వైఎస్సార్‌సీపీ కార్యకర్తను హతమార్చిన టీడీపీ వర్గీయులు 

TDP Members Killed the YSRCP Acticist in Srikakulam - Sakshi

పుట్టగొడుగుల నెపంతో తగాదాకు దిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 

కుంటిభద్ర కాలనీలో ఘటన 

కొత్తూరు: మండలంలోని కుంటిబద్ర కాలనీకి చెందిన కామక జంగం(60)ను అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు బల్లెంతో పొడిచి..కర్రలతో దాడిచేసి మంగళవారం హతమార్చారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కుంటిభద్ర కాలనీకి చెందిన కామక జంగం వైఎస్సాసీపీ అభిమానిగా ఉంటున్నాడు. ఆయనతోపాటు అన్నదమ్ములు, వారి కుమారులు, ఇతర కుటుంబ సభ్యులు వైఎస్సార్‌సీపీకి సానుభూతిపరులు. ఏప్రిల్‌లో జగిరిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాలని అదే కాలనికి చెందిన కొవ్వాడ రాజు, యర్రయ్యలు చెప్పారు. జంగంతోపాటు ఆయన కుటుంబ సభ్యులంతా కలిసి తాము వైఎస్సార్‌సీపీ వెంట ఉంటామని తెలియజేశారు. మాట వినలేదని కొవ్వాడ రాజు అప్పటి నుంచి కక్ష పెట్టుకుని చిన్న, చిన్న విషయాలకు కూడా తగాదాలకు దిగేవాడు. మంగళవారం జంగంకు చెందిన గడ్డివాము (కల్లంలో) దగ్గర పుట్టగొడుగులు మొలిశాయి.  పుట్టగొడుగులు ఎందుకు తీశారని కొవ్వాడ రాజుతోపాటు ఆయన అన్నదమ్ములను జంగం నిలదీశారు.

అప్పటికే కొట్లాటకు సిద్ధంగా ఉన్న కొవ్వాడ రాజు తన వద్ద ఉన్న బరిసె(బల్లెం)తో జంగం పొట్టపై పొడిచాడు. అక్కడే ఉన్న కొవ్వాడ యండయ్య, జమ్మయ్య, తిరుపతిరావు, దాలయ్యలు కర్రలతో దాడి చేయడంతో జంగం అక్కడక్కడే కుప్పకూలిపోయాడు. విషయం తెలుసుకున్న జంగం కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పొట్టపై పొడిచిన బరెసను చూసి భయాందోళనకు గురయ్యారు. కొద్ది సమయం తర్వాత తేరుకుని కొత్తూరు సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ నుంచి పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. భర్త మృతి చెందిన విషయం భార్య బొడమ్మ, కుటుంబ సభ్యులకు తెలియడంతో రోదనలు మిన్నంటాయి. మృతుడికి ఇద్దరు కుమారులు చిన్నారావు, చిరంజీవు ఉన్నారు. మృతుడి భార్య బోడమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  

పరారీలో టీడీపీ వర్గీయులు.. 
ఈ ఘటనలో టీడీపీ వర్గీయులు కొవ్వాడ యండయ్య, జమ్మయ్యలకు, వైఎస్సార్‌సీపీకి చెందిన కామక హిమగిరికి గాయాలయ్యాయి. బరిసితో పొడిచిన కొవ్వాడ రాజుతోపాటు దాడికి పాల్పడిన కొంత మంది పరారిలో ఉన్నారు. సంఘటన స్థలం వద్దకు సీఐ ఎల్‌.ఎస్‌.నాయుడు, ఎస్‌ఐ బాలకృష్ణలు సిబ్బందితో చేరుకున్నారు. గ్రామంలో బందో బస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
 
నెల రోజుల వ్యవధిలో మూడో దాడి.. 
నెల రోజుల క్రితం గ్రామానికి టీడీపీకి చెందిన కార్యకర్తలు, వైఎస్సార్‌సీపీకి చెందిన కుటుంబాలపై (మహిళలు) దాడి చేశారు. మాతలలో సచివాలయం రంగులు వేస్తున్న సంఘటనలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అనుచరులు వైఎస్సార్‌సీపీ వర్గీయులపై దాడికి పాల్పడ్డారు. నెల రోజుల వ్యవధిలోనే మూడుసార్లు టీడీపీ వర్గీయులు దాడులకు తెగబడ్డారు. చివరికి వైఎస్సార్‌సీపీ కార్యకర్తను టీడీపీ వర్గీయులు బరిసితో పొడిచి హత్య చేశారు.  ఈ హత్యను మంత్రి కృష్ణదాస్‌ తీవ్రంగా ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top