
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో నర్సింగ్ సూళ్లు, కాలేజీల ఏర్పాటు ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. కొత్త కాలేజీల ఏర్పాటును వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనమ్ మాలకొండయ్య వ్యతిరేకించారు. ప్రస్తుతమున్న సూళ్లు, కాలేజీలకే అడ్మిషన్లు లేవని తిరస్కరించారు. దీంతో పూనమ్ మాలకొండయ్యపై ప్రభుత్వ పెద్దల రాజకీయ ఒత్తిడి మొదలైంది. ఎమ్మెల్యేలు, టీడీపీ నేతల ఒత్తిడితో కొత్త కాలేజీలకు అనుమతివ్వాలని ఆదేశాలు వెలువడ్డాయి.
పూనమ్ మాలకొండయ్య వ్యతిరేకించడంతో హై పవర్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఎలాగైనా కొత్త నర్సింగ్ సంస్థలకు అనుమతులు ఇవ్వాలని ఒత్తిడి చేసేందుకు సమావేశంకానున్నారు. హై పవర్ కమిటీ సిఫార్సులను ఆమోదం తెలపాలని ఇప్పటికే పూనమ్ మాలకొండయ్యపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెస్తున్నారు. టీడీపీ నేతలు నర్సింగ్ కాలేజీలు, స్కూళ్ల ఏర్పాటుకు కోట్లలో వసూళ్లు చేసినట్టు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.