గవర్నర్ నిర్ణయాల అమలు తప్పదు | The governor said the implementation of decisions | Sakshi
Sakshi News home page

గవర్నర్ నిర్ణయాల అమలు తప్పదు

Jul 8 2014 3:26 AM | Updated on Aug 20 2018 9:16 PM

ఉమ్మడి రాజధాని నగరంపై గవర్నర్‌కు అధికారం కల్పించే అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించినా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది.

తెలంగాణ ప్రభుత్వానికి మళ్లీ స్పష్టం చేసిన కేంద్ర హోం శాఖ

 సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాజధాని నగరంపై గవర్నర్‌కు అధికారం కల్పించే అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించినా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. చట్టంలో ఉన్న మేరకు గవర్నర్‌కు అధికారాలు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వ బిజినెస్ రూల్స్ మార్చుకోవాల్సిందేనని కేంద్ర హోం శాఖ సోమవారం తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉన్నతాధికారి రాష్ట్రానికి లేఖ పంపించారు. విభజన చట్టంలోని సెక్షన్ ఎనిమిదిలో గవర్నర్‌కు దఖలు పరిచిన  అధికారాలు అమలు చేయడం సాధ్యం కాదంటే.. ఆ మేరకు విభజన చట్టానికి సవరణ  చేయాల్సి ఉంటుందని కేంద్ర హోం శాఖ పేర్కొంది. గవర్నర్‌కు అధికారాలు కల్పించేలా ప్రభుత్వ బిజినెస్ రూల్స్‌లో    మార్పు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఏయే అంశాల్లో మార్పు చేయాలన్న విషయంలో కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి సురేష్‌కుమార్ సుదీర్ఘ లేఖ రాసిన సంగతి విదితమే. అయితే, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపించారు. రాజీవ్‌శర్మ రాసిన లేఖకు ప్రతిస్పందిస్తూ.. కేంద్ర హోం శాఖ వర్గాలు సోమవారం సాయంత్రం పాత విషయాన్నే పునరుద్ఘాటిస్తూ సమాచారం పంపించాయి. చట్టాన్ని అమలు చేయడం మినహా గత్యంతరం లేదని కేంద్రం వెల్లడించినట్లు తెలిసింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ‘నవ తెలంగాణ సమాలోచన’ పేరిట రాష్ట్ర, జిల్లా అధికారులతో సమావేశంలో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దీనిపై ఎలా స్పందించాలన్న అంశంపై ఒక నిర్ణయానికి రాలేదని సమాచారం. ఉమ్మడి రాజధాని నగరంలో శాంతిభద్రతల అంశాన్ని పర్యవేక్షించే గవర్నర్‌కు సలహాలు ఇవ్వడానికి మాజీ డీజీపీ ఏకే మహంతిని కేంద్ర ప్రభుత్వం సలహాదారునిగా నియమించిన సంగతి తెలిసిందే.

ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలను గవర్నర్ పర్యవే క్షించాలంటే.. గవర్నర్ నియమించిన అధికారులైతేనే ఆయనకు నేరుగా నివేదించడానికి వీలవుతుందని, లేని పక్షంలో ప్రతిసారి తెలంగాణ ప్రభుత్వాన్ని సమాచారం అడగాల్సి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే, ఈ వాదనను తెలంగాణ ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. శాంతిభద్రతల అంశం రాష్ట్ర పరిధిలోనిదని, ఉమ్మడి రాజధాని నగరంలో ఏవైనా తీవ్ర సమస్య తలెత్తినప్పుడు మాత్రమే గవర్నర్ జోక్యం చేసుకుని పరిస్థితి సరిదిద్దాలి తప్ప.. పోలీసు అధికారుల పోస్టింగ్స్ ఇవ్వడం, నేరుగా సమీక్షించడం చట్టంలో ఎక్కడా లేదని వారు వాదిస్తున్నారు. అయితే, కేంద్రం మాత్రం చట్టాన్ని అమలు చేయాల్సిందేనని స్పష్టం చేయడంతో.. ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement