అన్నదాతల ఆశలు నెరవేరనున్నాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పంటల బీమా విడుదలకు గ్రీన్‌సిగ్నల్ పడింది. జిల్లాలోని 39వేల మంది రైతన్నలకు రూ.52 కోట్లు రేపోమాపో అందనుంది.
సాక్షి ప్రతినిధి, కడప: అన్నదాతల ఆశలు నెరవేరనున్నాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పంటల బీమా విడుదలకు గ్రీన్‌సిగ్నల్ పడింది. జిల్లాలోని 39వేల మంది రైతన్నలకు రూ.52 కోట్లు రేపోమాపో అందనుంది. వ్యవసాయ జూదంలో అలసిపోయిన రైతన్నలకు ఆలస్యంగానైనా పంటల బీమా బ్యాంకు ఖాతాలలో జమ కానుంది.
జిల్లాలో 2011-12 సంవత్సరానికి సంబంధించి 76,050 హెక్టార్లలో శనగ పంటను సాగుచేసిన 38,200 మంది రైతులు పంటల బీమా కోసం ప్రీమియం చెల్లించారు. అలాగే 915 హెక్టార్లలో ఉల్లి సాగుచేసిన 855 మంది రైతులు కూడా ప్రీమియం చెల్లించారు. కరవు పరిస్థితుల కారణంగా అన్నదాతలకు పంటలు చేతికి అందకుండా పోయాయి. పంటల బీమా అయినా ఆదుకుంటుందని ఆశించారు.
వివిధ కారణాల వల్ల పంటల బీమా రైతులకు అందకుండా పోయింది. చివరకు ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన ఐదుగురి ప్రతినిధుల సంతకాలు పూర్తయినట్లు తెలుస్తోంది. సీఎండీ సంతకం కూడా గురువారానికి పూర్తవుతుందని ఎల్‌ఐసీ జనరల్ మేనేజర్ నాగార్జున ‘సాక్షి ప్రతినిధి’కి ధృవీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 92 కోట్ల బీమా అందాల్సి ఉండగా వైఎస్సార్ జిల్లా రైతాంగానికే రూ.52 కోట్లు అందనుందని ఆయన తెలిపారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రైతాంగానికి పంటల బీమా విడుదల ఊరటనిచ్చే అంశమని ఆయన తెలిపారు.
వైఎస్ అవినాష్ కృషి ప్రశంసనీయం
పంటల బీమా విడుదల కావడంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి చేసిన కృషి ఎనలేనిదని రైతులు పేర్కొంటున్నారు. బీమా విషయమై జనరల్ మేనేజర్ నాగార్జునతో ఫోన్‌లో మాట్లాడటంతో పాటు పలుమార్లు స్వయంగా చర్చించారు. విషయాన్ని కలెక్టర్ కోన శశిధర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీంతో పంటల బీమా ఫైల్‌కు కదలిక వచ్చిందని అన్నదాతలు అభిప్రాయపడుతున్నారు. కాగా శుక్రవారం సీఎండీ సంతకం చేయనున్న నేపథ్యంలో రైతుల పక్షాన అవినాష్‌రెడ్డి చేసిన పోరాటానికి ఫలితం దక్కనుంది.