
కబ్జాకు గురైన ఇల్లు
ఇళ్లలో ఎవరూ లేకుంటే సహజంగా దొంగలు కన్నేస్తారు. ఇంటిలో నగదు, నగలు, వస్తువులు దోచుకెళతారు. కానీ ఇక్కడ మాత్రం ఓ టీడీపీ నేత ఏకంగా ఇంటికే ఎసరు పెట్టాడు. ఆ ఇంటి వాళ్లు ఊళ్లోలేరని మొత్తం స్వాధీనం చేసేసుకున్నాడు. అద్దెకిచ్చేసి పెత్తనం చలాయిస్తున్నాడు. ఇంటి వ్యవహారం కోర్టులో ఉందని తెలిసినా ఈ అక్రమాన్ని సక్రమం చేసేందుకు ఓ రెవెన్యూ అధికారి నానా తంటాలు పడుతున్నాడు. ఆంధ్రా ప్యారిస్ తెనాలిలో ఇంటి కబ్జా బాగోతం ఒక్కసారి చదవండి.
తెనాలి: నిరుపేద లబ్ధిదారుకు పంపిణి చేసిన స్థలాన్ని ఇంటితోసహా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన మైనారిటీ నేత కబ్జా చేస్తే అధికారిక అప్పగింతకు రెవెన్యూ అధికారి ఉత్సాహ పడుతున్నారు. అన్యాక్రాంతమైన స్థలాలు అనేకం ఉండగా కేవలం ఆ ఇంటినే స్వాధీనం చేసుకునేందుకు నోటీసు జారీ చేశారు. నిబంధనలేమీ పాటించలేదు. ఆ ఇల్లు కోర్టులో ‘జప్తు’ అయినా, వేలానికి మరో పిటిషను కోర్టుకు వెళ్లినా రెవెన్యూ అధికారులు నోటీసు ఇచ్చారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పేదలకిచ్చిన స్థలమిది..
పట్టణ రవీంద్రనాథ్‌నగర్‌లో గతంలో ప్రభుత్వం పేదలకు నివేశన స్థలాలిచ్చింది. లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నారు. కొందరు అమ్మేసుకుని వెళ్లిపోయారు. అలాంటి స్థలాలపై ఇటీవల తనిఖీలు జరిగాయి. అన్యాక్రాంతమైనవి స్వాధీనం చేసుకోవాలనీ, ప్రస్తుతం ఎవరైతే నివసిస్తున్నారో? వారి పేరిట పట్టాలు ఇచ్చే అవకాశం ఉందనీ తనిఖీ ఉద్యోగులే లబ్ధిదారులకు చెప్పారు. రవీంద్రనాథ్‌నగర్‌లో సర్వే నంబర్.605/3బీలోని 306 ప్లాటు అన్యాక్రాంతమైందని గుర్తించారు. ప్రస్తుత ఆ ఇంటిని స్వాధీ నంలో ఉంచుకొని అనుభవిస్తున్న టీడీపీ నేత..లబ్ధిదారైన నల్లబోతుల తిరుపతమ్మ నుంచి అన్‌రిజిస్టరు అమ్మక ఒప్పం దం ద్వారా కొనుగోలు చేశారంటూ ఫార్మ్–2 నోటీసును జారీ చేశారు. మండల ఆర్‌ఐ–1ను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు.
ఆరుగురి చేతులు మారాక..
లబ్ధిదారు తిరుపతమ్మ నుంచి ఆ స్థలం ఆరు చేతులు మారాక అజిత్‌కుమార్ షిండే అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. గ్రౌండ్ ఫ్లోర్, రెండు అంతస్తులను నిర్మించుకున్నాడు. ఇతనిది మహారాష్ట్ర. తెనాలిలో స్థిరపడ్డాడు. బిస్కెట్ల వ్యాపారంలో చితికిపోవటంతో స్థిరాస్తిని తాకట్టు పెట్టి హరిభాస్కర్ షిండే అనే తోటి మరాఠీ వ్యాపారి దగ్గర అప్పు తీసుకున్నాడు. అప్పుల భారంతో అజిత్‌కుమార్ ఊరిలో లేరు. ఇది తెలిసిన టీడీపీ మైనారిటీ నేత ఆ ఇంటిని స్వాధీనంలోకి తీసుకుని అద్దెకు ఇచ్చేశాడు. తనకు చిట్ తాలూకా బకాయి నిమిత్తం ఇల్లు వదిలేశాడని, ఇల్లు తనదేనని టీడీపీ నేత చెప్పుకుంటున్నారు.
రెవెన్యూ అధికారి మంత్రాంగం
మైనారిటీ నేతకు ఆ ఇంటిని అధికారికంగా కట్టబెట్టేందుకు రెవెన్యూ అధికారి రంగంలోకి దిగారు. ఆర్‌ఈసీ నంబరు, తేదీ లేకుండా, రెవెన్యూ స్టాంపు లేకుండా కేవలం తన సంతకంతోనే నోటీసు ఇచ్చారు. ఇది తెలిసిన ఒకరు, పేదలకు కేటాయించిన అక్కడి ఇళ్ల స్థలాల్లో అన్యాక్రాంత వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా కోరగా, రికార్డులు లభ్యంగా లేవని సమాధానమిచ్చారు. వివరాల్లేనప్పుడు ఈ ఒక్క ఇంటికే స్వాధీనం చేసుకొవాలని నోటీసు ఎందుకు ఇచ్చారనేది ప్రశ్న!
ఇంటి వ్యవహారం కోర్టులో..
ఇదిలా ఉంటే, సదరు అజిత్‌కుమార్ షిండేకు అప్పు ఇచ్చిన హరిభాస్కర్ షిండేకు రావాల్సిన బాకీ పెరిగిపోయింది. తాకట్టు పెట్టిన ఇల్లేమో టీడీపీ నేత పరమైంది. దిక్కుతోచని స్థితిలో కోర్టును ఆశ్రయించారు. 2013లో గుంటూరు మూడో అదనపు సివిల్ జడ్జి కోర్టులో స్తిరాస్థి జప్తు పిటిషను వేశాడు. విచారణకు స్వీకరించిన కోర్టు, గడువులోగా ‘సూట్ అమౌంట్’కు తగిన సెక్యూరిటీ చూపకపోవటంతో స్థిరాస్తి జప్తునకు ఆదేశించింది. ఈ ఆస్తిని వేలంకు తీసుకొచ్చి తనకు రావాల్సిన డబ్బు దక్కించుకునేందుకు హరిభాస్కర్ ఇటీవలే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అవేవీ పట్టించుకోకుండా ‘నా రూటే సెపరేటు’ అన్నట్టుగా వ్యవహరించే ఆ అధికారి.. అధికార టీడీపీ నేతలకు మేలు చేసే పనిలో తప్పటడుగులు వేస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఇలాగే ఓ అసైన్డ్ స్థలాన్ని మరొకరికి పట్టా ఇచ్చారనే ఆరోపణతో సదరు లబ్ధిదారు ఏకంగా రెవెన్యూ కార్యాలయం ఎదుటే ఆందోళన చేసిన వైనం పాఠకులకు తెలిసిందే.