చదువుల చాటున పన్నుల ఎగవేత!

TDP Tenali Mla Rajendra Prasad Tax avoidance of 100 crores - Sakshi

     తెనాలి టీడీపీ ఎమ్మెల్యే ఆలపాటి ‘ఎన్నారై’ విద్యాసంస్థల నిర్వాకం

     విద్యార్థుల నుంచి రూ.వందల కోట్లలో ఫీజుల వసూలు

     ఒక్క రూపాయి కూడా సేవాపన్ను చెల్లించని వైనం

     అకాడమీకి సీజీఎస్‌టీ కమిషనర్‌ నోటీసు.. హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురు

     అపరాధ రుసుం, వడ్డీతో కలిపి రూ.100 కోట్లకుపైగా కట్టాల్సిందే     

సాక్షి, అమరావతి బ్యూరో: విద్యాసంస్థ ముసుగులో సేవాపన్ను ఎగ్గొట్టిన కేసులో తెనాలి టీడీపీ ఎమ్మెల్యే, ఎన్నారై అకాడమీ మేనేజింగ్‌ పార్టనర్‌ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ నుంచి రూ.వంద కోట్లకు పైగా వసూలు చేసేందుకు సెంట్రల్‌ ఎక్సైజ్, కస్టమ్స్‌ అధికారులు సిద్ధమయ్యారు. ఈ కేసులో ఆయనకు ఇప్పటికే హైకోర్టులో చుక్కెదురు కావడంతో పన్ను బకాయిలు రాబట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 

ప్రత్యేక ప్రోగ్రాములు, శిక్షణ పేరుతో భారీగా వసూలు: ఎన్నారై అకాడమీలో ఇద్దరే భాగస్వాములు. ఒకరు గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ కాగా మరొకరు ఆయన భార్య మాధవి. ఎన్నారై ఎడ్యుకేషనల్‌ సొసైటీతో కలిసి పలు చోట్ల ఎన్నారై జూనియర్‌ కాలేజీలను నిర్వహిస్తున్నారు. ట్యూషన్‌ ఫీజుతోపాటు ఇంజనీరింగ్‌ / మెడికల్‌కు ప్రత్యేక ప్రోగ్రాములు, జాతీయస్థాయి పోటీ పరీక్షలకు ప్రత్యేక తరగతులు, శిక్షణ పేరుతో విద్యార్థుల నుంచి భారీగా వసూలు చేస్తున్నా దీనికి సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.53.94 కోట్ల సేవా పన్ను ఎగ్గొట్టినట్లు తేలింది. 

ఎన్నారై ఆధ్వర్యంలో 43 కాలేజీలు..: ఎన్నారై అకాడమీ మేనేజింగ్‌ పార్టనర్‌గా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ 2009 ఏప్రిల్‌ 1వ తేదీన ఎన్నారై ఎడ్యుకేషనల్‌ సొసైటీతో ఒప్పందం చేసుకున్నారు. సొసైటీలో రాజేంద్రప్రసాద్‌ సహా ఏడుగురు సభ్యులున్నారు. గుంటూరు, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, ఏలూరు, తిరుపతి, ఒంగోలు, తెనాలి, నెల్లూరులో 43 ఎన్నారై జూనియర్‌ కాలేజీలను అకాడమీ నడుపుతోంది. ఆలపాటి ఆయా కాలేజీలకు ప్రెసిడెంట్, కరస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో బోధన నిర్వహిస్తున్నట్లు 2011లో సర్వీస్‌ ట్యాక్స్‌ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేశారు. సర్వీస్‌ ట్యాక్స్‌ చెల్లించి రిటర్నులు ఫైల్‌ చేయాలని విజయవాడ సర్వీస్‌ ట్యాక్స్‌ సూపరింటెండెంట్‌ సూచించగా అకాడమీ 2012లో ‘నిల్‌’ రిటర్నులు ఫైల్‌ చేసింది. ఈ మధ్యలో సర్వీసు ట్యాక్స్‌ నుంచి మినహాయింపు కోరుతూ దరఖాస్తు చేశారు. ఇక అప్పటి నుంచి ఎన్నారై అకాడమీ సేవా పన్ను ఊసు ఎత్తడం లేదు. 

రూ.60.19 కోట్లు కట్టాలని షోకాజ్‌ నోటీసు..: 2015 ఏప్రిల్‌ 17న అహ్మదాబాద్‌లోని సెంట్రల్‌ ఎక్సైజ్, ఇంటెలిజెన్స్‌ జోనల్‌ యూనిట్‌ డైరెక్టర్‌ జనరల్‌ సెక్షన్‌ 73 (1), ఫైనాన్స్‌ చట్టం 1994 కింద ఎన్నారై అకాడమీకి డిమాండ్‌–షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. 2009 అక్టోబరు ఒకటి నుంచి 2015 మార్చి 31 వరకు సొసైటీ, అకాడమీలు రూ.522.89 కోట్లు వసూలు చేశాయని, సేవాపన్ను కింద ప్రభుత్వానికి రూ.60.19 కోట్లను చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. ఎన్నారై అకాడమీ చెల్లించాల్సిన సేవా పన్ను రూ.53,94,36,220 అని గుంటూరు సెంట్రల్‌ ఎక్సైజ్, కస్టమ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ కమిషనరు 2016 నవంబరు 29న నిర్ధారించారు. 

ఆలపాటి ప్రకటనే రుజువు: వాస్తవానికి ఎన్నారై అకాడమీ ఈ అంశంపై హైదరాబాద్‌లోని సెంట్రల్‌ ఎక్సైజ్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ అప్పిలేట్‌ (సీఈఎస్‌టీఏటీ) ట్రిబ్యునల్‌కు అప్పీలు చేసుకోవాలి. ఫీజుల కింద వసూలు చేసిన మొత్తంలో 7.5 శాతం అంటే రూ.4.40 కోట్లను డిపాజిట్‌ చేయాలి. అయితే ఇందుకు భిన్నంగా ఎన్నారై అకాడమీ మేనేజింగ్‌ పార్టనర్‌ అయిన ఎమ్మెల్యే ఆలపాటి గతేడాది హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ (నంబర్‌ 7638/2017) దాఖలు చేశారు. ఇంటర్‌లో నిర్దేశించిన సిలబస్‌నే బోధిస్తున్నందున పన్ను వర్తించదని పేర్కొన్నారు. సీజీఎస్‌టీ ఈ వాదనను తోసిపుచ్చింది. ఎన్నారై అకాడమీ అఖిల భారతస్థాయి ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నట్టుగా సొసైటీ ఎంవోయూల్లో ఆలపాటి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను రుజువుగా చూపారు. అకాడమీ వసూలు చేసే బిల్లుల్లోనూ పలు రకాలున్నాయి. కోచింగ్, స్పెషల్‌ ప్రోగ్రామ్‌ల పేరుతో భారీ ఫీజులను వసూలు చేశారని స్పష్టం చేసింది. సేవా పన్ను ఎగ్గొట్టేందుకు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెడుతున్నారని తెలిపింది. ఎన్నారై ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఇంటర్‌ విద్యార్థులకు బోధన నిర్వహిస్తుండగా అకాడమీ కోచింగ్‌ ఇస్తోంది. కోచింగ్‌ ఫీజుల కింద అకాడమీ వసూలు చేసిన రూ.474.70 కోట్లకు సేవాపన్ను చెల్లించడం లేదని పేర్కొంది.

పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు బెంచ్‌..: జస్టిస్‌ సంజయ్‌కుమార్, జస్టిస్‌ అమరనాథ్‌గౌడ్‌లతో కూడిన హైకోర్టు బెంచ్‌ ఈనెల 8వ తేదీన ఎన్నారై అకాడమీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. చట్టప్రకారం కోచింగ్‌ సేవలు సేవాపన్ను పరిధిలోకి వస్తాయని బెంచ్‌ స్పష్టం చేసింది. దీంతో రూ.54 కోట్ల దాకా సేవాపన్ను, దాదాపు అంతే మొత్తంలో అపరాధ రుసుం, వడ్డీతో కలిపి వసూలు చేసేందుకు గుంటూరు సీజీఎస్‌టీ సిద్ధమైనట్లు సమాచారం. 

పరిశీలిస్తున్నాం..: గుంటూరులోని సెంట్రల్‌ జీఎస్టీ కమిషనర్‌ ఎం.శ్రీహరిరావు, తెనాలి జీఎస్‌టీ కార్యాలయ సూపరింటెండెంట్‌ కోటేశ్వరరావులను ఈ అంశంపై వివరణ కోరగా, పరిశీలించాల్సి ఉందని ఒకరు, పాత బకాయిలు వెరిఫై చేయాలని మరొకరు పేర్కొనడం గమనార్హం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top