అర్చకులపై అస్త్రం

TTD Officials Vs TTD Priests In Tirupati - Sakshi

65 ఏళ్లు దాటితే ఉద్వాసనే ధర్మకర్తల మండలి కీలక నిర్ణయం

16 మంది అర్చకులపై వేటుపడే అవకాశం

ఉద్యోగ విరమణ వర్తించే వారిలో రమణ దీక్షితులు

టీటీడీ అధికారులు, అర్చకుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం

టీటీడీ ధర్మకర్తల మండలి తాజాగా తీసుకున్న ఉద్యోగ విరమణ వర్తింపు నిర్ణయం వంశపారంపర్య అర్చకుల్లో తీవ్ర అలజడి రేపుతోంది. మిరాశీ, నాన్‌ మిరాశీ కుటుంబాలుగాచెప్పుకునే అర్చకుల్లో ఆందోళన పెంచింది.టీటీడీ ఉద్యోగ వర్గాల్లో ఈ విషయం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ధర్మకర్తల మండలితొలి సమావేశంలోనే కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక గల కారణాలపై విశ్లేషిస్తున్నారు.ఆలయ ప్రధానార్చకులు రమణ దీక్షితులుమంగళవారం సాయంత్రం చెన్నైలో మీడియాకు వెల్లడించిన వివరాలకు ప్రతీకారంగానే ధర్మకర్తల మండలి అర్చకుల ఉద్యోగ విరమణ నిర్ణయం తీసుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమలలో ప్రస్తుతం మిరాశీ కుటుంబాలకు చెందిన వంశ పారంపర్య అర్చకత్వ సేవల్లో 52 మంది అర్చక స్వాములున్నారు. ధర్మకర్తల మండలి తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం చూస్తే ఇందులో 16 మంది 65 ఏళ్ల పైబడిన వారున్నారు. మార్గదర్శకాలు అమల్లోకి వస్తే వీరి తొలగింపు అనివార్యమవుతుంది. ఆలయ ప్రధానార్చక కుటుంబాలకు చెందిన రమణ దీక్షితులు, నరసింహదీక్షితులు, శ్రీనివాస, నా రాయణ దీక్షితులు సైతం ఉద్యోగ విరమణతీసుకోవాల్సి ఉంటుంది. ధర్మకర్తల మండలి తీసుకున్న ఈ కీలక నిర్ణయంపై అర్చకులు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1996లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను టీటీడీ అధికారులు ఉల్లంఘించే చర్యలకు పూనుకుంటున్నారని అర్చకస్వాములు ధ్వజమెత్తుతున్నారు.

ప్రతీకార నిర్ణయమేనా...
మంగళవారం చెన్నైలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆలయ ప్రధానార్చకులు రమణ దీక్షితులు టీటీడీలో జరుగుతున్న నిబంధనల ఉల్లంఘన, అర్చకులకు జరుగుతున్న అన్యాయం, అధికారుల ఏకపక్ష నిర్ణయాలపై మాట్లాడారు. టీటీడీ అధికారు ల వ్యవహార శైలిపై ధ్వజమెత్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న అధికారులు ధర్మకర్తల మండలిపై ఒత్తిడి తెచ్చి ఉద్యోగ విరమణ వర్తింపు నిర్ణయానికి కారకులయ్యారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయంపై స్పందించిన రమణ దీక్షితులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తనపై ప్రతీకారంగానే వయోపరిమితి నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.

ఉద్యోగ వర్గాల్లో దుమారం..
రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు, సంధించిన విమర్శనాస్త్రాలు టీటీడీ ఉద్యోగ వర్గాల్లో పెద్ద దుమారం లేపాయి. బుధవారం జరిగిన ధర్మకర్తల మండలిలోనూ సభ్యులు ఇదే విషయాన్ని లేవనెత్తారు. దాదాపు అరగంటకు పైగా ఇదే విషయంపై చర్చించారు. బోర్డు తొలి సమావేశం జరిగే ముందు రోజే రమణ దీక్షితులు విమర్శలు చేయడం, టీటీడీ తప్పులను ఎత్తిచూపడంపై కొంతమంది సభ్యులు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలను చూస్తుంటే టీటీడీ అధికారులు, అర్చకుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైనట్లు స్పష్టంగా తెలుస్తోంది.

తప్పు చెబితే ప్రతీకారమా..
వంశపారంపర్య అర్చకత్వంలో జోక్యం కల్పించుకునే అధికా రం టీటీడీకి లేదు. ఆగమశాస్త్రానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నందుకే ఈ ప్రతీకార చర్య తీసుకున్నారు.
రమణ దీక్షితులు, తిరుమల ప్రధానార్చకులు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top