పీజే శర్మ విజయనగరం జిల్లా వాసే..

పీజే శర్మ విజయనగరం జిల్లా వాసే..


 విజయనగరం కల్చరల్ : ఆయన గొంతు గంభీరం.. ఆయన సంభాషణలు చెబుతుంటే ఆ గొంతులో నవరసాలు అలవోకగా పలుకుతాయి.. అటువంటి గొంతు ఇప్పుడు మూగబోయింది. లక్కవరపుకోట మండలం కళ్లేపల్లి-రేగ గ్రామానికి చెందిన పూడిపెద్ది జోగేశ్వరశర్మ (పీజే శర్మ) ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. శర్మ స్వగ్రామంలో ప్రాథమిక విద్య పూర్తి చేసి విజయనగరం మహారాజా కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. చిన్నతనం నుంచి నాటకాలపై ఆసక్తి ఉండడంతో 12వ ఏటనే రంగస్థలంపై ప్రదర్శనలిచ్చారు.

 

 విద్యాభ్యాసం పూర్తి కాగానే విజయనగరంలో నవ్యాంధ్ర నాటక కళాపరిషత్‌ను స్థాపించి ఎంతోమందిని నాటకరంగానికి పరిచ యం చేశారు. తర్వాత చిత్రసీమకు వెళ్లి మొదట్లో చిన్న చిన్న పాత్రలు వేసి తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఎది గారు. తమిళ చిత్ర కథానాయకులు ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి నటులకు శర్మ డబ్బింగ్ చెప్పి ఎంతో పేరు తెచ్చుకున్నారు. సుమారు 500 చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కన్యాశుల్కం నాటకంలో ఆయ న ధరించిన లుబ్ధావధానుల పాత్ర ఆయనకెంతో పేరు తెచ్చి పెట్టింది. ఆయన తొలిచిత్రం ఇల్లరికం కాగా చివరి చిత్ర నాగ. శర్మ మృతి తీరని లోటని పలువురు కళాభిమానులు, సాహితీ అభిమానులు అభిప్రాయపడ్డారు.  

 

 పాత్రోచితమైన నటన శర్మ సొంతం

 పాత్రోచితమైన నటనకు పీజే శర్మ పెట్టింది పేరని సాహితీవేత్త డాక్టర్ ఎ.గోపాలరావు అన్నారు. స్థానిక కోట సమీపంలో సాయికుమార్, ఆది అభిమాన సంఘ సభ్యులు ఏర్పాటు చేసిన శర్మ సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. ఆయన మృతితో చిత్రసీమ మంచి నటుడ్ని కోల్పోయిందన్నారు.

 

 కళ్లేపల్లి -రేగలో విషాద ఛాయలు

 కళ్లేపల్లి-రేగ(లక్కవరపుకోట): ప్రముఖ సినీనటుడు, రచయిత, డబ్బింగ్ ఆర్టిస్ట్ పీజే శర్మ  అకాల మరణంతో ఆయన సొంత గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన సహచరులు చిన్ననాటి సంఘటనలను గుర్తుకు తెచ్చుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన సొంతింటిలో కొన్నాళ్లు బాలబడి నిర్వహించేవారని, ప్రస్తుతం ఆ ఇల్లు శిథిలమైపోయిందని గ్రామస్తులు తెలిపారు. ప్రతి ఏడాది సంక్రాంతికి వచ్చి అందరినీ ఆప్యాయంగా పలకరించేవారని గ్రామానికి చెందిన  మంధా శారదరావు, జెక్కాన కన్నబాబు, జెక్కాన బుచ్చిబాబు, తదితరులు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top