
సాక్షి, కడప : వైఎస్సార్ జిల్లా కడప పట్టణంలోని రిమ్స్ ఆస్పత్రి వద్ద బుధవారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్‌సీపీ నేత శ్రీనివాసులురెడ్డి మంగళవారం సరైన వైద్యం అందక మృతిచెందారు. దీంతో ఆగ్రహించిన ఆయన కుటుంబసభ్యులు, బంధువులు శ్రీనివాసులురెడ్డి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలియడంతో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అక్కడికి చేరుకొని.. రిమ్స్ డైరెక్టర్ శశిధర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆస్పత్రిలో కనీస వైద్య పరికరాలు పనిచేయకపోవడం దారుణమని ఆయన మండిపడ్డారు. డాక్టర్లు వైద్యం చేయకపోవడం వల్లే శ్రీనివాసులురెడ్డి మృతి చెందారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా వైద్యుల నిర్లక్ష్యమేనని అవినాష్‌రెడ్డి అన్నారు. ఎన్నో ఉన్నత ఆశయాలతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రిమ్స్ ఆస్పత్రిని నిర్మిస్తే.. ప్రస్తుతం ఆ ఆస్పత్రిని నాశనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.