నేడు పైడితల్లి సిరిమానోత్సవం

Today is the Paidipalli Sirimanu Utsavam - Sakshi

ముగిసిన తొలేళ్ల సంబరం

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు

జనసంద్రంగా మారిన విజయనగరం

విజయనగరం టౌన్‌: రాష్ట్రంలోనే ప్రత్యేకతను సంతరించుకున్న శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం  విజయనగరంలో మంగళవారం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్, ఫెస్టివల్‌ అధికారి ఎన్‌.వి.ఎస్‌.ఎన్‌.మూర్తి, ఆలయ ఈవో భానురాజా తెలిపారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా  ఇతర జిల్లాలు, ముఖ్యంగా ఒడిశా ప్రాంతం నుంచి భక్తులు లక్షలాదిగా ఈ సంబరానికి ఇప్పటికే తరలి వచ్చేశారు. రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు విదేశీయులు సందడి చేయనున్నారు. సోమవారం తొలేళ్ల సంబరం ఘనంగా ముగిసింది. ఆలయ అనువంశిక ధర్మకర్త, మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు, భార్య సునీలా గజపతి, కుమార్తె అదితి గజపతి అమ్మవారిని దర్శించి,  పట్టువస్త్రాలను సమర్పించారు.

అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ అమ్మ ఆశీస్సులు అందరిపైనా ఉండాలన్నారు. రాత్రి 11 గంటల తర్వాత కోటశక్తికి పూజలు నిర్వహించి, అనంతరం రైతులకు విత్తనాలను పంచిపెట్టారు. సిరిమానోత్సవానికి ఏర్పాట్లను కలెక్టర్‌ డాక్టర్‌ హరిజవహర్‌లాల్, జిల్లా అదనపు ఎస్పీ ఎం.నరసింహారావు పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం ఉదయానికే సిరిమానును, పూజారి బంటుపల్లి వెంకటరావును  హుకుంపేట నుంచి ఆలయం వద్దకు ప్రత్యేక  వాహనంలో తీసుకొస్తారు. హుకుంపేటలో సిరిమానును ఉదయం 10 గంటల నుంచి బయలుదేరేలా చూస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు చదురుగుడి వద్దకు సిరిమానుకు చేరుకుంటుంది.

అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సుమారు గంటన్నర వ్యవధిలో సిరిమానుకు ఏర్పాటు చేయాల్సిన రథాన్ని, అనుసంధాన పలకలు, పూజారి కూర్చునే పీటలను అమర్చుతారు. అక్కడి నుంచి బయలుదేరిన సిరిమాను మూడుసార్లు అమ్మవారి ఆలయం నుంచి కోట వరకు వెళ్లి కోటశక్తికి మొక్కి తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. పోలీస్‌ యంత్రాంగం ఇప్పటికే పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. దాదాపు రెండు వేల మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top