నిధులివ్వకుంటే ఉద్యమం | The movement takes on funds | Sakshi
Sakshi News home page

నిధులివ్వకుంటే ఉద్యమం

Dec 28 2014 2:31 AM | Updated on Jul 28 2018 6:48 PM

ప్రకాశం జిల్లాకు ప్రాణాధారమైన వెలుగొండ ప్రాజెక్టుకు వచ్చే బడ్జెట్‌లోనైనా నిధులు కేటాయించక..

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ప్రకాశం జిల్లాకు ప్రాణాధారమైన వెలుగొండ ప్రాజెక్టుకు వచ్చే బడ్జెట్‌లోనైనా నిధులు కేటాయించకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు. శనివారం సాయంత్రం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏడాదిలోగా  ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని అసెంబ్లీలో చెప్పిన చంద్రబాబు బడ్జెట్‌లో కేవలం రూ. 75 కోట్లు మాత్రమే కేటాయించారని, ఇవి పాత బిల్లులకు సరిపోవడంతో కొత్తగా పనులు చేస్తే డబ్బులు వచ్చే అవకాశం లేకపోవడంతో రెండు నెలలుగా ప్రాజె క్టు పనులు పూర్తిగా నిలిచిపోయాయన్నారు.

వచ్చే బడ్జెట్‌లో కనీసం రూ. 250 కోట్లు కేటాయిస్తేగాని తొలిదశ పూర్తయ్యే అవకాశం లేదన్నారు. నిధులు కేటాయించకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అవసరమైతే నిరాహారదీక్షలకు కూడా వెనుకాడరని హెచ్చరించారు. దివంగత ముఖ్యమంత్రి  రాజశేఖరరెడ్డి ప్రారంభించిన వెలుగొండ, గుండ్లకమ్మ, రామతీర్ధం, గొట్టిపాటి హమనుమంతరావు ప్రాజెక్టు, చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకాలు పూర్తికాకుండా నిలిచిపోయాయన్నారు. గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాల్లో  తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై నిలదీస్తున్నందునే ఈ ప్రభుత్వం ఈ మాత్రమైనా స్పందిస్తోందన్నారు.

ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కోసం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడినట్లు చెప్పారు.  రాష్ట్ర విభజన తర్వాత ప్రకాశం జిల్లాకు తీరని అన్యాయం జరిగిందన్నారు.  యు.పి.ఎ. ప్రభుత్వం రామాయపట్నం పోర్టును కాదని దుగరాజపట్నం పోర్టును విభజన బిల్లులో పొందుపరిచిందని గుర్తు చేశారు. ఈ అంశంపై పార్లమెంట్ సమావేశాల చివరి రోజున తాను ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసి జిల్లా పరిస్థితిని వివరించానని, ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. రామాయపట్నం పోర్టుకు నిధులు కేటాయించేందుకు వనరులు లేకపోతే పీపీపీ పద్దతిలోనైనా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. ఒంగోలు రైల్వే స్టేషన్‌లో లిఫ్ట్, ఎస్కలేటర్ ఏర్పాటు కోసం రైల్వే మంత్రిని కలిశామని, ఆయన తమ ముందే జీఎంకు ఫోన్ చేసి 15 రోజుల్లో టెండర్లు పిలవాలని ఆదేశించారని గుర్తు చేశారు.

తాను విజయవాడ డీఆర్‌ఎంతో మాట్లాడానని టెండర్లకు ప్రతపాదనలు పంపినట్లు చెప్పారన్నారు. పశ్చిమ ప్రకాశం జిల్లాకు అవసరమైన నడికుడి - శ్రీకాళహస్తి లైన్ కోసం తాను, నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ సభ్యులు రైల్వే మంత్రిని కలిసి వివరించామని, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా ఈ విషయంలో కలిసి వచ్చారని చెప్పారు. వచ్చే బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించే అవకాశం ఉందన్నారు.  ఈ రైల్వే లైన్ వస్తే గుంటూరు నుంచి చిత్తూరు వరకూ నాలుగు జిల్లాల్లో పలుప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. దొనకొండను రాజధానిగా చేయకపోయినా పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.

రోడ్లు, రైలు మార్గాలు అభివృద్ధి చెందితేనే పారిశ్రామిక ప్రగతి సాధ్యమవుతుందని, అందువల్ల దొనకొండ- ఒంగోలు రైలు మార్గం అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. ఒంగోలు - నంద్యాల మధ్య నాలుగులైన్లుగా అభివృద్ధి చేయాలని  కేంద్ర మంత్రి నితిన్‌గడ్కారిని కలిసి విజ్ఞప్తి చేశానని చెప్పారు.రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కోసం కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెస్తామని చెప్పారు. డిసెంబర్ 25న మాజీ ప్రధాని వాజ్‌పేయి, మదన్‌మోహన్ మాలవీయకు భారతరత్న ప్రకటించడం పట్ల హర్షం ప్రకటించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డిలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement