దళితులపై తెలుగుదేశం దౌర్జన్యం

TDP Rowdyism On Dalits In Hanuman Junction - Sakshi

వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు.. కులం పేరుతో దుర్భాషలు

ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయని పోలీసులు

పైగా బాధితులపైనే అట్రాసిటీ కేసులు అక్రమంగా కార్యకర్తల అరెస్టులు

హనుమాన్‌జంక్షన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట వైఎస్సార్‌సీపీ నేతల ఆందోళనలు

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ : దళితులపై తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన దౌర్జన్యకాండపై కేసు నమోదు చేయకపోగా.. బాధితులైన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసులు అక్రమంగా నిర్భందించారు. ఈ ఘటనకు నిరసనగా కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు అందోళన చేపట్టారు. వైఎస్సార్‌ సీపీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు, పార్టీ పొలిటికల్‌ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు డాక్టర్‌ దుట్టా రామచంద్రరావు నేతృత్వంలో వందలాది కార్యకర్తలు బుధవారం ఉదయం 11 గంటలకు పోలీస్‌స్టేషన్‌ ఎదుట చేపట్టిన ధర్నా ఏకధాటిగా రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. ఈ నెల 24న బాపులపాడు మండలం కె.సీతారామపురంలో వైఎస్సార్‌సీపీ నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో కొందరు టీడీపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా వివాదం సృష్టించారు.

రచ్చబండ ముగించుకుని తిరిగి వెళ్లుతున్న యార్లగడ్డ వెంకట్రావు వాహానాన్ని అడ్డగించి ఘర్షణకు దిగారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్త చిన్నం కాశీ విశ్వనాథ్‌ తల పగలుకొట్టడమే కాకుండా ఎస్సీలను కులం పేరుతో దుర్భషలాడారు. ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీకి చెందిన దళితులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే వంశీమోహన్, తెలుగురైతు నాయకుడు చలసాని ఆంజనేయులు, మరికొందరు టీడీపీ నాయకులపై ఫిర్యాదు చేసినప్పటికీ హనుమాన్‌జంక్షన్‌ పోలీసులు కేసు నమోదు చేయ్యలేదు. అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకు వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు, ఆయన అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు.

ఈ ఘర్షణతో సంబంధం లేని ఇద్దరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను మంగళవారం అర్ధరాత్రి సమయంలో పెనమలూరు, గన్నవరం పోలీసులు విచారణ పేరుతో అదుపులోకి తీసుకోవటంతో వివాదం మరింత ముదిరింది. కార్యకర్తల అక్రమ అరెస్టులకు నిరసనగా హనుమాన్‌జంక్షన్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని, దౌర్జన్యానికి పాల్పడిన టీడీపీ నాయకులు, ప్రోత్సహించిన ఎమ్మెల్యే వంశీమోహాన్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. అయితే బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై టీడీపీ నేతలపై కేసు నమోదు చేయబోమని హనుమాన్‌జంక్షన్‌ సీఐ వై.వి.ఎల్‌.నాయుడు, ఎస్‌ఐ వి.సతీష్‌లు ఖరాఖండిగా చెప్పడంతో వివాదం ముదిరింది.

పోలీసులు టీడీపీకి తొత్తులుగా మారటం దారుణం: పార్థసారధి, కారుమూరి
అధికార టీడీపీకి పోలీసులు పూర్తిగా తొత్తులుగా మారిపోయారని వైఎస్సార్‌ సీపీ మచిలీపట్నం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారధి, తణుకు మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు దుయ్యబట్టారు. పోలీస్‌స్టేషన్‌ ఎదుట వైఎస్సార్‌సీపీ శ్రేణులు చేపట్టిన అందోళనకు వారు మద్దతు పలికారు.  బాధ్యతయుతమైన హోదాలో ఉన్న సీఐ వైవిఎల్‌ నాయుడు నిజాయతీగా వ్యవహారించకుండా, టీడీపీ నేతలకు భయపడి పోలీసు వ్యవస్థ పరువును తీస్తున్నారని ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఇది దళితులను, దళిత చట్టాలను అగౌరవపర్చమేనని మండిపడ్డారు. చివరకు దాడులకు పాల్పడిన టీడీపీ నేతలపై కేసు నమోదుకు హామీ ఇవ్వడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళన విరమించారు. ధర్నాలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కైలే జ్ఞానమణి, ఎంపీటీసీ సభ్యులు మంగళఈ కమిటీ డీజీపీకి అర్హత గల వారి జాబితాను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తుంది.పాటి కమలకుమారి, బేతాళ ప్రమీలారాణి పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top