ఆధ్యాత్మిక నగరానికి అగ్రస్థానం 

Tirupati Got First Place In Three Star Rated Nationally - Sakshi

జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు  

సమష్టి కృషితోనే సాధ్యమైంది: కమిషనర్‌ గిరీషా  

స్మార్ట్‌ తిరుపతి మెరిసింది. త్రీస్టార్‌ రేటింగ్‌లో జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. స్వచ్ఛత, పరిశుభ్రత నెలకొల్పడంలో అత్యున్నత ప్రమాణాలు అమలు చేస్తున్నందుకు అత్యున్నత గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా ఉన్న నగరాల్లో స్వచ్ఛత, పరిశుభ్రత అమలు విధానంపై కేంద్ర ప్రభుత్వ మినిస్టరీ ఆఫ్‌ అర్బన్‌ హౌసింగ్‌ అఫైర్స్‌శాఖ పర్యవేక్షణలో ఫైవ్, త్రీస్టార్‌ ర్యాంకింగ్‌లను మంగళవారం ప్రకటించారు. ఆశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌పూరీ ర్యాంకుల వివరాలను ఢిల్లీ కేంద్రంగా ప్రకటించారు. త్రీస్టార్‌ రేటింగ్‌లో పోటీపడ్డ తిరుపతి నగరం జాతీయ స్థాయిలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది.   

సాక్షి, తిరుపతి: గార్బేజ్‌ ఫ్రీసిటీ స్టార్‌ రేటింగ్‌లో తిరుపతి నగరం జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకును సొంతం చేసుకుంది. 2019లో నిర్వహించి రేటింగ్స్‌లో 51వ స్థానంలో ఉన్న తిరుపతి నగరం 2020 పోటీల్లో టాప్‌–1 ర్యాంకులో నిలిచి తన సత్తాను చాటుకుంది. గత ఏడాది విజయవాడ నగరం 50వ స్థానంలో ఉండగా ఈ సారి జాతీయ స్థాయిలో 2వ స్థానానికి చేరింది. త్రీస్టార్‌ రేటింగ్‌లో టాప్‌–10లో ఉన్న నగరాలు మాత్రమే టాప్‌ 5 ర్యాంకింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. త్రీస్టార్‌ రేటింగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన తిరుపతి వచ్చే ఏడాది ఫైవ్‌ స్టార్‌ ర్యాంకింగ్‌లో పోటీపడనుంది.  

1,435 నగరాలు పోటీ
స్వచ్ఛతను పాటించే నగరాలకు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ స్టార్‌ రేటింగ్స్‌ పోటీ నిర్వహించింది. నిపుణులు నగరాల్లో అమలవుతున్న స్వచ్ఛత, పరిశుభ్రత, ప్రజలకు మౌలిక వసతులు, వాటి నిర్వహణకు ఉపయోగిస్తున్న అత్యున్నత ప్రమాణాలు, ప్రజల అభిప్రాయాల సేకరణ ఆధారంగా ర్యాంకింగ్‌ను కేటాయించారు. దేశంలోని 1,435 నగరాలు పోటీడ్డాయి. ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌లో ఆరు నగరాలు సొంతం చేసుకోగా 63 నగరాలకు త్రీస్టార్, 70 నగరాలు ఒక స్టార్‌ రేటింగ్‌ను కేంద్రం ప్రకటించింది. 

మెరిసిన తిరుపతి కీర్తి పతాకం 
తిరుపతిలో స్వచ్ఛత, పరిశుభ్రతకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. చెత్తను వంద శాతం సది్వనియోగం చేస్తున్నారు. ఇందుకోసం పీపీపీ పద్ధతిన కార్పొరేషన్‌ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. పారిశుద్ధ్య కార్మికుల ద్వారా ఇంటింటా తడి, పొడి చెత్తను స్వీకరిస్తున్నారు. రూ.15 కోట్ల వ్యయంతో తూకివాకంలో నిర్మించిన బయో మెథనైజేషన్‌ ప్లాంట్‌కు తరలించి గ్యాస్‌ ఉత్పత్తి చేస్తున్నారు. రూ.19 కోట్ల వ్యయంతో రామాపురం డంపింగ్‌ యార్డులో బయో మైనింగ్‌ ద్వారా 5 లక్షల టన్నుల చెత్తను రీసైక్లింగ్‌ చేస్తున్నారు. రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించిన భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ను తూకివాకంలో నిర్వహిస్తున్నారు. రూ.3 కోట్ల వ్యయంతో పొడిచెత్త ద్వారా సేంద్రియ ఎరువుల తయారీ చేపట్టారు. ఇలా శాశ్వత ప్రతిపాదికన చెత్త నిర్వహణను నిర్వహిస్తున్నారు. ప్రజలకు అత్యుత్తమ సేవలను అందిస్తుండడంతో తిరుపతి ఈ ఘనతను సొంతం చేసుకుంది.  

సమష్టి కృషితోనే సాధ్యం 
నగర ప్రజలకు పరిశుభ్రత, స్వచ్ఛతను అందించేందుకు కృషి చేస్తున్నాం. మౌలిక వసతులు కలి్పస్తున్నాం. చెత్త నిర్వహణ కోసం కోట్లు వె చ్చించి పలు ప్లాంట్లు నిర్వహిస్తున్నాం. ప్రజల సహకారం, పారిశుద్ధ్య కార్మికుల కష్టం, అధికారుల సమష్టి కృషితోనే ఈ ఘనత సాధించాం.
– పీఎస్‌ గిరీషా, కమిషనర్, తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top