‘పర్యాటక మండపం’ తెరిచేదెప్పుడో?

TTD Neglect On Tourist Wedding Hall - Sakshi

నిర్వహణపై అధికారుల అశ్రద్ధ

శిథిలావస్థకు చేరుతున్న భవనం

ఆధునికీకరించాల్సిన ఆవశ్యకత

వినియోగంలోకి తెస్తే ప్రభుత్వానికి ఆదాయం

కడప కల్చరల్‌ :  నిత్యం పర్యాటకులతోనో, పెళ్లికి వచ్చిన జనం సందడితోనో కళకళలాడుతుండాల్సిన పర్యాటక కల్యాణ మండపం బోసిపోయి కనిపిస్తోంది. చాలా రోజుల నుంచి దీన్ని వాడకపోవడంతో ప్రస్తుతం శిథిల భవనంగా కనిపిస్తోంది. జిల్లాలోని పర్యాటక క్షేత్రాల వద్ద భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించడంలో భాగంగా కొన్ని క్షేత్రాల వద్ద యాత్రికుల వసతి భవనాలు, మరికొన్ని చోట్ల బోటింగ్, ఇంకొన్ని చోట్ల షెల్టర్లు, విశ్రాంతి భవనాలు తదితరాలు నిర్మించారు. దేవునికడప శ్రీ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయానికి దగ్గరగా పాత కడప చెరువుకట్టపై పర్యాటక భవనాన్ని నిర్మించారు. నిర్వహణ కోసం వీటిలో కొన్నింటిని కొన్నాళ్ల తర్వాత 2012లో జిల్లా దేవాదాయ శాఖకు అప్పగించారు.

తిరోగమనం
తొలుత అంతంత మాత్రంగానే ఉన్నా.. ఆ తర్వాత దీన్ని పూర్తి స్థాయి కల్యాణ మండపంగా మార్చుకుని దేవాదాయ శాఖ అధికారులు కూడా ఉత్సాహంగానే నిర్వహించారు. తర్వాత ఏటా దీన్ని కాంట్రాక్టు ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం మొదలైంది. అధికారుల నిర్వహణ లేకపోవడంతో ఈ భవనంలో కల్యాణాలు జరగడం బాగా తగ్గిపోయింది. దీంతో తమకు నష్టం వస్తున్నట్లు కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. ఆ తర్వాత రెండు సార్లు వేలం పాట నిర్వహించినా.. అధికారులు ఆశించిన మేరకు పాట రాకపోవడంతో కాంట్రాక్టును ఖరారు చేయలేదు. ఈ మధ్యలో ఆ భవనాన్ని తమ శాఖకు చెందిన స్థలంలో అనుమతులు లేకుండా నిర్మించారని, దాన్ని తమ శాఖకు అప్పగించాలని మత్స్యశాఖ అధికారులు అడ్డుచెప్పారు. ఆ శాఖ అధికారులు అటు దేవాదాయ శాఖకు, ఇటు టూరిజం శాఖ అధికారులు ఈ విషయంగా తమ అభ్యంతరాలను తెలుపుతూ లేఖలు రాయడం ప్రారంభించారు. ఈ మధ్యలో దాదాపు ఐదు నెలలుగా భవనం ఖాళీగా ఉంది. వాడుకలో లేకపోవడంతో మెట్లు కొన్ని చోట్ల విరిగిపోయాయి. కారిడార్‌ లోపలికి కుంగిపోయి పనికి రాకుండా మారింది.

సౌకర్యాల లేమి?
ప్రస్తుతం అత్యాధునిక కల్యాణ మండపాలు పెరగడంతో.. పర్యాటక మండపంలో వివాహాలు చేసుకునే వారి సంఖ్య తగ్గింది. బాగా ఆదాయం తెస్తున్న ఈ భవనానికి.. ఒక్కసారిగా ఆదాయం పడిపోయింది. దీన్ని వీలైనంత త్వరగా వాడుకలోకి తెచ్చి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి అవసరమైన మేర ఆధునికీకరించి అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top