నేడు పోలీసు వాహనాల ప్రారంభం | Today is the beginning of police vehicles | Sakshi
Sakshi News home page

నేడు పోలీసు వాహనాల ప్రారంభం

Jan 19 2015 4:38 AM | Updated on Aug 21 2018 8:06 PM

రాష్ట్ర పోలీసు శాఖకు కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలను డీజీపీ జె.వి.రాముడు ఆదివారం పరిశీలించారు.

  • ఏర్పాట్లనుపరిశీలించిన డీజీపీ
  • విజయవాడ సిటీ : రాష్ట్ర పోలీసు శాఖకు కొత్తగా కొనుగోలు చేసిన  వాహనాలను డీజీపీ జె.వి.రాముడు ఆదివారం పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఈ వాహనాలను ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ఆదివారం నగరానికి వచ్చిన డీజీపీ రాముడు సాయంత్రం ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో కొత్త వాహనాలను పరిశీలించారు. వాటి వివరాలను పోలీసు ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్(పీటీఓ) ఐజీ గోపాలకృష్ణను అడిగి తెలుసుకున్నారు. ఆయా వాహనాలను ఉపయోగించే విభాగాలు, మైలేజీ, రేటు తదితర అంశాలను ఐజీ వివరించారు. వాహనాలపై పోలీసు లోగోకు సంబంధించిన కొన్ని మార్పులు, చేర్పులను డీజీపీ సూచించారు.
     
    గ్రౌండ్ పరిశీలన

    ఈ నెల 26న గణతంత్ర వేడుకలు నిర్వహించనున్న ఇందిరాగాంధీ స్టేడియంను డీజీపీ పరిశీలించారు. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు సూచించిన విధంగా గ్యాలరీకి ఇరువైపులా ఉన్న ద్వారాల వెడల్పు పెంచకపోవడంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నగరపాలక సంస్థ కౌన్సిల్‌లో తీర్మానం ఆమోదించిన తరువాతే ద్వారం మార్పులు చేర్పులు చేయాల్సి ఉందని, సమయాభావం కారణంగా ఇది వీలు పడదని అధికారులు వివరించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని లోనికి వెళ్లే విధంగా శకటాల డిజైన్‌ను రూపొం దిస్తున్నట్టు తెలిపారు.
     
    సీఎం ప్రారంభిస్తారు

    రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖకు ఇవ్వనున్న కొత్త వాహనాలను సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభిస్తారని డీజీపీ జె.వి.రాముడు విలేకరులకు తెలిపారు. ఇందుకైన బడ్జెట్, వాహనాల సంఖ్యను ముఖ్యమంత్రి ప్రకటిస్తారన్నారు. వాహనాల కేటాయింపులో విజయవాడ కమిషనరేట్‌కు తగిన న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో పోలీసు శాఖకు సంబంధించి రెండు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారని చెప్పారు.
       
    హుద్‌హుద్ తుపాను బాధితుల కోసం పోలీసుశాఖ సేకరించిన నిధులను ఈ సందర్భంగా  ముఖ్యమంత్రికి అందజేస్తామని తెలిపారు. డీజీపీ వెంట బెటాలియన్స్ ఐజీ ఎం.కె.సింగ్, బెటాలియన్స్ డీఐజీ, నగర డిప్యూటీ పోలీసు కమిషనర్ జి.వి.జి.అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ విజయకుమార్, 6వ, 2వ బెటాలియన్ల కమాండెంట్లు, ఏసీపీలు ఎస్.రమేష్‌బాబు, రాఘవరావు, సుందరరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement