్రను చేపట్టారు. ఏడుస్తూ, కేంద్ర నేతలను తిడుతూ వినూత్న నిరసన తెలిపారు. సున్నంబట్టి యువకులు కూడా శవయాత్ర చేపట్టారు. న్యాయవాదులు, ప్రైవేటు, ప్రభుత్వ ఉపాధ్యాయుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. దువ్వూరు మండల ఉపాధ్యాయులు శనివారం దీక్షలో పాల్గొన్నారు. రాయచోటిలో జేఏసీ, న్యాయవాదుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. పులివెందులలో భవననిర్మాణ కార్మికులు, ప్రైవేటు డాక్టర్లు ర్యాలీ నిర్వహించి, రిలేదీక్షలకు కూర్చున్నారు. ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. జమ్మలమడుగులో ఉపాధ్యాయసంఘాలు, ప్రజాసంఘాల వారు ర్యాలీ నిర్వహించారు. వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించారు. చిన్నపిల్లలు స్వచ్ఛందంగా ర్యాలీ చేపట్టి కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. రాజంపేటలో పొట్టిశ్రీరాములు విగ్రహానికి జేఏసీ నాయకులు పాలాభిషేకం చేశారు. సుండుపల్లి, వీరబల్లిలో దీక్షలు కొనసాగుతున్నాయి. రైల్వేకోడూరులో బ్రాహ్మణులు వైఎస్సార్ సర్కిల్‌లో హోమం చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఆకాంక్షించారు. మైదుకూరులో ఉపాధ్యాయ సంఘాలు, బీటెక్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించి రిలేదీక్షలకు కూర్చున్నారు. టీడీపీ నేత పుట్టా సుధాకర్‌యాదవ్ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఎర్రగుంట్లలో జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి.