తమ్ముళ్లకు తవ్వుకున్నంత! | tdp leaders sand minning | Sakshi
Sakshi News home page

తమ్ముళ్లకు తవ్వుకున్నంత!

May 24 2016 3:43 AM | Updated on Sep 17 2018 8:02 PM

తమ్ముళ్లకు తవ్వుకున్నంత! - Sakshi

తమ్ముళ్లకు తవ్వుకున్నంత!

చెరువుల్లో పూడిక తీసి నీటి నిల్వలు పెంచి భూగర్భ జలాలు వృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన నీరు-చెట్టు.....

పూడిక తీత పనులన్నీ టీడీపీ కార్యకర్తలకే
ఒకే చెరువులో రెండు, మూడు పనులుగా విభజన
నామినేషన్ పేరుతో పనులు కట్టబెడుతున్న అధికారులు
ఉపాధి పనులకు మెరుగులద్ది బిల్లులు చేసుకునే ప్రయత్నం

 
 
 
కర్నూలు సిటీ:  చెరువుల్లో పూడిక తీసి నీటి నిల్వలు పెంచి భూగర్భ జలాలు వృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘నీరు-చెట్టు’ కార్యక్రమం అధికార పార్టీ నేతలకు ఆదాయ వనరుగా మారింది. ఒకే చెరువులో రెండు, మూడ రకాలుగా పనులను విభజించి అంచనాలు వేసి నామినేషన్లపై టీడీపీ నేతలకు కట్టబెడుతున్నారు. మొదట్లో పూడికతీతతో పాటు చెరువుల బండ్‌ను బలోపేతం చేసి, తూములకు మరమ్మతులు చేసేందుకు అంచనాలు వేసి టెండర్ల ద్వారా పనులు చేయించాలని కలెక్టర్ నిర్ణయించారు. అయితే అధికార పార్టీ నేతలు సీఎం, జల వనరుల శాఖ మంత్రి దృష్టికి తీసుకపోయి కలెక్టర్ నిర్ణయాలను రద్దు చేయించారు.


ఆ తరువాత ఒకే చెరువులో పనులను విభజించి వర్గాల వారీగా తెలుగు తమ్ముళ్లు పంచుకుంటున్నారు. చెరువుల్లో నీరు వచ్చేందుకు ఫీడర్ చానల్స్, పంట కాల్వలు, వాగులు, వంకలు, కుంటల్లో పూడికతీతకు తీసేందుకు వేరువేరుగా అంచనాలు వేసి పనులు పంచుకున్నారు. ఫీడర్ చానల్స్‌కు, వాగులు, వంకలు చెరువుల్లో పూడికతీత పనులు చేస్తూ ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారు. వాగులు, ఫీడర్ చానల్స్‌కు గతంలో ఉపాధి కూలీలకు చేసిన పనులకే పైపై మెరుగులు దిద్దుతూ బిల్లులు చేయించుకునేందుకు అధికార పార్టీ నేతలు ఎత్తుగడ వేశారు.  
 
 
పనుల విభజన ఇలా..
జిల్లాలో చిన్న నీటి పారుదల శాఖ, పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 634 చెరువులు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 51,265 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఏడాది మొత్తం 584 చెరువుల్లో పూడికతీత పనులు చేయాలని లక్ష్యం. అయితే పనులు మాత్రమే ఈ నెల 21వ తేదీ వరకు 426 పనులు ప్రారంభం అయ్యాయి. వీటితో పాటు వాగులు, వంకలు, కుంటలు, ఫీడర్ చానల్స్‌లన్నీ కలిపి 968 పనులకు అంచనాలు వేశారు. వీటిలో 421 పనులు మొదలు అయ్యాయి. ఈ పనులకు చెరువుల్లో పూడికతీత కంటే క్యూబిక్ మీటర్ మట్టి రేట్లు అధికంగా ఇస్తుండడంతో పనులు చేసేందుకు తెలుగు తముళ్లు పోటీ పడుతున్నారు.   
 
ఉపాధి కూలీలు చేసిన పనులకే అంచనాలు
 
నీరు-చెట్టు కింద చెరువు పూడికతీత పనులకు గతేడాది చేసిన పనులకే అంచనాలు వేస్తున్నారు. ఇందుకు సాక్ష్యం కల్లూరు మండలంలోని ఉలిందకొండ సమీపంలోని పులికుంట, మోత్కమాడ, బొంగటయ్య వంకలు, వడ్డెర కుంటలలో పూడికతీతకు 9.8 లక్షలతో అంచనాలు వేసి పనులు చేసినట్లు కంప చెట్లు తొలగించారు. పైపై మెరుగులు దిద్ది బిల్లులు స్వాహా చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో ప్రతి మండలంలో ఇలాంటి అక్రమాలే చోటు చేసుకుంటున్నాయి. పనులు చేపట్టింది అధికార పార్టీ నేతలే కావడంతో అధికారులు చర్యలు తీసుకోలేక పోతున్నారు.

తాజాగా జిల్లాలోని చెక్ డ్యాంల్లో కూడా పూడికతీత పనులు చేసేందుకు ప్రభుత్వం జల వనరుల శాఖకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమాలు జరుగుతున్న విషయంపై జల వనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ ఎస్. చంద్రశేఖర్ రావును వివరణ కోరగా.. పనులను పరిశీలించి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement