పగలు నైటీ ధరిస్తే ఫైన్‌!

Their will be fine if nity wear during the day! - Sakshi

పశ్చిమగోదావరి జిల్లా తోకలపల్లిలో కులపెద్దల వింత నిబంధన

అతిక్రమిస్తే.. రూ.2 వేలు జరిమానా

పగలు నైటీ వేసుకున్న మహిళను చూపిన వారికి రూ.1,000 నజరానా

దీనిని వ్యతిరేకిస్తే.. గ్రామ బహిష్కరణే

కమ్యూనిటీ హాల్‌ మైక్‌ ద్వారా దండోరా

కుల పెద్దల నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు

నిడమర్రు: కొల్లేటి గ్రామాల్లో న్యాయ పరమైన విషయాలను వారి కుల పెద్దలు విచారించి నిర్ణయం తీసుకుంటారు. మిగిలిన వారంతా వారి తీర్పునకు కట్టుబడి ఉంటారు. ఏళ్ల తరబడి వస్తున్న ఆచారం ఇది.. అయితే మహిళలు నైటీలు వేసుకునే విషయంలోనూ వారు ఆంక్షలు పెట్టడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు సమర్థిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం తోకలపల్లి గ్రామంలోని పెద్దలు.. మహిళలు పగటిపూట నైటీలు ధరించి ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, వస్తే రూ.2 వేలు జరిమానా అంటూ దండోరా వేయించారు. రాత్రి పూట మాత్రమే వాటిని ధరించాలని షరతు పెట్టారు. పగటి పూట నైటీలు ధరించిన మహిళలను చూపినవారికి రూ.1,000 నజరానా ఇస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే.. గ్రామ బహిష్కరణకు సైతం వెనుకాడేదిలేదని కుల పెద్దలు హెచ్చరించారు. గడిచిన ఆరు నెలలుగా గ్రామంలోని సామాజిక భవనం మైక్‌ ద్వారా దండోరా వేయిస్తున్నట్లు గ్రామస్తులు చెపుతున్నారు. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నిర్ణయం మంచిదే.., ఇదేం నిర్ణయం!
మహిళలు నైటీలతోనే స్కూళ్లకు, ప్రభుత్వ కార్యాలయాలకు, ఆస్పత్రులకు, మార్కెట్లకు వచ్చేస్తున్నారని.. పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయం మంచిదేనని కొందరు సమర్థిస్తున్నారు. మహిళల దుస్తుల విషయంలో గ్రామ పెద్దల ఆంక్షలేంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. పగటిపూట నైటీ వేసుకుని పొరపాటున బయటికొస్తే.. పెద్దల మాటను ధిక్కరించినట్లా? దానికే గ్రామ బహిష్కరణ శిక్ష విధిస్తారా? అని మండిపడుతున్నారు.. వారి మనోభావాలను బయటపెడితే గ్రామ పెద్దలను ఎదిరించినట్లవుతుందని సర్దుకుపోతున్నట్లు తెలుస్తోంది. 

కుల పెద్దల నిర్ణయమే ఫైనల్‌
తోకలపల్లి గ్రామంలో న్యాయవ్యవస్థ గ్రామ కమ్యునిటీహాల్‌ వద్దే ఉంటుంది. గ్రామంలో వడ్డీల కులపెద్దల నిర్ణయమే ఫైనల్‌. వారే న్యాయమూర్తులు. వడ్డీలంతా ఏకమై ఏటా 9 మంది కులపెద్దలను ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ఒక్కసారి పెద్దగా ఎన్నికయ్యాక తిరిగి పదేళ్ల వరకూ తీర్పులిచ్చే పీఠం ఎక్కే అవకాశం ఉండదు. ఎన్నికైన నాటి నుంచి ఏడాది వరకూ వారు ఆ పదవిలో ఉంటారు. గ్రామంలో ఏదైనా సమస్య వస్తే.. దానిపై కుల పెద్దలు ఇచ్చిన తీర్పును ఆచరించాల్సిందే. నచ్చినా.. నచ్చకపోయినా.. తీర్పును శిరసావహించాల్సిందే. మహిళల నైటీ విషయంలో గ్రామ పెద్దలు తీసుకున్న ఆంక్షలు మింగుడుపడని పలువురు మహిళలు.. పెద్దల ఆంక్షలను తొలగించాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. 

అధికారుల విచారణ 
మహిళలు నైటీలు ధరించడంపై ఆరు నెలలుగా బహిరంగంగా మైక్‌లో ప్రచారం జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని పలువురు విమర్శిస్తున్నారు. గ్రామ కట్టుబాట్ల విషయంలో వారిని కాదని ఎవ్వరూ ఏ విధమైన ఫిర్యాదు చెయ్యకపోవడం వల్లే తమకు తెలియదని అధికారులంటున్నారు. గురువారం నైటీలపై ఆంక్షల సమాచారం అందుకున్న తాహసీల్దార్‌ ఎం.సుందర్రాజు, ఎస్‌ఐ ఎం.విజయ్‌కుమార్‌ గ్రామంలో ఇంటింటికీ తిరిగి విచారణ జరిపి వివరాలు సేకరించారు. ప్రాథమిక నివేదికను ఉన్నతాధికారులకు అందించినట్లు తెలిసింది. 

గ్రామ కట్టుబాటును గౌరవిస్తాం.. 
గ్రామ పెద్దల మాటకు కట్టుబడి ఉంటాం. పగటి పూట మహిళలు నైటీలు ధరించి తిరడం వల్ల మిగిలిన మహిళలు ఇబ్బందులు పడుతున్నామని చెప్పడంతో ఆరు నెలల కిందటే ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ నైటీ వేసుకుంటే గ్రామ బహిష్కరణ అనేది అబద్ధం. 
    –  గణసల మహాలక్ష్మి, తాజా మాజీ సర్పంచ్‌

మైక్‌లో దండోరా వేయించారు
పగటిపూట గ్రామంలోని మహిళలు నైటీలు ధరించవద్దని.. జరిమానా విధిస్తామని గ్రామ పెద్దల నిర్ణయంగా మైక్‌లో దండోరా వేయించి హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో కొంత మంది వ్యతిరేకిస్తున్నారు. మిగిలిన వారు గ్రామ పెద్దల నిర్ణయానికి మద్దతిస్తున్నారు. 
    – జి.జ్యోతి, తోకలపల్లి 

మా కులం కట్టుబాట్లు గౌరవించాలి 
మహిళలు పగటిపూట నైటీలు ధరించొద్దని కుల పెద్దలు తీర్మానించడం వాస్తవమే. నా చిన్నప్పటి నుంచి మా కుల పెద్దల నిర్ణయం మేరకు నడుచుకుంటున్నాం. గ్రామానికి సంబంధించి సమస్యలుంటే.. గ్రామ పెద్దల సమక్షంలోనే పరిష్కరించుకుంటాం. లేని పక్షంలో న్యాయవ్యవస్థను ఆశ్రయిస్తాం.
    – గణసల ఆదినారాయణ, గ్రామపెద్ద, తోకలపల్లి

మహిళల కోరిక మేరకే  
నైటీలు రాత్రి వేళలోనే ధరించేలా గ్రామంలోని అందరూ కట్టుబడి ఉండేలా నిర్ణయం తీసుకోవాలని పలువురు మహిళలు కోరారు. వారి కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలనే జరిమానా అని హెచ్చరిస్తున్నాం తప్ప.. నేటికీ ఏ ఒక్కరికీ జరిమానా విధించలేదు. గ్రామ బహిష్కరణ అనేది మేము ఎక్కడా అనలేదు.
    – బలే సీతారాముడు, కుల పెద్ద  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top