ఐదుగురు సభ్యులు గల దొంగల ముఠాను అరెస్టు చేసి.. వారి వద్ద నుంచి 360 గ్రాముల ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గుంటూరు: ఐదుగురు సభ్యులు గల దొంగల ముఠాను అరెస్టు చేసి.. వారి వద్ద నుంచి 360 గ్రాముల ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆదివారం జరిగింది. వివరాలు.. మంగళగిరికి చెందిన కొల్లూరు వంశీకృష్ణ, మచ్చా రవీంద్రారెడ్డి, దుద్దు విజయసాయి, గట్టం నవీన్‌కుమార్, ఒక బాలుడు (12) దొంగల ముఠాగా ఏర్పడ్డారు. ఆరు నెలలుగా మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు.
దీంతో సీసీఎస్ సీఐలు బాలాజీ, వేమారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఈ ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. ఆదివారం నంబూరు క్రాస్‌రోడ్డులో దొరికారు. అనుమానాస్పదంగా కనిపించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా చేసిన నేరాలను ఒప్పుకున్నారు. వారి నుంచి రూ.10 లక్షల విలువైన 360 గ్రాముల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సొత్తును కొనుగోలు చేసిన తుంగా ప్రసాద్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.