వెదుళ్ల గడ్డకు వచ్చిన వరదనీరు జగన్నాథపురం గ్రామాన్ని ముంచెత్తింది. విశాఖ జిల్లాలో శనివారం కురిసిన భారీ వర్షానికి వెదుళ్లగెడ్డలోకి భారీగా వరదనీరు చేరింది. గత ఏడాది నీలం తుఫాన్‌కు జగన్నాథపురం వద్ద వెదుళ్లు గెడ్డకు గండ్లు పడ్డాయి.
జలదిగ్బంధంలో జగన్నాథపురం
Sep 9 2013 4:03 AM | Updated on Sep 1 2017 10:33 PM
జగన్నాథపురం (కోటనందూరు), న్యూస్‌లైన్ : వెదుళ్ల గడ్డకు వచ్చిన వరదనీరు జగన్నాథపురం గ్రామాన్ని ముంచెత్తింది. విశాఖ జిల్లాలో శనివారం కురిసిన భారీ వర్షానికి వెదుళ్లగెడ్డలోకి భారీగా వరదనీరు చేరింది. గత ఏడాది నీలం తుఫాన్‌కు జగన్నాథపురం వద్ద వెదుళ్లు గెడ్డకు గండ్లు పడ్డాయి. ఆ గండ్లకు ఇంతవరకు ఇరిగేషన్ అధికారులు మరమ్మతులు చేపట్టలేదు. శనివారం అర్ధరాత్రి సమయానికి వెదుళ్లగెడ్డలో వరదనీరు భారీగా రావడంతో గండ్ల గుండా వరదనీరు గ్రామంలోకి ప్రవేశించింది. ఎస్సీ, బీసీ కాలనీలతోపాటు గ్రామంలోని అధిక ప్రాంతాన్ని వరద ముంచెత్తడంలో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. వరదనీరు ఆదివారం గ్రామంలో నిలిచిపోవడంతో తాగునీటికి సైతం గ్రామస్తులు ఇబ్బందిపడ్డారు. వరదనీరు గ్రామం మీదుగా పంటపొలాల్లోకి ప్రవహించడంతో వరినాట్లు దెబ్బతినడంతోపాటు వరినారు కొట్టుకుపోయింది. గతేడాది నీలం తుఫాన్‌కు వెదుళ్లగెడ్డ ముంచెత్తడంతో ఈగ్రామం తీవ్రంగా నష్టపోయింది. మరల అలాగే జరిగిందని గ్రామస్తులు వాపోయారు. పది నెలలక్రితం పడిన గండ్లను పూడ్చకపోవడం వల్లే ఇప్పుడు ఇలా ఇబ్బందులుపడి నష్టపోవాల్సి వచ్చిందని గ్రామస్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక మరమ్మతులు
వెదుళ్లగెడ్డకు నీలం తుఫాన్ సమయంలో పడ్డ గండ్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడతామని ఇరిగేషన్‌శాఖ డీఈ కృష్ణారావు తె లిపారు. జగన్నాథపురం ముంపుపై స్థానికులు ఆదివారం జిల్లా ఉన్నతాధికారులకు ఫోన్ ద్వా రా ఫిర్యాదు చేశారు. పరిస్థితిని సమీక్షించాలని ఇరిగేషన్‌శాఖ ఎస్‌ఈ కాశీవిశ్వేశ్వరరావు సిబ్బం దిని ఆదేశించారు. దీనిపై జగన్నాథపురం వచ్చి న డీఈ గ్రామంలో వరదనీటిని, వెదుళ్లుగెడ్డ గం డ్లను పరిశీలించారు. స్థానిక నేతలు డి. చిరంజీవిరాజు, గొర్లి రామచంద్రరావు, ఎర్రా చినసత్యనారాయణ, మాతిరెడ్డి బాబులుతో ఆయన చర్చించారు. ఆనంతరం డీఈ కృష్ణారావు విలేకరులతో మాట్లాడుతూ వెదుళ్లగడ్డ గండ్ల శాశ్వత మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయని ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా వాటికి తాత్కాలిక మరమ్మతులు చేపడతామన్నారు.
Advertisement
Advertisement