breaking news
J.V. Ramudu
-
నేడు పోలీసు వాహనాల ప్రారంభం
ఏర్పాట్లనుపరిశీలించిన డీజీపీ విజయవాడ సిటీ : రాష్ట్ర పోలీసు శాఖకు కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలను డీజీపీ జె.వి.రాముడు ఆదివారం పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఈ వాహనాలను ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ఆదివారం నగరానికి వచ్చిన డీజీపీ రాముడు సాయంత్రం ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో కొత్త వాహనాలను పరిశీలించారు. వాటి వివరాలను పోలీసు ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్(పీటీఓ) ఐజీ గోపాలకృష్ణను అడిగి తెలుసుకున్నారు. ఆయా వాహనాలను ఉపయోగించే విభాగాలు, మైలేజీ, రేటు తదితర అంశాలను ఐజీ వివరించారు. వాహనాలపై పోలీసు లోగోకు సంబంధించిన కొన్ని మార్పులు, చేర్పులను డీజీపీ సూచించారు. గ్రౌండ్ పరిశీలన ఈ నెల 26న గణతంత్ర వేడుకలు నిర్వహించనున్న ఇందిరాగాంధీ స్టేడియంను డీజీపీ పరిశీలించారు. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు సూచించిన విధంగా గ్యాలరీకి ఇరువైపులా ఉన్న ద్వారాల వెడల్పు పెంచకపోవడంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నగరపాలక సంస్థ కౌన్సిల్లో తీర్మానం ఆమోదించిన తరువాతే ద్వారం మార్పులు చేర్పులు చేయాల్సి ఉందని, సమయాభావం కారణంగా ఇది వీలు పడదని అధికారులు వివరించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని లోనికి వెళ్లే విధంగా శకటాల డిజైన్‌ను రూపొం దిస్తున్నట్టు తెలిపారు. సీఎం ప్రారంభిస్తారు రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖకు ఇవ్వనున్న కొత్త వాహనాలను సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభిస్తారని డీజీపీ జె.వి.రాముడు విలేకరులకు తెలిపారు. ఇందుకైన బడ్జెట్, వాహనాల సంఖ్యను ముఖ్యమంత్రి ప్రకటిస్తారన్నారు. వాహనాల కేటాయింపులో విజయవాడ కమిషనరేట్‌కు తగిన న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో పోలీసు శాఖకు సంబంధించి రెండు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారని చెప్పారు. హుద్‌హుద్ తుపాను బాధితుల కోసం పోలీసుశాఖ సేకరించిన నిధులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అందజేస్తామని తెలిపారు. డీజీపీ వెంట బెటాలియన్స్ ఐజీ ఎం.కె.సింగ్, బెటాలియన్స్ డీఐజీ, నగర డిప్యూటీ పోలీసు కమిషనర్ జి.వి.జి.అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ విజయకుమార్, 6వ, 2వ బెటాలియన్ల కమాండెంట్లు, ఏసీపీలు ఎస్.రమేష్‌బాబు, రాఘవరావు, సుందరరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ డీజీపీగా జె.వి.రాముడు నియామకం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్తి స్థాయి డీజీపీగా జె.వి.రాముడును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాముడు ఇన్చార్జి డీజీపీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 1981 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రాముడు వాస్తవానికి ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేయాలి. అయితే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా పదవీ విరమణతో సం బంధం లేకుండా డీజీపీగా నియమించిన వ్యక్తిని రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాముడు మరో 22 నెలల పాటు డీజీపీగా కొనసాగనున్నారు. డీజీపీ ఎంపిక ప్రక్రియపై ఈ నెల 21న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో సీఎస్ కృష్ణారావు పాల్గొన్నారు. సీనియారిటీ ప్రకారం డీజీపీ కేడర్‌లోని పది పేర్లను సమర్పించారు. అందులో నుంచి ముగ్గురు పేర్లను యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ మంగళవారం లేఖ రాసింది. అందులో నుంచి రాముడిని ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు జారీ అయిన వెంటనే ఆయన బుధవారం రాత్రి బాధ్యతలు చేపట్టారు.