భూ బాగోతంలోఇద్దరు ఎమ్మెల్యేలకూ పాత్ర

TDP MLA kye Role in Land Danda - Sakshi

సాక్షి కథనాలతో సంచలనం

అక్రమార్కులకు ముచ్చెమటలు

చర్యలకు జంకుతున్న అధికారులు 

 కొనుగోలుదారుల సతమతం 

 ఒక్కొక్కటిగా బయటకొస్తున్న లోగుట్లు

ద్వారకాతిరుమల: కొందరు ప్రజాప్రతినిధులు భూ బకాసురుల పాత్రలను పోషిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పోరంబోకు భూములు కనుమరుగవుతున్నాయి. పేద ప్రజల నివాసాలకు ఇవ్వాల్సిన స్థలాలను వారు దళారుల ద్వారా దర్జాగా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. నిస్వార్ధంగా ప్రజలకు సేవలందించాల్సిన ప్రజాప్రతినిధులే ఇలా అక్రమాలకు పాల్పడటం పట్ల ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. 

ద్వారకాతిరుమలలోని వసంత్‌నగర్‌ కాలనీలో ఉన్న ప్రభుత్వ పోరంబోకు భూముల కబ్జాలు, క్రయ విక్రయాలపై సాక్షి ప్రచురిస్తున్న వరుస కథనాలతో అక్రమార్కులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఈ భూబాగోతంలో ఉంది చిన్నచితకా ప్రజాప్రతినిధులు అయితే ఈ విషయం అంత హాట్‌ టాపిక్‌ అయ్యేది కాదు. సాక్షాత్తు ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు ఇందులో పాత్ర ఉండటం సంచలనంగా మారింది. ఇందులో ఒక ఎమ్మెల్యే 25 సెంట్ల భూమిని తన అనుయాయుల ద్వారా విక్రయాలు సాగించి సొమ్ములు దండుకోగా... మరో ఎమ్మెల్యే తన కుమారుడి రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో అరెకరం భూమిని కలిపి దర్జాగా అమ్ముకుంటున్నారు. 

తేలుకుట్టిన దొంగల్లా
వసంత్‌నగర్‌ కాలనీలోని ఆర్‌ఎస్‌ నంబర్‌ 1/2 లో మొత్తం 10.20 ఎకరాల భూమి ఉండగా అందులో 2.50 ఎకరాల భూమికి సంబంధించి తమకు డి ఫారం పట్టాలు ఇచ్చారని వర్దినీడి బసవరాజు అతని కుమార్తె ఎర్రంశెట్టి కరుణలు చెబుతున్నారు. అయితే ఇందులో అవకతవకలను గుర్తించిన నేతలు ఈ భూమిని ఆన్‌లైన్‌ కాకుండా అడ్డుపడ్డారు. అప్పుడే ఎమ్మెల్యే పాత్ర రంగప్రవేశం చేసింది. అధికారులను ఒప్పించి ఎలాగోలా ఆన్‌లైన్‌ చేయించారు. ఈ సెటిల్‌మెంట్‌ చేసినందుకు ఆ ఎమ్మెల్యేకు 25 సెంట్ల భూమిని కట్టబెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు నమ్మకంగా ఉన్న కొందరు నేతలు, దళారుల ద్వారా ఆ భూమిని విక్రయించినట్లు స్పష్టమౌతోంది. 25 సెంట్ల భూమిని పలు భాగాలుగా విభజించి రూ.16.80 లక్షల వరకు అమ్మకాలు జరిపినట్లు సమాచారం.

 కొనుగోలుదారులకు స్థలంలో ఉన్న వారి పేరున ఎంజాయ్‌మెంట్, పంచాయతీ మంచినీటి కుళాయిల ఏర్పాటు ఇలా అన్ని అనుమతులు ఇప్పిస్తామని దళారులు హామీలు గుప్పించడంతో, అది ప్రభుత్వ భూమి అయినప్పటికీ పలువురు వాటిని కొన్నారు. ఇప్పుడు ‘సాక్షి’ ఆ బాగో తాలను బట్టబయలు చేయడంతో అంతా తేలుకుట్టిన దొంగల్లా ఉన్నారు. ఇదిలా ఉంటే మరో ఎమ్మెల్యే కుమారుడు వసంత్‌నగర్‌ కాలనీకి ఆనుకుని ఉన్న ఆర్‌ఎస్‌ నంబర్‌ 11లోని అరెకరం ప్రభుత్వ పోరంబోకు భూమిని తన రియల్‌ వెంచర్‌లో కలుపుకున్నారు. ఈ విషయాలన్నీ తెలిసినా.. అప్పటి తహసీల్దారు అన్ని విధాలా ఆక్రమిత దారులకు సహకరించి ఆ భూమిని వారికి కట్టబెట్టినట్లు తెలిస్తోంది. 

మణి పాత్ర ఎంత
ద్వారకాతిరుమలలో ఒక తహసీల్దారు పనిచేసిన సమయంలో ఎక్కువగా అవకతవకలు జరిగినట్లు స్పష్టమౌతోంది. 2016 నుంచి 2017 వరకు ఎంహెచ్‌. మణి ఇక్కడ తహసీల్దారుగా పనిచేశారు. ఆ సమయంలో అనర్హుల వద్ద ఉన్న దొంగ పట్టాలను ఒక ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఆన్‌లైన్‌ చేసినట్లు తెలు స్తోంది. అలాగే అరెకరం ప్రభుత్వ భూమిని ఒక ఎమ్మెల్యే కుమారుడికి కట్టబెట్టినట్లు స్పష్టమౌతోంది. ఆయన ఇంకెంత మందికి ఇలా ఆన్‌లైన్‌లో మార్పులు చేశారన్నది తెలియాల్సి ఉంది. 

అడుగు ముందుకెయ్యలేని అధికారులు:
ఈ భూ బాగోతంలో ఎమ్మెల్యేల పాత్ర ఉండటం వల్లే అధికారులు ముందుకు అడుగు వేయలేక పోతున్నారన్నది బహిరంగ సత్యం. సాదా సీదా టీడీపీ నేతలకే బెదిరిపోతున్న అధికారులు ఏకంగా ఎమ్మెల్యేలను ఎలా ధిక్కరిస్తారు..? ఒక వేళ ధిక్కరిస్తే వనజాక్షికి పట్టిన గతే తమకు పడుతుందన్న భయం వారిలో కలుగదా..? ఇలా సవాలక్ష భయాలతో అధికారులు ముందుకు అడుగేయలేక పోతున్నారు. దీంతో పాలకులకు అడ్డూ అదుపు లేక రెచ్చిపోతున్నారు. 

ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరిగింది
వసంత్‌నగర్‌ కాలనీలో ప్రభుత్వ భూమి క్రయ, విక్రయాలు గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కనుసన్నల్లో జరిగాయన్న విషయం అందరికీ తెలుసు. అయితే అధికార పార్టీ వారితో ఎందుకని ఎవరికి వారు పట్టించుకోవడం లేదు. పక్క నియోజకవర్గం ఎమ్మెల్యేలు సైతం ఇక్కడకొచ్చి భూములను ఆక్రమిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు. ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా అమ్మి, సొమ్ము చేసుకుంటూనే నీతిపరులమని నేతలు చెప్పడం విడ్డూరంగా ఉంది. ఎమ్మెల్యేలకు భయపడి అధికారులు కూడా ఈ భూ బాగోతాన్ని కప్పేస్తున్నారు. పేద ప్రజలకు ఇవ్వడానికి లేని భూమి, అమ్ముకోవడానికి ఎలా వచ్చిందో. 
– తలారి వెంకట్రావు, వైఎస్సార్‌ సీపీ గోపాలపురం నియోజకవర్గ కన్వీనర్‌ 

ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి
వసంత్‌నగర్‌లోని భూవివాదానికి సంబంధించి ఉన్నతాధికారులతో చర్చించాల్సి ఉంది. వారి ఆదేశానుసారం అవసరమైతే ఎంజాయ్‌మెంట్‌ సర్వే చేస్తాం. సర్వేకు సంబంధించి ఇప్పటికే సర్వేయర్, ఆర్‌ఐ, వీఆర్వోలకు నోటీసులిచ్చాను. అలాగే పాత రికార్డులను చూస్తున్నాం. 
– టీడీఎల్‌ సుజాత, తహసీల్దారు, ద్వారకాతిరుమల

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top