breaking news
Minister of Civil Aviation
-
విమానాల రిపేర్లకు అనువుగా తిరుపతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెంపుల్ సిటీగా పేరొందిన తిరుపతిలో విమానాల ఇంజిన్ల నిర్వహణ, రిపేర్, ఓవరాలింగ్ (ఎంఆర్వో) ఫెసిలిటీ ఏర్పాటు పనులను వేగిరం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గురుమూర్తి మద్దిల శుక్రవారం విన్నవించారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎంఆర్వో కేంద్రం ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలు, వ్యాపార ఆవకాశాలను వివరిస్తూ ఇన్వెస్ట్ ఇండియా నివేదిక రూపొందించింది. బేగంపేట విమానాశ్రయంలో జరుగుతున్న వింగ్స్ ఇండియా–2022 వేదికపై కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఈ రిపోర్ట్‌ను ఆవిష్కరించారు. తిరుపతిసహా 8 ఎయిర్‌పోర్టుల్లో ఎంఆర్వో కేంద్రాలను నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది. ‘తిరుపతి విమానాశ్రయంలో రన్‌వే నుంచి 440 మీటర్ల దూరంలోనే ప్రతిపాదిత ఎంఆర్వో కేంద్రం కోసం స్థలం ఉంది. ఇటువంటి సౌకర్యం దేశంలో ఏ ఎయిర్‌పోర్టులో కూడా లేదు. ఎంఆర్వో సేవలకు అనువుగా ఉంటుంది’ అని గురుమూర్తి తెలిపారు. రెండు హెలిప్యాడ్స్ సైతం.. తిరుమలకు ఏటా 5.8 కోట్ల మంది భక్తులు, సందర్శకులు వస్తున్నారని గురుమూర్తి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘వీరిలో 40 శాతం మంది ఖర్చుకు వెనుకాడరు. నాలుగైదు రోజులు గడిపేందుకు సిద్ధంగా ఉంటున్నారు. తిరుపతితోపాటు కోస్తా ప్రాంతంలో హెలిప్యాడ్స్ స్థాపించాల్సిందిగా కేంద్రాన్ని కోరాం. ఇవి కార్యరూపంలోకి వస్తే తిరుమల వచ్చిన వారు కోస్తా ప్రాంతంలో ఉన్న సందర్శనీయ స్థలాలకు హెలికాప్టర్లో సులువుగా వెళ్లవచ్చు. రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. తిరుపతి విమానాశ్రయంలో రన్‌వే విస్తరణ పనులు వేగిరం అయ్యాయి. స్థల సేకరణలో తలెత్తిన సమస్యలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చొరవతో సమసిపోయాయి. కడపలో పైలట్ శిక్షణ కేంద్రం రానుంది. ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే దక్షిణాదివారు శిక్షణ తీసుకోవచ్చు. భోగాపురం విమానాశ్రయానికి కావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరాం’ అని వివరించారు. విదేశీ సంస్థలకు సైతం.. ఇన్వెస్ట్ ఇండియా నివేదిక ప్రకారం.. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 2017–18లో విమాన రాకపోకలు 7,094 నమోదయ్యాయి. ఆ తర్వాతి సంవత్సరం ఇది ఏకంగా 10,738కు ఎగసింది. మహమ్మారి కారణంగా 2021–22లో ఈ సంఖ్య 6,613కు వచ్చి చేరింది. 2020–21తో పోలిస్తే ఇది 49% అధికం. 2017–18లో 6.57 లక్షల మంది విమాన ప్రయాణం చేశారు. ఈ సంఖ్య 2018–19లో 8.48 లక్షలకు ఎగసింది. 2021–22లో 47% అధికమై 5.02 లక్షలకు వచ్చి చేరింది. ఇండిగో, స్పైస్ జెట్, ట్రూజెట్, అలయన్స్ ఎయిర్, ఎయిరిండియా, స్టార్ ఎయిర్ సంస్థలు అన్నీ కలిపి వారం లో 131 సర్వీసులు నడిపిస్తున్నాయి. తిరుపతి నుంచి 400 కిలోమీటర్ల పరిధిలో 10 విమానాశ్రయాలు ఉన్నాయి. ఎంఆర్వో సేవలు అందించేందుకు ఈ నెట్వర్క్ దోహదం చేస్తుంది. ఆసియా పసిఫిక్, తూర్పు ఆసియా, మధ్యప్రాచ్య దేశాలకు చెందిన సంస్థలకూ ఈ సేవలు విస్తరించేందుకు వ్యూహాత్మక కేంద్రంగా తిరుపతి ఉంది. ఏటా భారత్‌కు 120 కొత్త విమానాలు: సింధియా దేశంలో విమానయాన సంస్థల వద్ద ప్రస్తుతం 710 విమానాలు ఉన్నాయి. 2013–14లో ఈ సంఖ్య 400 మాత్రమే. రానున్న రోజుల్లో ఏటా కొత్తగా కనీసం 110–120 విమానాలు జతకూడనున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా శుక్రవారం తెలిపారు. ఇక్కడి బేగంపేటలో జరుగుతున్న వింగ్స్ ఇండియా–2022 ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఏడేళ్లలో ఎయిర్‌పోర్టుల సంఖ్య 74 నుంచి 140కి ఎగసింది. మూడేళ్లలో ఇది 220లకు చేరుతుంది. దేశీయంగా 2013–14లో 6.7 కోట్ల మంది ప్రయాణించారు. అయిదేళ్లలో ఈ సంఖ్య 14 కోట్లకు చేరింది. ప్రస్తుతం రోజుకు 3.83 లక్షల మంది విహంగ విహారం చేస్తున్నారు. మహమ్మారి నుంచి ఈ పరిశ్రమ వేగంగా కోలుకుంది. వచ్చే ఏడాది కోవిడ్–19 ముందస్తు స్థాయిలో దేశీయ ప్రయాణికుల సంఖ్య రోజుకు 4.1 లక్షలు దాటనుంది. 2018–19లో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 34.4 కోట్లు. 2024–25 నాటికి ఇది 40 కోట్లు దాటుతుంది’ అని సింధియా తెలిపారు. ఇన్వెస్ట్ ఇండియా నివేదికను జ్యోతిరాదిత్యతో కలిసి ఆవిష్కరిస్తున్న -
వీధికో షాడో!
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి జిల్లాను కనుసన్నల్లో శాసించిన షాడోనేతలా తామూ ఎదిగిపోవాలని, ఎదురులేని విధంగా పెత్తనం చెలాయించాలని టీడీపీ నేతలు ఆత్రంగా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది షాడోనేతను ఆవహింపజేసుకుని ఆయన్ను అనుసరిస్తూ అధికారులపై ఒతిళ్లు తెస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో జిల్లాకి ఒకే ఒక్క షాడోనేత ఉండగా ఇప్పుడు వీధికో షాడో నేత తయారయ్యాడని, వీరితో ఎలా వేగాలని అధికారులు ఆందోళన చెందుతున్నారు. - టీడీపీ నేతలకు రోల్‌మోడల్‌గా రాజ్యాంగేతర శక్తి - అధికార దాహంతో ఊరికొకరు,వార్డుకొకరు తయారు - ఇప్పటికే మొదలైన అజమాయిషీ - బెంబేలెత్తిపోతున్న అధికారులు,ఉద్యోగులు సాక్షి ప్రతినిధి, విజయనగరం : పౌర విమానయాన శాఖామంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు తరచూ షాడోనేత పేరును వల్లిస్తూ అధికారులపై తీగ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా....విచిత్రంగా మరో పక్క టీడీపీ నాయకులు ఆ నేతను రోల్‌మోడల్‌గా తీసుకుంటున్నారు. అశోక్ నిత్యం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆ నేతనే అనుసరిస్తున్నారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని వార్డుకొక నాయకుడు తయారవుతున్నాడు. పవర్ చెలాయించేందుకు ఇప్పటికే దుకాణాలు తెరిచేశారు. అధికార దాహంతో ఉన్న ఆ పార్టీ నాయకులు.. వచ్చిన అవకాశాన్ని ఏమాత్రం వదులుకోకూడదని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను వైభవమేంటో అందరికీ తెలిసిందే. ప్రజాప్రతినిధి కాకపోయినప్పటికీ అంతకంటే ఎక్కువగా పవర్ చెలాయించారు. షాడోనేతగా పేరుపొందారు. జిల్లాలో ఆయన ఆధిపత్యం టీడీపీ నేతలకు కంటగింపుగా మారింది. చెప్పాలంటే ఆ పార్టీ జిల్లా నేతల్లో కసి పెంచింది. కాంగ్రెస్ నేతల్లో ఎవర్ని తిట్టకపోయినా చిన్నశ్రీనును మాత్రం వదిలేవారు కాదు. ఒంటికాలి తో లేచేవారు. ఆయన్ను రాజ్యాంగేతర శక్తిగా అభివర్ణించి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసింది. షాడో నేత కాస్త జీరో అయ్యారు. నాడు సలామ్ కొట్టిన వారంతా దూరంగా ఉంటున్నారు. పిలిచినా పలికేందుకు ఇష్టపడటం లేదు. అయితే పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉండి ముఖం వాచి పోయిన టీడీపీ నాయకులు మాత్రం ఆయన్నే ఆదర్శంగా తీసుకుంటున్నారు. గతంలో ఆయనెలా అధికారం చెలాయించారో అదే తరహాలో వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లా అంతటికీ ఒకే షాడోనేత ఉండగా, ఆ తరహాలో ఇప్పుడు ఊరుకొకరు, వార్డుకొకరు తయారవుతున్నారు. ఎక్కడికక్కడ పవర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే కాకుండా ద్వితీయ శ్రేణి నాయకులు షాడోనేతలా అధికార దర్పం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన వారు ప్రమాణ స్వీకారం చేయకుండానే తమ వద్దకు అధికారులను పిలిపించుకుని సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు కాని వారు కూడా షాడో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎవరేమి చేయాలో నిర్ణయిస్తున్నారు. ఏ ఉద్యోగి ఉండాలో, ఎవరు ఉండకూడదో నేరుగా సూచించేస్తున్నారు. తమకిష్టం లేని ఉద్యోగుల్ని, అధికారులను వేరొక చోటకి వెళ్లిపోవాలని హుకుం జారీ చేస్తున్నారు. కాదని వ్యతిరేకిస్తే తాము బదిలీ చేయాల్సి వస్తోందని హెచ్చరిస్తున్నారు. పనిచేసే ఉద్యోగులు, అధికారులు కూడా తరుచూ కలవాలని, పాలన పరంగా ఏం చేసినా తమకు చెప్పి చేయాలని, ఏ పథకం వచ్చినా తమ దృష్టిలో పెట్టి ముందుకెళ్లాలని హకుం జారీచేస్తున్నారు. అంతటితో ఆగకుండా పథకాల అమలు, కొత్తగా చేయాల్సిన కార్యక్రమాలు తదితర వాటిపై ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో అధికారులు అవాక్కైపోతున్నారు. గతంలో ఒకరే అనధికార బాస్‌గా వ్యవహరిస్తే ఇప్పుడు ప్రాంతానికొకరు తయారయ్యారని వాపోతున్నారు. ఇలాగైతే కష్టమేనని, ఒకర్నైతే తట్టుకోగలమని, ఇంతమందైతే వేగలేమనే అభిప్రాయానికొచ్చేస్తున్నారు. మండలాల్లో ఎంపీటీసీలు, మున్సిపాల్టీల్లో కౌన్సిలర్లు, జిల్లా పరిషత్‌లో పలువురు జెడ్పీటీసీలు ఇప్పటికే అధికారులపై ఒత్తిళ్లు పెట్టారు. తమకు అనుకూలంగా పనులు చేపట్టాలని జాబితాలిస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో తమ వారిని వేసుకోవాలని సిఫార్సులు చేస్తున్నారు. తమ మాట వినకపోతే కాంగ్రెస్ మద్దతుదారుడిగా చిత్రీకరించి, బదనాం చేస్తామని పలుచోట్ల బెదిరింపులకు దిగుతున్నట్టు తెలిసింది. జిల్లా కేంద్రంలో ఇద్దరు నాయకులైతే పార్టీ కీలక నేత అనుచరులమని, తాము చెప్పినట్టుగా నడుచుకోవాలని అధికారుల వద్దకు వెళ్లి హడావుడి చేస్తున్నారు. ఇదంతా చూసి అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహించొద్దని తరచూ సమావేశాల్లో హితబోధ చేస్తున్న అశోక్ దృష్టికి తీసుకెళ్తే తప్ప అదుపులోకి వచ్చేటట్టు లేదన్న ఆలోచనకు అధికారులొస్తున్నారు.