మద్యంపై ఎన్నికల సుంకం విదించనున్న చంద్రబాబు సర్కార్‌

Tdp Want To Increase Alchohol Tax In Coming Elections - Sakshi

 బాటిల్‌కు రూ.5ల బాదుడు!  బాబు సర్కార్‌ గ్రీన్‌సిగ్నల్‌ 

సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు సర్కార్‌ దిగిపోయేముందు మద్యంపై ఎన్నికల సుంకం విధించింది. ఎన్నికల వేళ తమ పార్టీ అభ్యర్థుల ఖర్చు కోసం నిధుల సమీకరణకు మద్యం వ్యాపారుల దోపిడీకి అడ్డగోలుగా అనుమతించింది. ఎన్నికల్లో అమ్మకాలు పెరగనున్న నేపథ్యంలో లిక్కర్‌ బాటిల్‌కు రూ.5 పెంచి విక్రయించుకోవడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వాటిలో రూ.2లు ఎన్నికల్లో పోటీచేసే టీడీపీ అభ్యర్థులకు వ్యాపారులు చెల్లించాలనే నిబంధన పెట్టడం గమనార్హం. ఇన్నాళ్లూ ఎమ్మార్పీపై కొంత పర్సంటేజీ వేసుకుని అమ్ముకోవడానికి వీలు కల్పించేది. రెండేళ్ల క్రితం ఎక్సైజ్‌ కమిషనర్‌గా లక్ష్మీనరసింహం వచ్చాక దీనికి ఒకింత అడ్డుకట్ట వేశారు.

ఇది మింగుడు పడని లిక్కర్‌ సిండికేట్లు ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు తెచ్చి ఆయనను బదిలీ చేయించా యన్న ఆరోపణలొచ్చాయి. లక్ష్మీనరసింహం బదిలీపై వెళ్లిపోయాక మద్యం సిండికేట్‌ నిర్వాహకులు ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకుని గతంలో మాదిరిగా అధిక ధరలకు విక్రయాలు జరుపుకునేందుకు అనధికార అనుమతులు తెచ్చుకున్నారు. మునుపటిలా ఎమ్మార్పీ ధరలపై ఇష్టానుసారం పెంచుకోవడానికి బదులు బాటిల్‌కు రూ.5 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. జిల్లాలోను, నగరంలోనూ వెరసి 401 మద్యం దుకాణాలున్నాయి. వీటికి జూలై ఆఖరి వరకు లైసెన్స్‌ల గడువుంది. సాధారణ రోజుల్లో ఈ షాపుల నుంచి రోజుకు సగటున రూ.7 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. 

రూ.కోట్లలో పెరగనున్న ఆదాయం 
విశాఖ జిల్లాలో విశాఖపట్నం, గాజువాక, అనకాపల్లిల్లో ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయాలున్నాయి. వీటి పరిధిలో 17 ఎక్సైజ్‌ సర్కిల్‌ ఆఫీసులు ఉన్నాయి. జిల్లా మొత్తమ్మీద నెలకు దాదాపు 3.50 లక్షల కేసుల మద్యం, 2 లక్షల కేసుల బీర్లు అమ్ముడవుతున్నట్టు అంచనా. 90 మి.లీ బాటిల్‌ను శాంపిల్‌గాను, 180 మి.లీను నిప్‌ (క్వార్టర్‌), 375 మి.లీను హాఫ్, 750 మి.లీని ఫుల్‌ బాటిల్‌గా పేర్కొంటారు. ఒక కేసుకు శాంపిల్‌ బాటిళ్లు 96, క్వార్టర్‌ బాటిళ్లు 48, హాఫ్‌ బాటిళ్లు 24, ఫుల్‌ బాటిళ్లు 12 చొప్పున ఉంటాయి. వీటిలో శాంపిల్, నిప్‌ సీసాల విక్రయాలే అధికం. అంటే సగటున 2.75 కోట్ల మద్యం బాటిళ్ల మద్యం అమ్మకాలు జరుగుతాయని అంచనా.

ఒక్కో బాటిల్‌కు రూ.5 చొప్పున ధర పెంచి విక్రయిస్తే రూ.13.75 కోట్ల ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. గతంలో ఎన్నికల సమయంలో ఇబ్బడి ముబ్బడిగా మద్యాన్ని డంప్‌ చేసేవారు. ఇప్పుడు నిబంధనలు విధించడంతో ఎప్పటిలా ఆ నెలలో సాధారణంగా జరిపే విక్రయాలుకంటే 10 శాతం సరకును అదనంగా కొనుగోలు చేయడానికి మద్యం వ్యాపారులకు అనుమతిస్తారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పెరిగే అమ్మకాల వల్ల ఈ సొమ్ము రూ.20 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు.

మద్యం బాటిల్‌పై రూ.5ల పెంపు ఈ నెల 9వ తేదీ నుంచి విశాఖలో అమలులోకి వచ్చింది. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో కొన్ని జిల్లాలో మద్యం బాటిల్‌పై రూ.10 వరకు పెంచుకుని అమ్మకాలు సాగిస్తున్నారని, విశాఖలో మాత్రం రూ.5 మాత్రమే పెంచినట్టు లిక్కరు వ్యాపారులు చెబుతున్నారు. అయితే ఇందులో రూ.2లు ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థులకు, రూ.2లు ఎౖMð్సజ్‌ సిబ్బందికి పోగా తమకు కేవలం ఒక్క రూపాయే మిగులుతుందని వీరు పేర్కొంటున్నారు. నగరంలోని 58 మద్యం దుకాణాల్లో 20, జిల్లాలో సగం వరకు నష్టాల్లోనే నడుస్తున్నాయని, తాజాగా పెంచిన ధర వల్ల తమకేమీ ఒరగదని వీరంటున్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top