హిమబిందు కేసుపై పోలీసుల పోస్టుమార్టం | The post-mortem on the case himabindu | Sakshi
Sakshi News home page

హిమబిందు కేసుపై పోలీసుల పోస్టుమార్టం

Jul 30 2015 3:02 AM | Updated on Aug 21 2018 7:26 PM

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు’ హిమబిందు కేసును న్యాయస్థానం కొట్టేసిన తర్వాత పోలీసు అధికారులు

తీర్పు కాపీలు పంపాలని డీజీపీ ఆదేశం
లోపాలపై కమిషనరేట్ అధికారుల దృష్టి
 
 విజయవాడ సిటీ : ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు’ హిమబిందు కేసును న్యాయస్థానం కొట్టేసిన తర్వాత పోలీసు అధికారులు పోస్టుమార్టం చేస్తున్నారు. హిమబిందు కేసు కొట్టివేత, పౌరులు, ప్రజా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆగ్రహించిన రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు పోలీసుల వైఫల్యంపై వివరణ కోరినట్టు తెలిసింది. గత ఏడాది మార్చి 15వ తేదీన పటమట శాంతినగర్ ఎంటిఎస్ టవర్స్‌కు చెందిన సప్తగిరి బ్యాంక్ మేనేజర్ మోదుమూడి సాయిరామ్ భార్య హిమబిందు(41) హత్య, ఆపై కోర్టు తీర్పు తెలిసిందే. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు తొలుత అదృశ్యం కేసు నమోదు చేసిన పటమట పోలీసులు..గోసాల సమీపంలో మృతదేహం వెలుగు చూసిన తర్వాత హత్య కేసుగా మార్చారు.

కేసు దర్యాప్తులో భాగంగా అదే నెల 24వ తేదీన పక్కింటి ప్లాట్ యజమాని డ్రైవర్ మహ్మద్ సుభాని, అతడి స్నేహితుడు సోమన గోపీకృష్ణను అరెస్టు చేశారు. ఆ తర్వాత వేల్పూరు దుర్గాప్రసాద్, జనపాల కృష్ణ, లంకపల్లి రమణ, మహ్మద్ గౌస్‌ను వేర్వేరు తేదీల్లో అరెస్టు చేసిన పటమట పోలీసులు బంగారు, వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా ఇంట్లోకి చొరబాటు, అత్యాచారం, హత్య, దోపిడీ, ఎక్కువ మంది నేరంలో పాల్గొనడం, సాక్ష్యాలను చెరిపేందుకు ప్రయత్నించడం వంటి నేరాల కింద వీరిపై కేసు నమోదు చేశారు. 

అరెస్టు చేసిన వీరంతా అప్పటి నుంచి జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా రెండుమార్లు కోర్టులో చార్జిషీటు(నేరాభియోగ పత్రం) దాఖలు చేశారు. మంగళవారం మహిళా న్యాయస్థానం హిమబిందు కేసులో ప్రాసిక్యూషన్ మోపిన అభియోగాలకు తగిన సాక్ష్యాలు లేవంటూ కొట్టేసింది. హిమబిందు కేసు కొట్టివేతపై బంధువులతో పాటు నగరవ్యాప్తంగా పోలీసుల చర్యపై ఆరోపణలు వెల్లువెత్తాయి.

 లోపాలు నిజమే..
 హిమబిందు హత్య కేసు దర్యాప్తు, కోర్టుకు అందజేసిన ఆధారాలు లోపభూయిష్టంగా ఉన్నట్టు కమిషనరేట్ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అన్ని వైపుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తడంతో కమిషనరేట్ అధికారులు తీర్పు కాపీని అధ్యయనం చేస్తున్నారు. బుధవారం కమిషనరేట్ ఉన్నతాధికారులు తీర్పు కాపీలు తెప్పించుకొని చార్జిషీటులో దాఖలు చేసిన అంశాలు, ప్రవేశపెట్టిన ఆధారాలను పరిశీలించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తీర్పు కాపీలు పరిశీలించిన తర్వాత దర్యాప్తు అధికారుల లోపాలను ఉన్నతాధికారులు గుర్తించారు.  ఎవరు బాద్యులనే దిశగా అధికారులు దృష్టిసారించారు.  

 న్యాయ సలహా..
 హిమబిందు కేసుపై హైకోర్టుకు అప్పీలుకు వెళ్లాలని నిర్ణయించిన పోలీసు అధికారులు న్యాయ నిపుణుల సల హాలు తీసుకుంటున్నారు. బుధవారం పటమట ఇన్‌స్పెక్టర్ కె.దామోదర్ హిమబిందు కేసులో మహిళా సెషన్స్ కోర్టు తీర్పుపై స్పెషల్ ఏపీపీతో ప్రత్యేకంగా చర్చించారు. కోర్టుకు పోలీసులు అందజేసిన ఆధారాలు, కోర్టు వ్యాఖ్యలపై సుదీర్ఘంగా చర్చించారు. దిగువ కోర్టు తీర్పుపై పై కోర్టుకు వెళ్లనున్న నేపథ్యంలో న్యాయ నిపుణుల సలహా మేరకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement