జిల్లాలో మొత్తం 126 సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. ఇందులో 67 ఎస్‌సీ, 19 ఎస్‌టీ, 40 బీసీ హాస్టళ్లున్నాయి. వీటిలో వేలాది మంది విద్యార్థులున్నారు.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్:
జిల్లాలో మొత్తం 126 సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. ఇందులో 67 ఎస్‌సీ, 19 ఎస్‌టీ, 40 బీసీ హాస్టళ్లున్నాయి. వీటిలో వేలాది మంది విద్యార్థులున్నారు. ఎస్‌సీ హాస్టళ్లను పర్యవేక్షించడానికి ఐదుగురు ఏఎస్‌డబ్ల్యూఓలు, బీసీ హాస్టళ్లకు నలుగురు, ఎస్‌టీ వసతి గృహాలకు ఒక ఏఎస్‌డబ్ల్యూఓ పనిచేస్తున్నారు. ఇందరు అధికారులు పనిచేస్తున్నా ఏడాదిగా కొత్త మెనూ అమలుకు నోచుకోకపోవడం గమనార్హం. మెనూ ప్రకారం విద్యార్థులకు వారంలో ఐదుసార్లు గుడ్లు అందించాల్సి ఉండగా చాలాచోట్ల రెండు పర్యాయాలే ఇస్తున్నారు. రోజూ అరటి పండు ఇవ్వాల్సి ఉన్నా వారానికి ఒక టే ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పాల జాడే లేదు. శనివారం స్వీట్‌కు బదులు చాక్‌లెట్ లేదా గోధుమ రవ్వతో చేసిన సిరాను మాత్రమే ఇస్తున్నారు. ఉదయం అల్పాహా రం కింద వారంలో మూడు రోజులు ఇడ్లీలు ఇవ్వాలన్న మెనూ ఎక్కడా అమలు కావడం లేదు. ప్రతి ఆదివారం ఎగ్ బిర్యానీ వడ్డించాలని మెనూ చెబుతు న్నా కిచిడీతోనే సరిపెడుతున్నారు. మెనూ అమలు కోసం ప్రభుత్వం మూడు నుంచి ఏడు తరగతుల విద్యార్థులకు ఒక్కొక్కరికి *750 చొప్పున, ఎనిమిదినుంచి పది తరగతుల విద్యార్థులకోసం *850 చొప్పున కేటాయిస్తోంది. అధికారుల పర్యవేక్షణ లోపంతో విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదు.
పర్యవేక్షణ కరువు
జిల్లా సంక్షేమ సహాయ అధికారులు హాస్టళ్లను పర్యవేక్షించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం పక్షానికి ఒకసారైనా ప్రతి హాస్టల్‌ను తనిఖీ చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. దీంతో హాస్టళ్ల నిర్వహణలో వార్డెన్ల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. వారు స్థానికంగా ఉండకుండా తాము పనిచేసే హాస్టల్‌కే చుట్టపుచూపుగా వచ్చి వెళుతున్నారు. దీంతో చాలాచోట్ల వంట మనుషులే హాస్టల్ వ్యవహారాలు చూసుకుంటున్నారు.
అన్నీ అంతే
విద్యార్థులకు సకాలంలో దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందించడం లేదు. కాస్మొటిక్ చార్జీలు చెల్లించడం లేదు. ప్రతి విద్యార్థికి నెలనెల * 12 చొప్పున క్షవరం చార్జీలు అందించాల్సి ఉంది. అయితే కొన్ని హాస్టళ్లలో రెండేళ్లుగా క్షవరం చార్జీలు ఇవ్వలేదని తెలిసింది.
అక్రమ సంపాదన కోసం..
సంక్షేమ హాస్టళ్ల పర్యవేక్షకులుగా వ్యవహరిస్తున్న ఉద్యోగు లు పలువురు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. అమ్యామ్యాలకు ఆశపడి హాస్టళ్లను పర్యవేక్షించడం లేదు. చాలా హాస్టళ్లలో బినామీ విద్యార్థున్నారన్న ఆరోపణలున్నాయి. విద్యార్థుల సంఖ్యను వాస్తవానికంటే ఎక్కువగా చూపించి సర్కారు సొమ్మును అడ్డంగా దోచేస్తున్నారు. ఉన్న విద్యార్థులకైనా సరైన భోజనం పెడుతున్నారా అంటే అదీ లేదు. నాసిరకం కూరగాయలతో చేసిన భోజనం వడ్డిస్తూ విద్యార్థులు అర్ధాకలితో అలమటించేలా చేస్తున్నా రు. నాసిరకం భోజనం పెడుతూ, బినామీ పేర్లతో సర్కారు సొమ్ము కాజేస్తున్న వార్డెన్లు కింది స్థాయి నుంచి ఉన్నతస్థాయి అధికారి వరకు లంచాలు సమర్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రతి వార్డెన్ నెలకు * 2 వేలు పంపిస్తున్నట్లు సమాచారం. వార్డెన్ల సంఘంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి వార్డెన్లనుంచి డబ్బులు వసూలు చేసి అధికారులకు పర్సంటేజీ లు ఇస్తున్నట్లు తెలిసింది. ఇలా అధికారులకు నెలకు *2.52 లక్షలు సమర్పించుకుంటున్నట్లు సమాచారం.