వీధికో షాడో! | TDP leaders of the constitutional power of wonderful role model | Sakshi
Sakshi News home page

వీధికో షాడో!

Jun 21 2014 4:58 AM | Updated on Aug 10 2018 9:40 PM

వీధికో  షాడో! - Sakshi

వీధికో షాడో!

పౌర విమానయాన శాఖామంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు తరచూ షాడోనేత పేరును వల్లిస్తూ అధికారులపై తీగ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా....విచిత్రంగా మరో పక్క టీడీపీ నాయకులు ఆ నేతను రోల్‌మోడల్‌గా తీసుకుంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి జిల్లాను కనుసన్నల్లో శాసించిన షాడోనేతలా తామూ ఎదిగిపోవాలని, ఎదురులేని విధంగా పెత్తనం చెలాయించాలని టీడీపీ నేతలు ఆత్రంగా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది షాడోనేతను ఆవహింపజేసుకుని ఆయన్ను అనుసరిస్తూ అధికారులపై ఒతిళ్లు తెస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో జిల్లాకి ఒకే ఒక్క షాడోనేత ఉండగా ఇప్పుడు వీధికో షాడో నేత తయారయ్యాడని, వీరితో ఎలా వేగాలని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
 - టీడీపీ నేతలకు రోల్‌మోడల్‌గా రాజ్యాంగేతర శక్తి
 - అధికార దాహంతో ఊరికొకరు,వార్డుకొకరు తయారు
 - ఇప్పటికే మొదలైన అజమాయిషీ
- బెంబేలెత్తిపోతున్న అధికారులు,ఉద్యోగులు

 సాక్షి ప్రతినిధి, విజయనగరం : పౌర విమానయాన శాఖామంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు తరచూ షాడోనేత పేరును వల్లిస్తూ అధికారులపై తీగ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా....విచిత్రంగా మరో పక్క టీడీపీ నాయకులు ఆ నేతను రోల్‌మోడల్‌గా తీసుకుంటున్నారు. అశోక్ నిత్యం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆ నేతనే అనుసరిస్తున్నారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని వార్డుకొక నాయకుడు తయారవుతున్నాడు. పవర్ చెలాయించేందుకు ఇప్పటికే దుకాణాలు తెరిచేశారు. అధికార దాహంతో ఉన్న ఆ పార్టీ నాయకులు.. వచ్చిన అవకాశాన్ని ఏమాత్రం వదులుకోకూడదని భావిస్తున్నారు.  
 
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను వైభవమేంటో అందరికీ తెలిసిందే. ప్రజాప్రతినిధి కాకపోయినప్పటికీ అంతకంటే ఎక్కువగా పవర్ చెలాయించారు. షాడోనేతగా పేరుపొందారు. జిల్లాలో ఆయన ఆధిపత్యం టీడీపీ నేతలకు కంటగింపుగా మారింది. చెప్పాలంటే ఆ పార్టీ జిల్లా నేతల్లో కసి పెంచింది. కాంగ్రెస్ నేతల్లో ఎవర్ని తిట్టకపోయినా చిన్నశ్రీనును మాత్రం వదిలేవారు కాదు. ఒంటికాలి తో లేచేవారు. ఆయన్ను రాజ్యాంగేతర శక్తిగా అభివర్ణించి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర  పరాజయం చవిచూసింది. షాడో నేత కాస్త జీరో అయ్యారు.

నాడు సలామ్ కొట్టిన వారంతా దూరంగా ఉంటున్నారు. పిలిచినా పలికేందుకు ఇష్టపడటం లేదు. అయితే పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉండి ముఖం వాచి పోయిన టీడీపీ నాయకులు మాత్రం ఆయన్నే ఆదర్శంగా తీసుకుంటున్నారు. గతంలో ఆయనెలా అధికారం చెలాయించారో అదే తరహాలో వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లా అంతటికీ ఒకే షాడోనేత ఉండగా, ఆ తరహాలో ఇప్పుడు ఊరుకొకరు, వార్డుకొకరు తయారవుతున్నారు.
 
ఎక్కడికక్కడ పవర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే కాకుండా ద్వితీయ శ్రేణి నాయకులు షాడోనేతలా అధికార దర్పం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన వారు ప్రమాణ స్వీకారం చేయకుండానే తమ వద్దకు అధికారులను పిలిపించుకుని సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు కాని వారు కూడా షాడో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎవరేమి చేయాలో నిర్ణయిస్తున్నారు.

ఏ ఉద్యోగి ఉండాలో, ఎవరు ఉండకూడదో నేరుగా సూచించేస్తున్నారు. తమకిష్టం లేని ఉద్యోగుల్ని, అధికారులను వేరొక చోటకి వెళ్లిపోవాలని హుకుం జారీ చేస్తున్నారు. కాదని వ్యతిరేకిస్తే తాము బదిలీ చేయాల్సి వస్తోందని హెచ్చరిస్తున్నారు. పనిచేసే ఉద్యోగులు, అధికారులు కూడా తరుచూ కలవాలని, పాలన పరంగా ఏం చేసినా తమకు చెప్పి చేయాలని, ఏ పథకం వచ్చినా తమ దృష్టిలో పెట్టి ముందుకెళ్లాలని హకుం జారీచేస్తున్నారు. అంతటితో ఆగకుండా పథకాల అమలు, కొత్తగా చేయాల్సిన కార్యక్రమాలు తదితర వాటిపై ఆదేశాలు ఇస్తున్నారు.
 
దీంతో అధికారులు అవాక్కైపోతున్నారు. గతంలో ఒకరే అనధికార బాస్‌గా వ్యవహరిస్తే ఇప్పుడు ప్రాంతానికొకరు తయారయ్యారని వాపోతున్నారు. ఇలాగైతే కష్టమేనని, ఒకర్నైతే తట్టుకోగలమని, ఇంతమందైతే వేగలేమనే అభిప్రాయానికొచ్చేస్తున్నారు. మండలాల్లో ఎంపీటీసీలు, మున్సిపాల్టీల్లో కౌన్సిలర్లు, జిల్లా పరిషత్‌లో పలువురు  జెడ్పీటీసీలు ఇప్పటికే అధికారులపై ఒత్తిళ్లు పెట్టారు. తమకు అనుకూలంగా పనులు చేపట్టాలని జాబితాలిస్తున్నారు. అవుట్ సోర్సింగ్  ఉద్యోగాల్లో తమ వారిని వేసుకోవాలని సిఫార్సులు చేస్తున్నారు.

తమ మాట వినకపోతే కాంగ్రెస్ మద్దతుదారుడిగా చిత్రీకరించి, బదనాం చేస్తామని పలుచోట్ల బెదిరింపులకు దిగుతున్నట్టు తెలిసింది.   జిల్లా కేంద్రంలో  ఇద్దరు నాయకులైతే పార్టీ కీలక నేత అనుచరులమని, తాము చెప్పినట్టుగా నడుచుకోవాలని  అధికారుల వద్దకు వెళ్లి హడావుడి చేస్తున్నారు. ఇదంతా చూసి అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహించొద్దని తరచూ సమావేశాల్లో హితబోధ చేస్తున్న అశోక్ దృష్టికి తీసుకెళ్తే తప్ప అదుపులోకి వచ్చేటట్టు లేదన్న ఆలోచనకు అధికారులొస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement