క్యాంపెయిన్‌ పేరిట టీచర్లకు టార్గెట్లు..!

Teachers Facing Targets To Fill Seats In Corporate Schools - Sakshi

కందుకూరు రూరల్‌/నాగులుప్పలపాడు:  పుట్టగొడుగుల్లా పుట్టకొస్తున్న కార్పొరేట్‌ పాఠశాలల్లో నీరుపేద చిరుద్యోగుల బతుకులు చిత్తవుతున్నాయి. జూన్‌ నెలలో ప్రారంభమయ్యే 2018–19 విద్యా సంవత్సరానికి గత నెల రోజుల నుంచే విద్యార్థుల అడ్మిషన్ల వేట మొదలు పెట్టాయి కార్పొరేట్‌ పాఠశాలలు. కార్పొరేట్‌ యాజమాన్యాలు పెట్టే నిబంధనలకు ఆ పాఠశాలల్లో పని చేయాలా... లేక బయటకు రావాలా అనే సందిగ్ధంతో ఉద్యోగులు సతమతమవుతున్నారు. జిల్లాలో దాదాపు 30 కార్పొరేట్‌ స్కూళ్లు ఉన్నాయి. వాటిలో 1500 మంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారు.

ఇచ్చిన టార్గెట్లు చేస్తేనే జీతాలు...
కార్పొరేట్‌ పాఠశాలల యాజమాన్యాలు నెల రోజుల నుంచి ఆయా పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులను ఊళ్లోలోకి పంపించారు. ఓట్ల ప్రచారం, ఇంటింటి సర్వేలు చేసే వాళ్లలా ఉపాధ్యాయులు ప్రతి ఇంటికీ వెళ్లి మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు...ఏం చదువుతున్నారు..ఎక్కడ చదువుతున్నారు.. అని అడిగి వారిని తమ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను బతిమాలుకుంటున్నారు. ఒక సారి మా పాఠశాలలో వసతులు చూడండి... ఫీజులు చూడండి, రీజల్టు చూడండని ఏకరువు పెడుతున్నారు. కొందరు టీచర్లు వారి దగ్గర  చదువుకునే పిల్లల్ని, వారి తల్లిదండ్రుల్ని కూడా వారి ఇళ్ల దగ్గర వారినో, బంధువుల పిల్లల్నో తమ స్కూల్లో చేర్చేలా చూడమంటూ ఒత్తిడి చేస్తున్నారు.

ఎలాగోలా వారికి ఇచ్చిన అడ్మిషన్ల టార్గెట్‌ పూర్తి చేస్తేనే మార్చి, ఏప్రిల్‌ నెలల జీతాలు ఇస్తామని కొన్ని కార్పొరేట్‌ పాఠశాలలు నిబంధనలు పెట్టాయి. ఒక్కొక్కరు 10 నుంచి 15 మంది పిల్లలను ఖచ్చితంగా పాఠశాలలో చేర్పిం చాలి. అలా చేర్పిస్తేనే జీతాలు ఇస్తారు. లేకపోతే జీతం రాదు. ఆ తర్వాత పాఠశాలలో ఉద్యోగం ఉంటుందో లేదో కూడా గ్యారంటీ లేదు. ఇప్పటికే కొందరికి జీతాలు నిలిపివేసినట్లు సమాచారం. ఆయా పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులకు వచ్చే అరకొర జీతాలు నిలిపేయడంతో పిల్లలను చేర్పించేందుకు నానా తంటాలు పడుతున్నారు.         

ఆకర్షణలతో మోసపోతున్న తల్లిదండ్రులు
పాఠశాలల గురించి చెప్పే ప్రత్యేకతలను విన్న తల్లిదండ్రులు ఆకర్షణకు లోనవుతున్నారు. ప్రభుత్వ, స్థానిక ప్రైవేటు పాఠశాలల కంటే కార్పొరేట్‌ స్కూల్లో ఆకర్షణీయమైన యూనిఫాం, విశాలమైన తరగతి గదులు, వేర్వేరుగా మరుగుదొడ్లు, పరిమితికి లోబడి విద్యార్థుల సంఖ్య, కరెంట్‌ పోతే జనరేటర్‌ సౌకర్యం, తక్కువ ఖర్చుతో బస్‌ సౌకర్యం, అర్హత, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ, రోజు వారి టెస్ట్‌లు, ప్రతి రోజులు స్టడీ అవర్లు,  కంప్యూటర్, లైబ్రరీ, ల్యాబ్‌లు, ప్రతి పండగ సెలబ్రేషన్, ఆటల, పాటలతో పాటు కరాటే, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉపాధ్యాయులు బదిలీ అయితే అదే చోట బ్రాంచ్‌కు విద్యార్థుల బదిలీ సౌకర్యం కల్పిస్తామని కార్పొరేట్‌ స్కూళ్ల సిబ్బంది చెప్తారు.

విద్యార్థులను పాఠశాలలో చేర్పించుకొని అడ్మిషన్‌ ఫీజు కట్టించుకునే వరకు కేవలం పాఠశాల ఫీజు మాత్రమే చెప్తారు. ఫీజు చెల్లించిన తర్వాత బస్‌ ఫీజు, యూనిఫాం ఫీజు, బుక్స్‌ ఫీజు అంటూ ముక్కుపిండి వసూళ్లు చేస్తున్నారు. కార్పొరేట్‌ పాఠశాలలు ఆన్‌లైన్‌లో ఫిక్స్‌ చేసిన ఫీజులని చెప్తున్నారు. అవి అన్ని బ్రాంచ్‌ల్లో ఒకటిగానే ఉంటాయి. వీటిని మార్చేందుకు వీలు కాదు. కచ్చితంగా ఆన్‌లైన్‌లో చూపించే ఫీజు చెల్లించాలి. ఇలా నిబంధనలు పెడతారు. అప్పుడు ముందుగా క్యాంపెన్లు తిరిగి పిల్లలను చేర్పిన ఉపాధ్యాయులపై తల్లిదండ్రుల ఒత్తిళ్లు పెరుగుతాయి. అప్పుడు అలా చెప్పారు.. ఇప్పుడు ఇలా చెప్తున్నారని గందరగోళ పరిస్థితులు ఎదురవుతున్నాయని కొందరు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా విద్యాశాఖాధికారులు కార్పొరేట్‌ కాలేజీలపై దృష్టిపెట్టి ఉపాధ్యాయులపై వేధింపులు నిరోధించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.  
ఉపాధ్యాయినుల

పరిస్థితి మరింత దయనీయం:
పిల్లల్ని చేర్చాలంటూ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు చేస్తున్న ఒత్తిడితో ఉపాధ్యాయులు సతమతమవుతున్నారు. మహిళా ఉపాధ్యాయినుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కొం త మంది అయితే యాజమాన్యాల ఒత్తిడి భరించలేక 2 నెలల జీతం వదులుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. విద్యార్థుల అడ్మిషన్‌ పనిలో పడి చాలా చోట్ల ఏప్రిల్‌ నెలలో అసలు పాఠశాలలే జరగడం లేదు. ఇదిలా ఉంటే నాగులుప్పలపాడు మండల కేంద్రంలో ఉన్న ఒక ప్రైవేట్‌ పాఠశాలలో విద్యార్థులను చేర్చాలంటూ ఉపాధ్యాయులపై టార్గెట్‌ పెట్టి ఒత్తిడి చేస్తున్నారు.

ఈ పాఠశాలలో పని చేస్తున్న మహిళా టీచర్లను  రాత్రి 10 గంటల వరకు కూడా క్యాంపెయిన్‌ పేరుతో పాఠశాలలో ఉండమని చెప్పడం తరువాత వారిని లైంగికంగా వేధించడం మొదలైంది. పాఠశాల యాజమాన్యంలోని ఓ వ్యక్తి అక్కడ పనిచేస్తున్న ఒక మహిళా టీచర్‌ను కొంత కాలం నుంచి అర్ధరాత్రి ఫోన్‌ చేసి అసభ్యంగా మాట్లాడటంతో పాటు పాఠశాలలో ఉన్న సమయంలో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో విసుగు చెందిన ఉపాధ్యాయురాలు ఫోన్‌ సంభాషణను రికార్డు చేసి తన బంధువులకు వినిపించి వారి సాయంతో లైంగిక వేధింపులపై అడిగేందుకు వెళ్లగా..మీకు చేతనైంది చేసుకోండని చెప్పి వారిపై దాడి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సంకోచించిన సదరు ఉపాధ్యాయురాలు చివరకు శుక్రవారం తన సర్టిఫికెట్లు, తనకు రావాల్సిన 3 నెలల జీతం ఇవ్వాలని యాజమాన్యాన్ని అడిగింది.

అయినా సర్టిఫికెట్లు ఇవ్వం, జీతం ఇచ్చేది లేదు..దిక్కున్న చోట చెప్పుకో అంటూ తీవ్రమైన దుర్భాషలాడారని బాధితురాలు వాపోయింది.  ఈ పాఠశాలలో మహిళా టీచర్లపై వేధింపులు ఇదేం కొత్త కాదు. గతంలో ఇలాంటి వేధింపులతో చాలా మంది టీచర్లు నోరు మెదపకుండా పాఠశాల మానివేశారు. ఇదే విషయమై నాగులుప్పలపాడు ఎంఈవో జి.శేషయ్యను వివరణ అడగగా> మండల కేంద్రంలోని ప్రైవేట్‌ పాఠశాలలో  మహిళా టీచర్లపై వేధిస్తున్నారన్న విషయంలో తాను సీరియస్‌ గా స్పందిస్తానని యాజమాన్యం వైపు నుంచి ఇలాంటి చర్యలు ఉంటే వారిని ఏ మాత్రం ఉపేక్షించేది లేదన్నారు.

మా దృష్టికి రాలేదు
జీతాల సమస్య సాధారణంగా సంస్థాగతంగా జరుగుతుంది. విద్యార్థులను చేర్చాలంటూ ఒత్తిడి తేవడం సరికాదు. జీతాలు ఇవ్వకుండా నిలిపివేయడంపై ఎవరైనా రాతపూర్వకంగా ఫిర్యాదుచేస్తే తదుపరి చర్యలను చేపడతాం.
-వీఎస్‌.సుబ్బారావు, జిల్లా విద్యాశాఖ అధికారి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top