తోట వద్దకు కాలినడకన బయలుదేరిన ఓ మహిళపై అత్యాచారయత్నం జరిగింది.
► బాధితురాలి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి..
► కేసు తారుమారుకు పోలీసులపై
► మంత్రి తనయుడి ఒత్తిడి
పాలవాయి(రాప్తాడు): తోట వద్దకు కాలినడకన బయలుదేరిన ఓ మహిళపై అత్యాచారయత్నం జరిగింది. రెండ్రోజుల కిందట జరిగిన సంఘటన బాధితురాలి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు... రాప్తాడు మండలం పాలవాయికి చెందిన ఓ మహిళ సోమవారం స్వగ్రామం నుంచి కనగానపల్లి సమీపంలోని తోట వద్దకు నడుచుకుంటూ వెళ్తుండగా, అదే గ్రామ తండాకు టీడీపీ అనుబంధం ఎస్టీ సెల్ విభాగం మండల శాఖ అధ్యక్షుడు కృష్ణానాయక్ కుమారుడు నారాయణ నాయక్ వెంబడించి ఆమెను ఆటోలోకి ఎక్కించుకుని ముళ్లపొదల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ కొట్టి ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో బాధితురాలు గట్టిగా కేకలు వేయగా చుట్టుపక్కల పొలాల్లో పని చేసుకుంటున్న వారు రావడంతో నిందితుడు పరారయ్యాడు.
మనోడే.. వదిలేయండి
జరిగిన ఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన బాధితురాలు మంగళవారం రాత్రి రాప్తాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు రాజకీయ పలుకుబడి ఉపయోగించి కేసు మరోలా నమోదు చేయించినట్లు తెలిసింది. అంతటితో ఆగక జిల్లాకు చెందిన ఓ మంత్రి తనయుడు పోలీసులకు ఫోన్ చేసి.. మనోడే.. వదిలేయండి* అంటూ చెప్పినట్లు సమాచారం. దీంతో పోలీసులు కనీసం ఏం జరిగిందనే విషయంపై కూడా విచారణ చేపట్టలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


