ఆకాశంలో సగం.. భూలోకంలో భారం | the sky Half of the burden of the earth to | Sakshi
Sakshi News home page

ఆకాశంలో సగం.. భూలోకంలో భారం

Mar 8 2016 4:43 AM | Updated on Sep 3 2017 7:12 PM

ఆకాశంలో సగం.. భూలోకంలో భారం

ఆకాశంలో సగం.. భూలోకంలో భారం

ఆకాశంలో సగం.. అయినా అన్నింటా వెనుకబాటే. స్వాతంత్య్రం వచ్చి ఆరున్నర దశాబ్దాలు దాటినా మహిళల రక్షణకు పాలకులు ఒక్క ....

మహిళ అకాశంలో సగం.. అరుునా ఆమెకు రక్షణ కరువు
నిలువునా గీత దాటుతున్న అధికార పార్టీ నాయకులు
దుమారం రేపిన సినీహీరో బాలకృష్ణ వ్యాఖ్యలు
మంత్రి రావెల కుమారుని వికృత చేష్టలు
జిల్లాలో తగ్గని లైంగిక దాడులు
నేడు మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..

 
 నాటి మాట..
 మహిళలు అర్ధరాత్రి ఒంటరిగా బయటకు వెళ్లినప్పుడే
 దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు.
.   - జాతిపిత మహాత్మాగాంధీ
 
 నేటి మాట..
 ఆడది కనపడితే కడుపు చేయాలి..
 కుదరకుంటే కనీసం ముద్దయినా పెట్టుకోవాలి.. 
  - ఎమ్మెల్యే బాలకృష్ణ
 
 
 రాష్ట్రంలో రాజకీయ నేతలు ఎంత దిగజారి మాట్లాడుతున్నారో చూడండి. కొందరు అధికార పార్టీ నేతల వికృత మాటలు మహిళా లోకానికి కన్నీరు తెప్పిస్తున్నారుు. ప్రజల చేత ఎమ్మెల్యేగా ఎన్నికైన సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఓ సినిమా ఆడియో ఫంక్షన్‌లో మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నారుు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి రావెల కిషోర్‌బాబు తనయుడు హైదరాబాద్‌లో ఓ వివాహిత పట్ల వ్యవహరించిన తీరూ ఇప్పుడు చర్చనీయూంశమైంది. అందుకేనేమో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో జాతిపిత మహాత్మాగాంధీ అన్న మాటలు ఇప్పుడు గుర్తుకొస్తున్నారుు..   - సాక్షి ప్రతినిధి, ఒంగోలు క్రైం

 
 
 ఆకాశంలో సగం.. అయినా అన్నింటా వెనుకబాటే. స్వాతంత్య్రం వచ్చి ఆరున్నర దశాబ్దాలు దాటినా మహిళల రక్షణకు పాలకులు ఒక్క అడుగూ ముందుకేయడం లేదు. అర్ధరాత్రి స్త్రీ బయటకు ఒంటరిగా వెళ్లిననాడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని మహాత్మాగాంధీ చెప్పిన మాట ఇప్పుడు అక్షర సత్యమవుతోంది. అర్ధరాత్రి సంగతి అటుంచితే.. పట్టపగలే మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లలేకపోతున్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ కరువైందన్న వాదన ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. అడది కనపడితే ముద్దరుునా పెట్టుకోవాలి.. కడుపైనా చేయాలంటూ సావిత్రి సినిమా ఆడియో ఫంక్షన్‌లో ఆడవారిపై తనకున్న చిన్నచూపును బయట పెట్టాడు. మరోవైపు జిల్లా ఇన్‌చార్జి మంత్రి రావెల కిశోర్‌బాబు తనయుడు ఏకంగా ఒక వివాహిత చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించి నిర్భయ చట్టం కింద కటకటాలు లెక్కపెడుతున్నాడు.  

 కట్నం తేలేదని ఒకడు.. ప్రేమను నిరాకరించిందని మరొకడు.. మగపిల్లాడికి జన్మనీయలేదని ఇంకొకరు..  ఇలా ఒక్కొక్కరు ఒక్కో రావణాసురుడిలా మారి మహిళలను కాల్చుకుతింటున్నారు. చట్టాలెన్నీ వచ్చినా.. ఉద్యమాలెన్ని ఎగిసినా.. ఏదో మూల అబల ఆర్తనాదం వినిపిస్తూనే ఉంది. రోజు రోజుకు మహిళలపై అఘాయిత్యాలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు చర్యలు అవసరం. గర్భంలోనే స్త్రీ జాతిని నిర్మూలించే విధానాలకు అడ్డుకట్ట వేయాలి. స్త్రీలు లేకుంటే పురుష జాతి మనుగడే ప్రమాదంలో పడుతుందని గ్రహించాలి.

 సెక్షన్‌లు కఠినమైనా
 ఐపీసీ సెక్షన్-354 (అవమానపరచటం)
మహిళలు మనసులు గాయపరిచేలా చేసినా, మరే రకంగానైనా అవమానించినా ఈ సెక్షన్ వర్తిస్తుంది. మహిళలపై దౌర్జన్యం, ఆపరాధిక బలప్రయోగం చేసినా కూడా ఈ సెక్షన్ కిందకే వస్తాయి. నేరం రుజువైన తర్వాత ఏడేళ్ల కారాగారంతో పాటు జరిమానా విధించొచ్చు.   ఐపీసీ సెక్షన్-376 (లైంగిక దాడి)మహిళలపై లైంగిక దాడి చేస్తే ఈ సెక్షన్ కింద కఠినంగా శిక్షించొచ్చు. లైంగికదాడి నేరం చాలా కఠినంగా కోర్టులు పరిగణిస్తాయి. కేసు నమోదైన తర్వాత వెంటనే బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరిస్తుంది. నేరం రుజువైతే కనీసం 10 ఏళ్ల కారాగారం విధిస్తారు. లేదంటే యావజ్జీవ శిక్ష కూడా పడొచ్చు.

 ఐపీసీ సెక్షన్-498ఏ (గృహహింస)
 వివాహిత పట్ల భర్త, కుటుంబ సభ్యులు క్రూరంగా ప్రవర్తిస్తే ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. ఒక వేళ బాధితురాలికి ఎవరూ లేనిచో ప్రభుత్వం కేటాయించిన ఉద్యోగి ఎవరైనా బాధితురాలి తరఫున ఫిర్యాదు చేయవచ్చు. నేరం రుజువైతే మూడు సంవత్సరాల పాటు కారాగారం లేదా జరిమానా విధించవచ్చు.  

 మహిళా పోలీసుల కొరత
 జిల్లాలో మహిళా పోలీసుల కొరత వేధిస్తోంది. ఒంగోలు నగరపాలక సంస్థతో పాటు ఆరు మున్సిపాలిటీలు, 56 మండలాలున్నాయి. అన్ని చోట్లా పోలీసుస్టేషన్లు ఉన్నా మహిళా పోలీసులు మహిళా జనాభా నిష్పత్తి ప్రకారం లేరు. ఏటా వందలాది కేసులు మహిళలపై నమోదవుతున్నా జిల్లాలో 100 మంది మహిళా పోలీసులు కూడా లేకపోవడం గమనార్హం.
 
 ఇవి..మచ్చుకు కొన్నే..
ఈ ఏడాది జనవరిలో కందుకూరు పోలీసు సర్కిల్ పరిధిలో ముగ్గురు అబలలపై ఆటోడ్రైవర్‌లు లైంగిక దాడులకు పాల్పడ్డాడు. నమ్మి ఆటోలెక్కితే కీచకుల్లా ప్రవర్తించారు. చీరాలలో కూడా ఆటోవాలాల దుశ్చర్యలు దారుణంగా మారాయి.  
కారంచేడులో ఈ నెల 6వ తేదీన వివాహిత దగ్గుబాటి సునీత అనుమానాస్పదస్థితిలో ఇంట్లో ఉరికి వేలాడింది.  
ఫిబ్రవరి 23న మద్దిపాడులో నూనె అన్నపూర్ణ అనే మహిళ వరకట్న వేధింపుల కారణంగా అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది.
ఫిబ్రవరి 18న దర్శి పంచాయతీ శివరాజనగర్‌లో బండారు విజయలక్ష్మి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది.  
ఫిబ్రవరి 8న దర్శి మండలం వెంకటాచలంపల్లిలో అంకాల నర్సమ్మను భర్త నాగేశ్వరరావు అతి కిరాతకంగా నరికి చంపాడు.  
ఫిబ్రవరి 5న హనుమంతునిపాడు మండలం సీతారాంపురంలో వివాహిత కుమారి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది.  
ఫిబ్రవరి 3వ తేదీన కందుకూరులో పొగాకు బోర్డులో పని చేస్తున్న భార్య ప్రభావతిని ఆమె సహచరిణి భర్త వై.శేషగిరిరావు కిడ్నాప్ చేశాడు. చివరకు పోలీసులు స్థానికులు వెంటాడి పట్టుకున్నారు.
2015 మహిళలకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. ఏడాదికి 365 రోజులైతే ఈ సమయంలో ఏకంగా జిల్లాలో 420 గృహహింస కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
2012లో 274 కేసులు, 2013లో 393 కేసులు, 2014లో 402 కేసులు నమోదయ్యాయి.
మహిళలను, బాలికలను వివిధ రకాలుగా అవమానపరచటం, కించపరచటం లాంటి కేసులు కూడా తక్కువేమి కాదు. అవి కూడా ఏడాదికి ఏడాది పెరుగుతున్నాయి. 2012లో 229 కేసులు నమోదుకాగా 2015లో 288 కేసులు నమోదయ్యాయి. 2016 ఫిబ్రవరి నెలాఖరు వరకు 13 కేసులు నమోదయ్యాయి.
జిల్లాలో మహిళలపై ఆత్యాచార కేసులు సమాజాన్ని కలవరపెడుతున్నాయి. 2012లో 37 కేసులు నమోదు కాగా 2015లో 63 కేసులు, 2016 ఫిబ్రవరి వరకు మహిళలపై జిల్లావ్యాప్తంగా 10 కేసులు నమోదయ్యాయి. మహిళల కిడ్నాప్‌లు కూడా చోటుచేసుకుంటున్నాయి. 2016 ఫిబ్రవరి నెల వరకు రెండు నెలల్లో కలిపి 2 కిడ్నాప్ కేసులు నమోదు చేశారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement