breaking news
The monsoon
-
మళ్లీ సెగలు
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు రెండు మూడు రోజులు కొనసాగే అవకాశం పశ్చిమ గాలుల ప్రభావం విశాఖపట్నం: దాదాపు వారం రోజుల పాటు వాతావరణం చల్లదనాన్ని పంచింది. రుతుపవనాల రాకకు ముందు కురిసే వానలతో వేడిని చల్లార్చింది. సుమారు ఇరవై రోజుల పాటు కొనసాగిన ఉష్ణతాపంపై నీళ్లు చల్లింది. మేఘాలు, చిరుజల్లులతో అంతా హాయిగా ఉందనుకుంటున్న తరుణంలో మళ్లీ ఉష్ణతాపం మొదలైంది. సెగలు పుట్టిస్తోంది. దీంతో జనం బయటకు వెళ్లడానికి వెనకంజ వేస్తున్నారు. నడినెత్తిన పడుతున్న భానుడి కిరణాలను తాళలేక పోతున్నారు. సూర్యతాపం నుంచి ఉపశమనం పొందడానికి గొడుగులను ఆశ్రయిస్తున్నారు. రెండ్రోజుల క్రితం నగరంలో ఈ నెల 8న 26.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అది శీతాకాలంలో నమోదయ్యే ఉష్ణోగ్రత. ఆ మర్నాడు (మంగళవారం) ఒక్కసారిగా పది డిగ్రీలు పెరిగి 37 డిగ్రీలకు చేరుకుని వేసవి తాపాన్ని గుర్తు చేసింది. బుధవారం 36.4 డిగ్రీలు రికార్డయి దాదాపు అంతే ఉష్ణతీవ్రత కొనసాగింది. ప్రస్తుతం పశ్చిమ, వాయవ్య గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు మళ్లీ ఊపందుకున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరికొన్నాళ్లు ఇవి కొనసాగుతాయని అంటున్నారు. అల్పపీడనద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావ ంతో మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఉరుములతో కూడిన జల్లులు, తేలికపాటి కురుస్తాయని, అయినప్పటికీ ఉష్ణతీవ్రత ఉంటుందని వీరు పేర్కొంటున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి వచ్చే రెండు మూడు రోజులు ఉష్ణోగ్రతల ప్రభావం ఉంటుందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు చెప్పారు. -
ఎల్ నినో తప్పదా?
వాన చినుకు రైతన్నను వంచిస్తోంది! అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట నోటికందక ఒకసారి... చినుకు కోసం ఎదురుచూపులతో ఇంకోసారి... ఏళ్లుగా ఇదే వాతావరణం తీరు. గోరుచుట్టుపై రోకటి చందంగా... ఈ ఏడాది ఎల్ నినో ఒకటి దాపురించనుంది. ఎక్కడో దక్షిణ అమెరికా దగ్గర సముద్రం వెచ్చబడితే... మనకు వానలు తగ్గడమేమిటి? ఏళ్లుగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నట్లుగా... వాతావరణం చిత్రవిచిత్రంగా మారుతోందా? రుతుపవనాలు దారితప్పుతున్నాయా? లేక మరేదైనా కారణముందా? ఇదే ఈ వారం మన ‘ఫోకస్’... గిళియార్ గోపాలకృష్ణ మయ్యా దేశంలోని కోట్ల మంది రైతులకు, వ్యాపారానికి ఆ మాటకొస్తే.. దేశ బడ్జెట్‌కు కీలకమైన వాతావరణ అంచనాలు ఇటీవలే వెలువడ్డాయి. గత నెలలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) విడుదల చేసిన ప్రాథమిక అంచనాల మేరకు ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఏర్పడేందుకు 68 శాతం అవకాశం ఉంది. పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడే ఎల్ నినో (ఎల్ నినో అంటే? చూడండి) దీనికి కారణంగా చెబుతున్నారు. మూడు, నాలుగేళ్లకు ఒకసారి వచ్చే ఈ వాతావరణ దృగ్విషయం ఫలితంగా దక్షిణాసియా ప్రాంతంలో రుతుపవనాలు బలహీనపడతాయి. ఆస్ట్రేలియాలోనూ ఇదే పరిస్థితి. ఈ ఏడాది సమస్య ఎల్ నినో కావచ్చుగానీ.. కొన్నేళ్లుగా ఐఎండీ అంచనాలు గతి తప్పడం మాత్రం గమనార్హం. గత ఏడాది రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. వర్షాలు కొంతవరకూ తగ్గుతాయని ఐఎండీ చెబితే అసలు కురిసిన వానలు సగటు కంటే దాదాపు పది శాతం తక్కువగా ఉన్నాయి. అంతకు ముందు ఏడాది కూడా సాధారణ వర్షపాతం అన్న ఐఎండీ అంచనాలు తారుమారై అధిక వర్షాలు నమోదయ్యాయి. అంతెందుకు.. గత 21 ఏళ్లలో భారత వాతావరణ విభాగం లెక్కేసిన అంచనాల ప్రకారం వర్షాలు కురిసింది కేవలం ఆరుసార్లే! కర్ణుడి చావుకు కారణాలు నూరు అన్నట్లు... వాతావరణ అంచనాలు గతి తప్పేందుకూ అనేక కారణాలున్నాయి. ఐఎండీ నిన్న మొన్నటివరకూ ఉపయోగించిన పద్ధతి దీంట్లో ఒకటి. గత యాభై ఏళ్ల సగటు వర్షపాతం, కొన్ని ఇతర సూచికలతో కూడిన ఈ పద్ధతి దీర్ఘకాలిక సగటులో ‘ఫలానా’ శాతం వర్షాలు కురుస్తాయి అని మాత్రమే చెప్పేది. అందుకు ఎంతమేరకు అవకాశముందో మాత్రం చెప్పేది కాదు. గత ఐదారేళ్లలో పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. ఆధునిక టెక్నాలజీ సమకూర్చుకోవడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ వాతావరణ సంస్థలు వెలువరించే అంచనాలను పరిగణనలోకి తీసుకుని ఏప్రిల్‌లో ప్రాథమిక, జూన్‌లో తుది అంచనాలు వెలువరించడం మొదలుపెట్టింది. వాతావరణ మార్పుల ప్రభావం పారిశ్రామిక విప్లవ కాలం నుంచి భూమి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. అటవీ విస్తీర్ణం తగ్గిపోవడం, పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం వంటివి దీనికి కారణాలు. దీని వల్ల కార్బన్ డైయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, భూగత మీథేన్ వంటి ప్రమాదకర వాయువులు వాతావరణంలోనే ఉండిపోయి.. వేడిని నిల్వ చేసుకుంటాయి. ఈ భూతాపోన్నతి కారణంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తాయనీ, ధ్రువ ప్రాంతాల్లోని మంచు కరిగిపోయి సముద్రమట్టాలు పెరిగిపోతాయనీ, తీరప్రాంతంలోని మహానగరాలూ నీటమునుగుతాయనీ ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన ‘ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఫర్ క్లైమేట్ ఛేంజ్’ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఎల్ నినోనే ఒక ఉదాహరణగా తీసుకుంటే.. వాతావరణ వివరాలను నమోదు చేయడం మొదలుపెట్టినప్పటి (1880) నుంచి 2005 వరకూ వచ్చిన ఎల్ నినోల్లో సగం కరవుకు కారణం కాలేదు. కానీ 1990 నుంచి 2005 మధ్యకాలంలో మాత్రం మొత్తం 13 సార్లు వర్షాభావ, కరువు పరిస్థితులు నమోదైతే.. ఇందులో పదిసార్లు అవి ఎల్ నినో వచ్చిన ఏడాదిలోనే ఉండటం గమనార్హం. భూమి సగటు ఉష్ణోగ్రతలు కూడా గత 200 ఏళ్లలో దాదాపు ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ మేరకు పెరిగాయి. కానీ ఈ మధ్యకాలంలో అధిక ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతూండటం గమనార్హం. రెండేళ్ల క్రితం ఉత్తరాఖండ్‌ను కుదిపేసిన కుంభవృష్టి అందరికీ గుర్తుండే ఉంటుంది. నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించిన రెండు వారాల్లోపే అతితక్కువ సమయంలో అత్యధిక వర్షాలు కురవడం, గంగానది శివాలెత్తి తీర ప్రాంతాలను ముంచేయడం మన కళ్లముందే ఉంది. వాతావరణ మార్పుల ప్రభావానికి ఈ సంఘటన ప్రబల తార్కాణమన్నది నిపుణుల అంచనా. అంతకుముందు పాకిస్తాన్లో వచ్చిన కుంభవృష్టికీ (క్లౌడ్‌బరస్ట్), ఇటీవల కశ్మీర్లో వచ్చిన అకాల వరదలకూ వాతావరణ మార్పులే హేతువన్నది నిర్వివాదాంశం.తాజాగా ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా కురిసిన వర్షాలనే తీసుకుంటే... మామూలు పరిస్థితుల్లో ఈ కాలంలో కురిసే వానలకు పది రెట్లు ఎక్కువ కురవడం మనం గమనించవచ్చు. మార్చి ఒకటవ తేదీ నుంచి ఏప్రిల్ 15 మధ్యకాలంలో కురిసిన వర్షం ఒక ఏడాది వానలో 20 శాతం ఉందని ఐఎండీ తెలిపింది. ఎల్ నినో ఖాయమేనా? అంతర్జాతీయ సంస్థలతోపాటు ఐఎండీ కూడా ఈ ఏడాది ఎల్ నినో ఖాయమనే చెబుతున్నాయి. అయితే దేశంలోనే తొలి ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ మాత్రం దీనికి భిన్నమైన వాదన వినిపిస్తోంది. ఈ ఏడాది వర్షాలు సాధారణ స్థితిలోనే ఉంటాయనీ, ఎల్ నినో పరిస్థితులు ఉన్నప్పటికీ రుతుపవనాలపై దాని ప్రభావం పెద్దగా ఉండబోదనీ స్కైమెట్సీఈవో జతిన్ సింగ్ అంటున్నారు తీరుతెన్నులూ మారుతున్నాయి... దేశంలో ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంటుంది. ఈ నాలుగు నెలల కాలంలోనే మనక్కావాల్సిన వర్షాల్లో 80 శాతం వరకూ కురుస్తాయి. అయితే ఇటీవల కొన్నిచోట్ల ఎక్కువ వర్షాలు పడటం... అది కూడా అతితక్కువ సమయంలో జరిగిపోవడం సాధారణం అవుతోంది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడటమూ మనం చూస్తున్నాం. 1980 - 2011 మధ్యకాలాన్ని పరిశీలిస్తే సగటు వర్షపాతం క్రమేపీ తగ్గుతోందనీ, అదేసమయంలో ఉత్తరాఖండ్ వంటి విపరీత పోకడల తీవ్రత పెరుగుతోందనీ స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ వాతావరణ విభాగం ఇటీవల విడుదల చేసిన నివేదిక స్పష్టం చేస్తోంది. ‘‘ఒక రోజులో పది సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతున్న సంఘటనలు దేశం మధ్యప్రాంతంలో ఎక్కువవుతున్నాయి. ఒక మోస్తరు వర్షాలు కురిసే సంఘటనలు తగ్గుతున్నాయి’’ అని గత ఏడాది కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ స్వయంగా పార్లమెంట్లో ప్రకటన చేయడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతుంది. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే.. భవిష్యత్తులో రుతుపవనాల అంచనా మరింత సంక్లిష్టమవుతుందని దేశీ, విదేశీ సంస్థలు జరిపిన అధ్యయనాలు స్పష్టం చేస్తూండటం ఆందోళన కలిగించే అంశం. ఎల్ నినో అంటే? భూమధ్య రేఖ వెంబడి పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వీచే గాలులు, వాటి పీడనాల్లోని తేడాల కారణంగా ఈ వెచ్చటి నీరు ప్రయాణించే దిశ మారిపోతుంది. సాధారణ పరిస్థితుల్లో ఈ వెచ్చటి నీటిని అధిక పీడనంతో కూడిన గాలులు తూర్పువైపు నుంచి పశ్చిమం వైపు తీసుకెళతాయి. అయితే అప్పుడప్పుడు ఇందులో తేడాలు వస్తాయి. గాలులు అంత బలంగా లేకపోవడం, పీడనం కూడా తక్కువగా ఉండటం వల్ల వెచ్చటి నీరు దక్షిణ అమెరికా ప్రాంతంలోనే ఉండిపోతుంది. ఈ వాతావరణ దృగ్విషయాన్నే ఎల్ నినో అని పిలుస్తారు! నీటి వెచ్చదనంతో గాలి పొరలు వేడెక్కి తేలికగా మారతాయి. పైకి ఎగుస్తాయి. పైనున్న చల్లటిగాలి కిందకు దిగడం మొదలవుతుంది. ఫలితంగా దక్షిణ అమెరికాలోని పెరూ ఎడారుల వద్ద భారీ వర్షాలు నమోదవుతాయి. గాలుల్లోని తేమంతా అక్కడే ఖర్చవడం వల్ల మేఘాలను మోసుకొచ్చే గాలులు బలహీనపడతాయి. కష్టమ్మీద తూర్పువైపు ప్రయాణిస్తాయి. దీం తో ఆస్ట్రేలియాతోపాటు భారత్, దక్షిణాసియాలో వర్షపాతం తగ్గుతుంది. {Mిస్మస్కు కొంచెం అటు ఇటుగా సముద్రపు నీరు వెచ్చబడటాన్ని దృష్టిలో ఉంచుకుని పెరూ మత్స్యకారులు దీనికి ఎల్ నినో(పసి బాలుడు) అని పేరు పెట్టారు. పది ఎలుక తోకలకు కిలో బియ్యం ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఫిలిప్పైన్స్ విచిత్రంగా సన్నద్ధమవుతోంది. ఎల్ నినో కాలంలో సంభవించే దిగుబడి నష్టాన్ని పూడ్చుకునేందుకు అక్కడి ప్రభుత్వం ఎలుకల వేటను ప్రోత్సహిస్తోంది. పది తోకలను వేటాడి తెచ్చిన రైతులకు కిలో బియ్యాన్ని అందిస్తామని ప్రకటిస్తోంది. దీనివల్ల పంటలకు నష్టాన్ని కలిగించే ఎలుకల్ని చంపినట్టూ అవుతుంది, అవి కాజేసే మేరకు గింజల్ని మిగిల్చినట్టూ అవుతుంది. ఇప్పటివరకు రైతులు సుమారు 37,000 ఎలుక తోకల్ని పోగేయగలిగారు. 25% ఎల్ నినో సంభవించిన ఏడాదిలో సగటున దిగుబడి 25 శాతం తగ్గుతుందని అంచనా! 68% భారత వాతావరణ విభాగం (ఐఎండీ) విడుదల చేసిన ప్రాథమిక అంచనాల మేరకు ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఏర్పడేందుకు దాదాపు 68 శాతం అవకాశముంది. 6 గత 21 ఏళ్లలో భారత వాతావరణ విభాగం లెక్కేసిన అంచనాల ప్రకారం వర్షాలు కురిసింది కేవలం ఆరుసార్లే! 10 1880 నుంచి 2005 మధ్యకాలంలో వచ్చిన ఎల్ నినోల్లో సగంసార్లు మాత్రమే తక్కువ వర్షాలు కురిశాయి. అయితే 1950 తరువాత వర్షాభావ సంవత్సరాలు ఎక్కువగా ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటివరకూ మొత్తం 13 కరువు సంవత్సరాలు ఉంటే వాటిల్లో పది ఎల్ నినోలు వచ్చినప్పుడే నమోదవడం గమనార్హం. -
మేఘమా..జాలి చూపుమా !
ఖరీఫ్ దోబూచులాడుతోంది. కారుమేఘం కరుణించనంటోంది. రుతుపవనాలు అదిగో ఇదిగో అనడమే తప్పిస్తే.. వర్షం జాడ కరువైంది. అక్కడక్కడా విత్తనం వేసినా.. వడగాడ్పుల ధాటికి మొలక మాడుతోంది. వరుణుడు ముఖం చాటేయడం రైతన్న ఆశలను ప్రశ్నార్థకం చేస్తోంది. పెట్టుబడి సమస్యతో అతికష్టం మీద సాగుకు సమాయత్తమైన అన్నదాత బతుకు భారమవుతోంది. కర్నూలు(అగ్రికల్చర్) : సాధారణంగా జూన్ రెండో వారంలో రుతు పవనాలు అన్ని ప్రాంతాలకు విస్తరించాలి. ప్రస్తుతం మూడో వరం గడుస్తున్నా ఆ జాడే కనిపించని పరిస్థితి. ఈ నెలలో సాధారణ వర్షపాతం 77.1 మిల్లీమీటర్లు కాగా.. ఇప్పటి వరకు 58.7 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. నెల మొదట్లో ఒకట్రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురిసినా రుతు పవనాలు విస్తరించకపోవడంతో ఎండత తీవ్రత రెట్టింపయింది. గత ఏడాదితో పోలిస్తే ఈ విడత విత్తన పనులు మొదలైనప్పటికీ ఎల్‌నినో ప్రభావం, రుతు పవనాల జాప్యం ఖరీఫ్‌పై ప్రభావం చూపుతోంది. ఖరీఫ్ సాధారణ సాగు 5,85,351 హెక్టార్లు కాగా.. జిల్లాలోని 20,724 హెక్టార్లలో మాత్రమే విత్తనం పడింది. ఇందులో అత్యధికంగా 13,169 హెక్టార్లలో పత్తి సాగయింది. తగిన తేమ లేకపోవడంతో 5 వేల హెక్టార్లలో పత్తి విత్తనం మొలకెత్తకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. గత ఏడాది పత్తి 1.50 లక్షల హెక్టార్లలో సాగవగా.. ఈసారి 2 లక్షల హెక్టార్లు దాటవచ్చని తెలుస్తోంది. పత్తి సహా వేరుశనగ, ఇతర అన్ని పంటల సాగుకు జూలై చివరి వరకు అవకాశం ఉన్నా పత్తి, ఆముదం, కంది పంటలను జూన్ చివరిలోగా వేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. వ్యవసాయ శాఖ ఖరీఫ్ ప్రణాళిక ప్రకారం జిల్లాలో అత్యధికంగా వేరుశనగ 1,34,916 హెక్టార్లలో సాగవ్వాల్సి ఉంది. ఇందుకోసం జిల్లాకు 40 వేల క్వింటాళ్ల వేరుశనగ సబ్సిడీపై పంపిణీకి మంజూరైంది. 1,327 హెక్టార్లలో సాగు చేపట్టినా విత్తన పంపిణీ ఊసే కరువైంది. ఏపీ సీడ్స్ వంటి సప్లయ్ ఏజెన్సీలకు వేరుశనగ సరఫరా చేసే దళారీలు(ఆర్గనైజర్లు) ప్రభుత్వం నుంచి భారీ ధరను ఆశిస్తున్నారు. ప్రభుత్వం వీరికిచ్చే ధరను ఇంతవరకు ఖరారు చేయకపోవడంతో వేరుశనగ పంపిణీపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. జీలుగ, పిల్లి పెసర విత్తనాల జాడే లేకపోవడం రైతులను గందరగోళానికి గురిచేస్తోంది. బ్లాక్‌లో పత్తి విత్తనాలు కొన్ని బ్రాండెడ్ కంపెనీల పత్తి విత్తనాలను వ్యాపారులు బ్లాక్‌లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. జాదు, అజిత్ 155 తదితర రకాలను వ్యాపారులు రూ.1100 నుంచి ఆపై ధరకు విక్రయిస్తున్నారు. గ్రామాల్లో అనధికార పత్తి విత్తన ప్యాకెట్లు అమ్ముతునా వ్యవసాయ శాఖ మీనమేషాలు లెక్కిస్తోంది. ఇవి నకిలీ విత్తనాలు కావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నా పట్టించుకోకపోవడం గమనార్హం. పెట్టుబడి సమస్య: ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అధికారం కోసం రైతుల వ్యవసాయ రుణాలు, మహిళల డ్వాక్రా రుణాల మాఫీని ప్రకటించి లబ్ధి పొందారు. అధికారం దక్కగానే మొద టి సంతకంగా రుణమాఫీ అమలుకు విధి విధానాలను రూపొందించేందుకు కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు. ఈ హామీని వాయిదా వేసేందుకే ఆయన ఈ కొత్త డ్రామాకు తెర తీసినట్లు చర్చ జరుగుతోంది. రుణమాఫీ హామీ నేపథ్యంలో బ్యాంకులు పంట రుణాల పంపిణీకి ముందుకురాని పరిస్థితి నెలకొంది. పైగా రుణాలను చెల్లించాలని నోటీసులు జారీ చేస్తున్నాయి. ఈ కారణంగా రైతులను పెట్టుబడి సమస్య వెంటాడుతోంది. ఎకరం భూమిలో పత్తి విత్తనం వేయాలంటే కనీసం రూ.10 వేలు అవసరం. విధిలేని పరిస్థితుల్లో మే, జూన్ నెలల్లో జిల్లాలో 10 వేల మందికి పైగా రైతులు బంగారం కుదువ పెట్టి రూ.50 కోట్లకు పైగా అప్పులు తెచ్చినట్లు తెలుస్తోంది. ప్రైవేట్ వ్యాపారుల వద్ద రూ.3, రూ.5 వడ్డీతోనూ మరికొందరు పెట్టుబడి మొత్తం సమకూర్చుకున్నట్లు సమాచారం. -
ప్రకాశం భగభగ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా మండుతోంది. జూన్ మూడో వారానికి వర్షాలు పడి చల్లబడాల్సిన భానుడు చెలరేగిపోతున్నాడు. ఉదయం ఆరు గంటల నుంచే నిప్పులవాన కురిపిస్తున్నాడు. రోహిణీకార్తె వెళ్లిపోయిన తర్వాత ముదిరిన ఎండలు రోళ్లను పగలగొడుతున్నాయి. రోజురోజుకీ ఎండ వేడి పెరిగిపోతుండడంతో జనం అల్లాడిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 42 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. = ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాలు మందగిస్తున్నాయన్న వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది అత్యంత తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. = మే నెల ఎండలు మృగశిర కార్తెలో కనిపించడం విశేషం. కార్తె ప్రారంభమై వారం రోజులు అయినా వర్షాలు కురవకపోవడంతో పాటు వడగాలులు ఎక్కువగా వీస్తున్నాయి. ఉదయం 6 గంటల నుంచే ప్రారంభమవుతున్న ఎండ సాయంత్రం ఆరు గంటలు దాటుతున్నా తగ్గడంలేదు. = ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 5 గంటల సమయంలో రోడ్డు మీద వెళుతుంటే నిప్పుల కొలిమిలోంచి వెళ్లినట్లే ఉంటోంది. రాత్రి పదిగంటలు అయినా ఉక్కపోత తగ్గడం లేదు. వేడిగాలులు వీస్తూనే ఉన్నాయి. = దీంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 12 నుంచి మొదలైన వడగాడ్పులకు సోమవారం వరకూ 48 మంది మృతి చెందారు. మంగళవారం 18 మంది మృత్యువాత పడ్డారు. = విద్యుత్ వాడకం పెరుగుతుండటంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు పలుమార్లు అంతరాయం కలిగింది. మండల కేంద్రాల్లో, గ్రామాల్లో ఎప్పుడు పడితే అప్పుడు విద్యుత్ సర ఫరా నిలిపేస్తున్నారు. = అస్తవ్యస్త విద్యుత్ సరఫరా వల్ల రైతులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ప్రకటించిన సమయానికి విద్యుత్ సరఫరా కాకపోవడంతో పొలాల్లోనే వేచి చూడాల్సి వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. = విద్యుత్ కోతల పట్ల ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఉలవపాడు మండల పరిధి అలగాయపాలెం సబ్‌స్టేషన్‌ను మంగళవారం స్థానిక ప్రజలు ముట్టడించారు. విద్యుత్ ఉద్యోగులను లోపలే ఉంచి బయట గేటుకు తాళం వేశారు. విషయం తెలుసుకుని వచ్చిన ఏఈ హరికృష్ణను కూడా లోపలే ఉంచి గేటు బయట తాళం వేశారు. = ఎండవేడిమికి మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ఎండకు తోడు వేడిగాలులు, ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బయటకెళితే మండుతున్న ఎండ, ఇంట్లో ఉంటే ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.