breaking news
mangala giri
-
మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీకి మరో షాక్
సాక్షి, గుంటూరు: టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఇద్దరు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు వైఎస్సార్సీపీలోకి చేరారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమక్షంలో దుగ్గిరాల 1,3 సెగ్మెంట్ల టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆళ్ల రామకృష్ణారెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. చదవండి: ‘ఆవిర్భావ దినోత్సవం కాదు.. పగటి వేషగాళ్ల డ్రామా’ కోవిడ్ సమస్యకు పరిష్కారం వ్యాక్సినేషనే: సీఎం జగన్ -
టిక్‌టాక్ దంపతుల ఆత్మహత్య!
సాక్షి, గుంటూరు : బెల్లంకొండలో శుక్రవారం విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మనస్తాపంతో నవ దంపతులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పవన్, శైలజ టిక్‌టాక్ ద్వారా పరిచయమయ్యారు. నెల క్రితమే వారు పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. శైలజది చిత్తూరు కాగా, పవన్ స్వస్థలం మంగళగిరి. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడంతో శైలజ తల్లిదండ్రులు పవన్‌పై కేసు నమోదు చేశారు. దీంతో మనస్తాపం చెందిన నవదంపతులు ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. చదవండి: ప్రభుత్వ ఉద్యోగ దంపతుల ఆత్మహత్య -
ఎమ్మెల్యే ఆర్కే ఆఫీసులో చోరీ
సాక్షి, కృష్ణా: గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) కార్యాలయం చోరీకి గురైంది. ఆయన కార్యాలయంలోని రూ.10 లక్షలు విలువ చేసే సొత్తును దోచుకున్నారు. అర్థరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడ్డారు. సంక్షేమ పథకాల అమలులో భాగంగా ఆ డబ్బును ఆఫీసులో ఉంచినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆర్కే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో అనుమాతుడిగా గుర్తించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని నుంచి పూర్తి వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. -
మంగళగిరికి డబ్బు మూటలు!
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో స్థానిక పరిస్థితులకు తోడు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ప్రచారంలో దూసుకుపోతుండటం, లోకేశ్ ఓటమి సంకేతాల నేపథ్యంలో చంద్రబాబులో ఆందోళన మొదలయ్యింది. భారీయెత్తున డబ్బులు వెదజల్లి కొడుకుని గెలిపించేందుకు తెలుగుదేశం అధినేత స్కెచ్చేశారు. మొత్తం మీద రూ.300 కోట్లకు పైగా సొమ్మును మంగళగిరిలో కుమ్మరించాలని నిర్ణయించారు. లోకేశ్ కోసం పలు నియోజకవర్గాలను పరిశీలించినా.. మంగళగిరి నుంచి పోటీ చేయిస్తే రాజధాని ప్రాంతంపై పట్టు సాధించవచ్చని చంద్రబాబు ఎత్తుగడ వేశారు. అలాగే కుమారుడికి రాజకీయంగా ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసినట్టు ఉంటుందని భావించి అక్కడ ఎన్నికల బరిలో దింపారు. అయితే మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం కావడం, అక్కడ పార్టీ బలంగా ఉండడం, మరోవైపు టీడీపీకి బలమైన నాయకత్వం లేకపోవడం, సామాజికవర్గాల సమతుల్యత టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో లోకేశ్ గెలుపు ప్రశ్నార్థకంగా మారింది. నియోజకవర్గంలో మంగళగిరి మున్సిపాల్టీలో మాత్రమే టీడీపీకి కొంత ఆశాజనక పరిస్థితి ఉండగా మంగళగిరి రూరల్, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల్లో పూర్తి వ్యతిరేకత ఉంది. నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 2.58 లక్షలుండగా ఇందులో అత్యధికంగా సుమారు 68 వేల పద్మశాలీల ఓట్లున్నాయి. ఆ వర్గానికి చెందిన మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల వంటి వారికి చంద్రబాబు సీటు ఇస్తానని ఆశపెట్టి పార్టీలో చేర్చుకుని చివరి నిమిషంలో వారికి హ్యాండిచ్చారు. దీంతో ఆ వర్గం నేతలంతా చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. తమకు దక్కాల్సిన సీటును సీఎం తన కుమారుడికి కట్టబెట్టారని ఆందోళన వ్యక్తం చేసిన పద్మశాలీ సంఘం టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తామని, లోకేశ్‌ను గెలవనివ్వమని ప్రకటించింది. దీంతో అవాక్కయిన టీడీపీ.. ఆ వర్గం నేతల్ని లొంగదీసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసి విఫలమైంది. దీనికితోడు రాజధాని నిర్మాణం పేరుతో స్థానిక ప్రజలను, రైతులను చంద్రబాబు పెట్టిన ఇబ్బందులతో మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. మరోవైపు లోకేశ్ గతంలో మాదిరిగానే.. ఎన్నికల ప్రచారంలో సైతం పదే పదే తడబడుతూ తప్పులు మాట్లాడుతుండటం.. స్థానికులకు నవ్వు పుట్టిస్తుంటే.. టీడీపీ నేతలకు చికాకు తెప్పిస్తోంది. ఈ పరిస్థితుల్లో లోకేశ్ ఓడిపోతే పరువు పోతుందని భావించిన చంద్రబాబు మంగళగిరిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని నిర్ణయించారు. తనదైన శైలిలో పక్కా వ్యూహాన్ని రూపొందించారు. కోటరీ వ్యక్తులతో నంద్యాల ఫార్ములా అమలు! విశ్వసనీయ సమాచారం మేరకు.. నంద్యాల ఉప ఎన్నికలో అనుసరించిన వ్యూహాన్నే ఇక్కడ కూడా అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. తన కోటరీలోని ముగ్గురు ముఖ్య వ్యక్తులకు బాధ్యతలు అప్పగించి ఎప్పటికప్పుడు వారికి సూచనలు ఇస్తూ పనిచేయిస్తున్నారు. నియోజకవర్గాన్ని క్లస్టర్లు, సెక్టార్లుగా విభజించి.. చిత్తూరు, హైదరాబాద్, విశాఖ, గుంటూరు ప్రాంతాలకు చెందిన తమ సొంత మనుషులను రప్పించి ఆ ప్రాంతాల బాధ్యతలు అప్పగించారు. ఈ బృందాలు స్థానిక టీడీపీ నాయకుల సాయంతో తమకు కేటాయించిన క్లస్టర్లలో ఓటర్లు, వారి అవసరాలు, వారి రాజకీయ నేపథ్యం వంటి వివరాలను తెలుసుకుని ఎవరికి, ఎలా పంపిణీ డబ్బు పంచాలనే దానిపై ఒక అవగాహనతో చాపకింద నీరులా పనిచేస్తున్నారు. తొలుత ఎంపిక చేసిన ప్రాంతాలపై దృష్టి సారించి ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులోభాగంగా మంగళగిరి రూరల్, టౌన్ ప్రాంతాల్లోని మధ్యతరగతి ఓటర్లకు అధునాతన స్ప్లిట్ ఏసీలను పంపిణీ చేయిస్తున్నారు. ఓటర్లకు చిన్న స్లిప్ ఇచ్చి దాన్ని విజయవాడలోని పలానా షోరూమ్‌లో చూపిస్తే ఏసీ డెలివరీ ఇచ్చే ఏర్పాటు చేశారు. ఇలా ఇప్పటికే వేలాది ఏసీలు పంచినట్లు సమాచారం. ఏసీలు వద్దన్న వారికి, ఏసీలు పెట్టుకోలేని వారికి రూ.20 వేలు సొమ్ము నేరుగా ఇస్తున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ డబ్బు ప్రభావాన్ని పెంచుకుంటూ వెళ్లి చివరి రెండు రోజుల్లో తారస్థాయికి తీసుకెళ్లేలా వ్యూహం రూపొందించారు. ఓటుకు రూ.12 వేలు! తెలుగుదేశంపై వ్యతిరేకత ఉన్న ప్రాంతాల్లో ఓటుకు రూ.12 వేలు ఇచ్చేందుకు చంద్రబాబు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని స్థానిక టీడీపీ నాయకులే ఆయా ప్రాంతాల్లో చెబుతుండటం గమనార్హం. లక్ష మంది ఓటర్లకు రూ.12 వేలు చొప్పున, మరో లక్ష మందికి రూ.5 వేలు చొప్పున ఇవ్వాలని, అవసరాన్ని బట్టి ఇంకా పెంచాలని ఆలోచన చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉన్న తాడేపల్లి మండలంలో డబ్బు పంపిణీ ఎక్కువగా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. రెడ్డి సామాజికవర్గం ఎక్కువగా ఉన్న ఉండవల్లి, నిడమర్రు, పెనుమాక, నూతక్కి, చిర్రావూరు, పాతూరు వంటి పలు గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఎవరికీ అనుమానం రాకుండా, నిఘా తప్పించుకునేందుకు.. ఆయా గ్రామాలకు పోలీసు వాహనాల్లో డబ్బు పంపేందుకు పక్కా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఇందుకు అనుగుణంగా బందోబస్తు వాహనాల్లో తమకు అనుకూలమైన వారిని గతంలోనే నియమించారు. కొద్దిరోజుల క్రితం విశాఖపట్నం ఐటీ కంపెనీల నుంచి పోలీసు జీపుల్లోనే భారీగా డబ్బును నియోజకవర్గంలో డంప్ చేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. అయితే డబ్బు పంపిణీని నేరుగా చేయాలా లేక ఓటర్ల ఖాతాల్లో వేయాలా అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే గ్రామాల వారీగా ఓటర్ల బ్యాంకు అకౌంట్లను టీడీపీ సేవా మిత్రల ద్వారా సేకరించిన సంగతి తెలిసిందే. అయితే వేరే మార్గంలో డబ్బు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుని ప్రత్యర్థులను తప్పుదారి పట్టించేందుకే బ్యాంకు అకౌంట్ల సేకరణ డ్రామా ఆడారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదిఏమైనా లోకేశ్ గెలుపు కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఇక ‘ఫ్యాన్’ కింద మాట్లాడుకుందాం: లోకేశ్
తాడేపల్లి రూరల్ (మంగళగిరి)/అమరావతి బ్యూరో: ‘ఇక నుంచి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు మా ఇంట్లో ‘ఫ్యాన్’ కింద కూర్చుని చల్లగా కబుర్లు చెప్పుకుందాం. మీరెవరూ అధైర్యపడొద్దు’.. అంటూ సీఎం తనయుడు, మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలతో తెలుగు తమ్ముళ్లు అవాక్కయ్యారు. మంగళగిరి రత్నాలచెరువులో శనివారం నిర్వహించిన సభలో లోకేశ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. ఇటీవల కూడా ఏప్రిల్ 11కు బదులు ఏప్రిల్ 9న సైకిల్ గుర్తుకు ఓటు వేయాలంటూ లోకేశ్ ప్రచారం చేశారు. నూతక్కిలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ మార్చి 23న ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామడంతో అంతా విస్తుపోయారు. అలాగే దేశంలో 29 రాష్ట్రాలకు బదులు 28 రాష్ట్రాలని అనడంతో ఆయన వెంట ఉన్నవారు కంగుతిన్నారు. మరోవైపు లోకేశ్ తరపున సోషల్ మీడియాలో ప్రచారం చేసేందుకు బెంగళూరుకు చెందిన ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నా తప్పుల తడకగా మాట్లాడుతుండటంతో వెనక్కి తగ్గినట్లు తెలిసింది. -
దొంగల ముఠా అరెస్టు
గుంటూరు: ఐదుగురు సభ్యులు గల దొంగల ముఠాను అరెస్టు చేసి.. వారి వద్ద నుంచి 360 గ్రాముల ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆదివారం జరిగింది. వివరాలు.. మంగళగిరికి చెందిన కొల్లూరు వంశీకృష్ణ, మచ్చా రవీంద్రారెడ్డి, దుద్దు విజయసాయి, గట్టం నవీన్‌కుమార్, ఒక బాలుడు (12) దొంగల ముఠాగా ఏర్పడ్డారు. ఆరు నెలలుగా మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. దీంతో సీసీఎస్ సీఐలు బాలాజీ, వేమారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఈ ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. ఆదివారం నంబూరు క్రాస్‌రోడ్డులో దొరికారు. అనుమానాస్పదంగా కనిపించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా చేసిన నేరాలను ఒప్పుకున్నారు. వారి నుంచి రూ.10 లక్షల విలువైన 360 గ్రాముల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సొత్తును కొనుగోలు చేసిన తుంగా ప్రసాద్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.