ప్రకాశం భగభగ

ప్రకాశం భగభగ - Sakshi


సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా మండుతోంది. జూన్ మూడో వారానికి వర్షాలు పడి చల్లబడాల్సిన భానుడు చెలరేగిపోతున్నాడు. ఉదయం ఆరు గంటల నుంచే నిప్పులవాన కురిపిస్తున్నాడు. రోహిణీకార్తె వెళ్లిపోయిన తర్వాత ముదిరిన ఎండలు రోళ్లను పగలగొడుతున్నాయి. రోజురోజుకీ ఎండ వేడి పెరిగిపోతుండడంతో జనం అల్లాడిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 42 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

 

 =    ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాలు మందగిస్తున్నాయన్న వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది అత్యంత తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది.  

 =    మే నెల ఎండలు మృగశిర కార్తెలో కనిపించడం విశేషం. కార్తె ప్రారంభమై వారం రోజులు అయినా వర్షాలు కురవకపోవడంతో పాటు వడగాలులు ఎక్కువగా వీస్తున్నాయి. ఉదయం 6 గంటల నుంచే ప్రారంభమవుతున్న ఎండ సాయంత్రం ఆరు గంటలు దాటుతున్నా తగ్గడంలేదు.

 =    ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 5 గంటల సమయంలో రోడ్డు మీద వెళుతుంటే నిప్పుల కొలిమిలోంచి వెళ్లినట్లే ఉంటోంది. రాత్రి పదిగంటలు అయినా ఉక్కపోత తగ్గడం లేదు. వేడిగాలులు వీస్తూనే ఉన్నాయి.

 =    దీంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 12 నుంచి మొదలైన వడగాడ్పులకు సోమవారం వరకూ 48 మంది మృతి చెందారు. మంగళవారం 18 మంది మృత్యువాత పడ్డారు.

 =    విద్యుత్ వాడకం పెరుగుతుండటంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు పలుమార్లు అంతరాయం కలిగింది. మండల కేంద్రాల్లో, గ్రామాల్లో ఎప్పుడు పడితే అప్పుడు విద్యుత్ సర ఫరా నిలిపేస్తున్నారు.

 =    అస్తవ్యస్త విద్యుత్ సరఫరా వల్ల రైతులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ప్రకటించిన సమయానికి విద్యుత్ సరఫరా కాకపోవడంతో పొలాల్లోనే వేచి చూడాల్సి వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 =    విద్యుత్ కోతల పట్ల ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఉలవపాడు మండల పరిధి అలగాయపాలెం సబ్‌స్టేషన్‌ను మంగళవారం స్థానిక ప్రజలు ముట్టడించారు. విద్యుత్ ఉద్యోగులను లోపలే ఉంచి బయట గేటుకు తాళం వేశారు. విషయం తెలుసుకుని వచ్చిన ఏఈ హరికృష్ణను కూడా లోపలే ఉంచి గేటు బయట తాళం వేశారు.

 =    ఎండవేడిమికి మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ఎండకు తోడు వేడిగాలులు, ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బయటకెళితే మండుతున్న ఎండ, ఇంట్లో ఉంటే ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top