యాసిడ్‌ ఘటనలో ఇద్దరిపై వేటు

Teachers Suspended in Acid Incident - Sakshi

టీచర్ల సస్పెన్షన్‌

స్కూల్‌  ఉపాధ్యాయులను విచారణ చేసిన సబ్‌ కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌

క్లాస్‌ రూమ్‌ను పరిశీలించిన ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి, డీఈఓ పాండురంగస్వామి

చిత్తూరు  , తిరుపతి రూరల్‌: చెర్లోపల్లె జెడ్పీ హైస్కూల్‌ తరగతి గదిలో యాసిడ్‌ బాటిల్స్‌ పగిలి ఐదుగురు విద్యార్థులు గాయపడిన ఘటనకు సంబంధించి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు టీచర్లను సస్పెండ్‌ చేస్తూ మంగళవారం సాయంత్రం చిత్తూరు డీఈఓ పాండురంగస్వామి ఉత్తర్వులు జారీ చేశారు. డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లోనే సైన్స్‌ ల్యాబ్‌ను నిర్వహించడమే ఈ ఘటనకు ప్రధాన కారణంగా నిర్ధారించారు. ప్రమాదకరమైన యాసిడ్‌ బాటిల్స్‌ను నిర్లక్ష్యంగా వదిలేసిన సైన్స్‌ టీచర్, ఘటన సమయంలో విద్యార్థుల పర్యవేక్షణను విస్మరించిన క్లాస్‌ టీచర్‌ను సస్పెండ్‌ చేశారు.

రెండో రోజు విచారణ
యాసిడ్‌ పడి విద్యార్థులు గాయపడిన ఘటనపై రెండో రోజు మంగళవారం ఎంఈఓ ప్రేమలత, స్కూల్‌ హెచ్‌ఎం సుజని, ఉపాధ్యాయులను తిరుపతి సబ్‌ కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ తన కార్యాలయంలో విచారణ చేశారు. యాసిడ్‌ ఘటనకు దారితీసిన కారణాలేమిటో వారిని వేర్వేరుగా అడిగి తెలుసుకున్నారు. ఆపై కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యాసిడ్‌ బాధిత విద్యార్థులను ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి, చిత్తూరు డీఈఓ పాండురంగస్వామి పరామర్శించారు. వైద్యులతో వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. అనంతరం చెర్లోపల్లె స్కూల్లో ఘటనకు సంబంధించి క్లాస్‌ రూమ్‌ను వారు పరిశీలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top