పది ఫీజుల్లో ప్రైవేట్ దందా | Ten-fee private danda | Sakshi
Sakshi News home page

పది ఫీజుల్లో ప్రైవేట్ దందా

Nov 14 2014 2:43 AM | Updated on Sep 2 2017 4:24 PM

పదో తరగతి పరీక్ష ఫీజుల విషయంలో ప్రైవేట్ యాజమాన్యాలు తమ దందాను కొనసాగిస్తున్నాయి.

నిర్ధేశించిన దాని కంటే పదిరెట్లు అధిక వసూలు
ఫిర్యాదు చేయడానికి సంకోచిస్తున్న తల్లిదండ్రులు
చోద్యం చూస్తున్న విద్యాశాఖ

 
కడప : పదో తరగతి పరీక్ష ఫీజుల విషయంలో ప్రైవేట్ యాజమాన్యాలు తమ దందాను కొనసాగిస్తున్నాయి. ఎవరికి నచ్చినట్టు వారు ఫీజులు వసూలు చేస్తున్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజులు కాక ఐదు నుంచి పది రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. ఇదేమని అడిగే తల్లిదండ్రులకు తప్పదని లేకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని భయపెడుతున్నారు. మరో దిక్కు లేక ప్రైవేట్ యాజమాన్యాలు అడిగినంత ఫీజులను విద్యార్థుల తల్లిదండ్రులు చెల్లిస్తున్నారు. ఇటీవల డీఎడ్ పరీక్ష ఫీజుల వసూళ్ల విషయంలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు  భారీ దందా సాగించాయన్న విమర్శలు విద్యాశాఖలో కలకలం రేపిన విషయం విదితమే. జిల్లా వ్యాప్తంగా ఉన్న 900 పైగా ప్రైవేట్ పాఠశాలల నుంచి ఈ ఏడాది 15వేలకు పైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. మార్చి నెలలో నిర్వహించే పదో తరగతి పబ్లిక్ పరీక్షకు ఫీజు ఈనెల 15లోపు చెల్లించాలి. అపరాధరుసుంతో 23 వరకూ చెల్లించవచ్చు. ప్రభుత్వ నిబంధన ప్రకారం విద్యార్థి రూ.125 చెల్లించాలి. కాని కొన్ని ప్రైవేట్ సంస్థలు ఒక్కొక్కొ విద్యార్థి నుంచి రూ. 500 నుంచి రూ. 1000 వరకూ వసూలు చేస్తున్నట్టు విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.

తాము అంత చెల్లించలేమని ప్రాధేయపడినా తప్పదంటూ ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. ఏదో కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో తప్ప అన్ని చోట్లా ఇదే దందా కొనసాగుతోంది. ఇదేంటని ప్రశ్నించే తల్లిదండ్రులకు విద్యార్థికి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే తప్పకుండా తామడిగిన ఫీజు చెల్లించాలని కరాకండీగా యాజమాన్యాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో జిల్లా విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేయాలని తల్లిదండ్రులు చాలా మంది భావించినా ప్రైవేట్ యాజమాన్యాలు హెచ్చరించినట్టు భవిష్యత్తులో తమ పిల్లలకు ఏమైనా ఇబ్బందులు ఏర్పడతాయేమోనని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటు అంత మొత్తంలో ఫీజలు చెల్లించలేక, ఇటు ఎవరికీ ఫిర్యాదు చేయలేక మధనపడుతున్నారు.

 అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు

జిల్లాలో ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజు కంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా మా దృష్టికి తీసుకువస్తే ఆ యాజమాన్యంపై చర్యలు తప్పవు. నిబంధనలు అతిక్రమించి ప్రైవేట్ పాఠశాలలు వ్యవహరించడం సరైంది కాదు.
 - కె. అంజయ్య,
 జిల్లా విద్యాశాఖాధికారి, కడప
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement