టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్‌

TDP MLA Atchannaidu Arrest In Tekkali - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్‌ చేశారు. శుక్రవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆయన్ని ఆరెస్ట్‌ చేసి విజయవాడకు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ కుంభకోణంలో ఆయన ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. ఈ కేసు విచారణలో భాగంగానే అచ్చెన్నాయుడిని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ఆయనతో పాటు కుటుంబ సభ్యులన్నీ కూడా అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ స్కాంలో అప్పటి ఈఎస్‌ఐ‌ డైరెక్టర్‌ రమేష్‌ కుమార్‌ హస్తం కూడా ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. టెండర్లు పిలవకుండా నామినేషన్‌ల పద్దతిలో అచ్చెన్నాయుడు చెప్పిన కంపెనీకు కోట్ల రూపాయల ఆర్డర్లు ఇచ్చినట్లు నివేదికలో తేలింది. మొత్తం 155 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఏసీబీ తేల్చింది. ఏసీబీ తాజా దూకుడుతో స్కాములో పాలుపంచుకున్న వారి గుండెల్లో దడ మొదలైంది. (అచ్చెన్న లీలలు ఇన్నన్ని కావయా...)

అసలు స్కాం..
టీడీపీ హయాంలో అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హయాంలోనే కుంభకోణం జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మంత్రి చొరవతోనే డైరెక్టర్లు రూ. 975 కోట్ల మందుల కొనుగోలు చేసి, అందులో 100 కోట్లకు పైగా నకిలీ బిల్లులను సృష్టించినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. అయితే మందుల కొనుగోలుకు ప్రభుత్వం రూ. 293 కోట్ల బడ్జెట్‌ కేటాయిస్తే, 698 కోట్ల రూపాయలకు మందులను కొనుగోలు చేసినట్లు  ప్రభుత్వానికి చూపి ఖజానాకు 404 కోట్ల రూపాయలు నష్టం కలిగించారు. అంతేకాకుండా ఈఎస్‌ఐ స్కాంకు పాల్పడిన లెజెండ్ ఎంటర్ప్రైజెస్, ఓమ్ని మెడీ, ఎన్వెంటర్ పర్ఫామెన్స్ సంస్థలకు సదరు డైరక్టర్లు  లాబ్ కిట్ల కొనుగోలు పేరుతో 85 కోట్లు చెల్లించారు. (కార్మికుల సొమ్ము  కట్టలపాము పాలు)

2018-19 సంవత్సరానికి 18 కోట్ల విలువైన మందులు కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో ఉంటే , అందులో కేవలం రూ. 8 కోట్లు మాత్రమే వాస్తవ ధరగా  ప్రకటించి మిగతా నిధులు స్వాహా చేశారు. అంతేగాక మందుల కొనుగోలు, ల్యాబ్ కిట్లు ,ఫర్నిచర్, ఈసీజీ సర్వీసులు బయోమెట్రిక్ యంత్రాల కొనుగోలు లో భారీగా అక్రమాలు జరిగినట్టుగా కూడా  గుర్తించారు. వాస్తవానికి ఒక్కో బయోమెట్రిక్ మిషన్ ధర రూ.16,000 అయితే ఏకంగా రూ. 70 వేల చొప్పున నకిలీ ఇండెంట్లు సృషించి అక్రమాలకు పాల్పడినట్లు  నివేదికలో తేలింది. దీనిపై ఏసీబీ లోతైన విచారణ జరుపుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top