గిరి పుత్రిక.. ప్రోత్సాహం అందక. | Tribal Girl Weeding Scheme Stopped In Kurnool | Sakshi
Sakshi News home page

గిరి పుత్రిక.. ప్రోత్సాహం అందక.

Mar 23 2018 12:50 PM | Updated on Oct 30 2018 8:01 PM

Tribal Girl Weeding Scheme Stopped In Kurnool - Sakshi

కర్నూలు(అర్బన్‌):రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన గిరి పుత్రిక కల్యాణ పథకానికి సంబంధించిన బిల్లులు ట్రెజరీలో ఆగిపోయాయి. దీంతో ప్రభుత్వ ప్రోత్సాహకం కోసం గిరిజన సామాజిక వర్గానికి చెందిన కొత్త జంటలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాయి. 2015 ఏప్రిల్‌ ఒకటో తేదీ తర్వాత వివాహం చేసుకున్న గిరిజన యువతులకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఒక్కో జంటకు ఏకమొత్తంలో రూ.50 వేల ప్రోత్సాహకాన్ని అందిస్తారు. ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌ నుంచి నిధులను విడుదల చేసేందుకు వీలుగా ప్రభుత్వం జీఓ–12 జారీ చేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 106 గిరిజన జంటలు ప్రభుత్వ ప్రోత్సాహకం కోసం దరఖాస్తు చేసుకున్నాయి.

ఈ దరఖాస్తులను గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో విచారించారు. ఆ తర్వాత ప్రోత్సాహకం అందించేందుకు బిల్లులు సిద్ధం చేసి ట్రెజరీకి పంపారు. అలాగే ఇతర కులాల వారు ఎవరైనా గిరిజనులను వివాహం చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో జంటకు రూ.50 వేల ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. ఇందుకోసం జిల్లాలో ఐదు జంటలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇప్పటికి ఆరు నెలలు గడిచిపోయింది. వీరికి రూ.2.50 లక్షలు విడుదల చేయాలంటూ అధికారులు ట్రెజరీకి బిల్లులు పెట్టారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి బిల్లులు మంజూరు చేయకుండా ట్రెజరీలో ఫ్రీజింగ్‌ విధించింది. దీంతో గిరిజన సంక్షేమ శాఖకు చెందిన పలు బిల్లులు కూడా ఆగిపోయాయి. ఈ నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో తక్షణమే బిల్లులు మంజూరు కాకుంటే మరో నెల రోజులు ఎదురు చూడాల్సిందే. 

విద్యుత్‌ బిల్లులదీ ఇదే తీరు..
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమల్లోకి వచ్చిన తర్వాత 0 నుంచి 75 యూనిట్లలోపు గిరిజనుల  విద్యుత్‌ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తోంది. జిల్లాలో 20,117 విద్యుత్‌ కనెక్షన్లకు సంబంధించి  రూ.41 లక్షల బిల్లులను ఆ శాఖకు చెల్లించేందుకు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ట్రెజరీకి పంపారు. అవి కూడా ఫ్రీజింగ్‌లో పడ్డాయి. ఈ నెలాఖరు నాటికి బిల్లులు చెల్లించాలని, లేని పక్షంలో కనెక్షన్లు కట్‌ చేస్తామని విద్యుత్‌ శాఖ హెచ్చరించే ప్రమాదముంది. గతంలోనూ ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా పలు ఎస్టీ కాలనీలు, తండాల్లో నేరుగా వినియోగదారుల నుంచి వసూలు చేశారు.

ఫ్రీజింగ్‌ వెంటనే ఎత్తేయాలి
ఏడాది క్రితం వివాహం చేసుకున్న గిరిజన వర్గాలకు చెందిన దంపతులు ప్రభుత్వ ప్రోత్సాహకం కోసం ఎదురు చూస్తున్నారు. ఇచ్చే రూ.50 వేలకు కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించడం బాధాకరం. విద్యుత్‌ వినియోగానికి సంబంధించిన బిల్లులను కూడా వెంటనే ఇవ్వాలి.  లేదంటే గిరిజనులు ఇబ్బంది పడే అవకాశముంది.– ఆర్‌.యోగేష్‌నాయక్, లంబాడీ హక్కుల పోరాట సమితి  యువజన విభాగం అధ్యక్షుడు

మంజూరయ్యే అవకాశాలున్నాయి
జిల్లా ట్రెజరీలో ఫ్రీజింగ్‌ కారణంగా ఆగిన పలు బిల్లులు త్వరలోనే మంజూరయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా గిరిపుత్రిక కల్యాణ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 30 మందికి మాత్రమే ప్రోత్సాహకం అందించాలనే లక్ష్యం ఉంది. అయినప్పటికీ అదనంగా బడ్జెట్‌ తెప్పించుకున్నాం. ఎస్టీ సబ్‌ప్లాన్‌ బడ్జెట్‌ బిల్లులు కూడా త్వరలోనే మంజూరవుతాయి.
– హెచ్‌.సుభాషణరావు, జిల్లా గిరిజన సంక్షేమాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement