
ఐ సెట్‌కు 91.7 శాతం హాజరు
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశ పరీక్ష ‘ఐసెట్-2014’కు జిల్లాలో 91.7 శాతం హాజరు నమోదయింది.
- గుంటూరులో 15 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ
- 6,895 మంది విద్యార్థులు హాజరు
- పరీక్షా కేంద్రాలను సందర్శించిన ప్రొఫెసర్లు
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశ పరీక్ష ‘ఐసెట్-2014’కు జిల్లాలో 91.7 శాతం హాజరు నమోదయింది. శుక్రవారం గుంటూరు నగరంలోని 15 పరీక్షా కేంద్రాల పరిధిలో ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకూ పరీక్ష జరిగింది. జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసిన 7,519 మంది విద్యార్థులకు గానూ 6,895 మంది హాజరయ్యారు. నిమిషం ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు ముందుగానే ప్రకటించిన దృష్ట్యా విద్యార్థులు సకాలంలోనే చేరుకున్నారు.
కాకతీయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసెట్‌కు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఆచార్యుడు జి.వి.చలం గుంటూరు ప్రాంతీయ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఉప కులపతి ఆచార్య కె.వియ్యన్నారావు, రెక్టార్ వై.పి.రామసుబ్బయ్య గోరంట్ల సెయింట్ ఆన్స్ కళాశాల, లాం చలపతి ఫార్మశీ కళాశాల సహా పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష తీరును పరిశీలించారు. ఎస్వీ, ఆంధ్ర, కాకతీయ విశ్వవిద్యాలయాల నుంచి జిల్లాకు ప్రత్యేక పరిశీలకులుగా వచ్చిన ప్రొఫెసర్లు ఎం.సురేష్‌బాబు, జాలాది రవి, ఎ.శ్రీనివాసరావు పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు.