నీ అంతుచూస్తాం! | TDP leaders Over Action on DSP | Sakshi
Sakshi News home page

నీ అంతుచూస్తాం!

Jan 23 2020 5:15 AM | Updated on Jan 23 2020 9:58 AM

TDP leaders Over Action on DSP - Sakshi

డీఎస్పీ సీతారామయ్యపై చేయివేసి దౌర్జన్యం చేస్తున్న టీడీపీ నేతలు

సాక్షి, గుంటూరు: మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి పొలిటికల్‌ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం గుంటూరు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బందోబస్తులో ఉన్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. ఒకానొక దశలో ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి షేక్‌ లాల్‌వజీర్‌ డీఎస్పీపై చెయ్యివేసి దౌర్జన్యానికి దిగారు. అంతటితో ఆగకుండా ‘నీ అంతుచూస్తా’నని బెదిరించారు. దీంతో అక్కడ టీడీపీ నాయకులు పోలీసుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాలివీ..

జిల్లా బంద్‌ పురస్కరించుకుని గుంటూరు ఎన్టీఆర్‌ స్టేడియం వద్ద కాలేజీ బస్సులను అడ్డుకుంటూ, వ్యాపార సంస్థలను టీడీపీ నాయకులు మూసివేయించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. బంద్‌కు ఎలాంటి అనుమతుల్లేవని, వాహనాలను అడ్డుకోవడం, వ్యాపార సంస్థలను మూసివేయించడం చేయకూడదని పోలీసులు వారించారు. ఈ సమయంలో ఓ ప్రైవేటు కళాశాల బస్సును టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి షేక్‌ లాల్‌వజీర్, మిర్చి యార్డు మాజీ చైర్మన్‌ మన్నవ సుబ్బారావు, పార్టీ ఇతర నాయకులు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఆందోళనకారులకు గుంటూరు అర్బన్‌ మహిళా పోలీసుస్టేషన్‌ డీఎస్పీ సీతారామయ్య సర్దిచెప్పి అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అయితే, టీడీపీ నాయకులు డీఎస్పీపై దౌర్జన్యానికి దిగారు. లాల్‌వజీర్‌ అయితే డీఎస్పీపై చెయ్యి వేసి ‘నీ అంతుచూస్తా..’ అంటూ రెచ్చిపోయారు. డీఎస్పీ సీతారామయ్య సైతం అదేస్థాయిలో జవాబివ్వడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో టీడీపీ నాయకులు సర్దిచెప్పగా పరిస్థితి సద్దుమణిగింది. కాగా, డీఎస్పీపై దురుసుగా ప్రవర్తించినందుకు లాల్‌వజీర్‌ సహా 15 మందిపై గుంటూరు పట్టాభిపురం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

బంద్‌కు స్పందన కరువు
ఇదిలా ఉంటే..బంద్‌కు గుంటూరు నగరం సహా జిల్లాలోని ఏ ప్రాంతంలోనూ ప్రజాస్పందన లభించలేదు. రోజువారిలాగే వ్యాపార సంస్థలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేశాయి. దీంతో టీడీపీ నాయకులు రోడ్లపైకి వచ్చి బలవంతంగా స్కూల్‌ బస్సులను, ఇతర వాహనాలను అడ్డుకుని, వ్యాపార సంస్థలను మూసివేయించడానికి ప్రయత్నించారు. మరోవైపు.. రాజధాని ప్రాంతంలోని మందడం, తుళ్లూరు, వెలగపూడి గ్రామాల్లో ఆందోళనకారులు దీక్షా శిబిరాల్లో తమ నిరసన కొనసాగించారు. 

టీడీపీ నేతలకు తల్లిదండ్రుల ఝలక్‌
బంద్‌ సందర్భంగా తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను మూసివేయించడానికి వెళ్లిన టీడీపీ నాయకులకు పరాభవం ఎదురైంది. పాఠశాల మూసివేతను విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు వ్యతిరేకించారు. ‘మీ పిల్లలు చదివే విజయవాడ, గుంటూరుల్లోని కార్పొరేట్‌ స్కూళ్లు మూతపడలేదు. మరి నిరుపేదలమైన మా పిల్లలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు మూతపడాలి?’ అని టీడీపీ నాయకులను నిలదీశారు. దీంతో చేసేదిలేక నేతలు వెనుదిరిగారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement