
‘దేశం’లో ఆరని కుంపట్లు
ఎన్నికల సమయంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండుసార్లు ప్రజలు బాబును అధికారానికి దూరంగా పెట్టినా ఆయన వైఖరిలో మార్పు లేదని పార్టీ ముఖ్య నేతలు కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు.
ఎన్నికల సమయంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండుసార్లు ప్రజలు బాబును అధికారానికి దూరంగా పెట్టినా ఆయన వైఖరిలో మార్పు లేదని పార్టీ ముఖ్య నేతలు కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు.
ఇక మా బాబు మారడని కార్యకర్తలు, టీడీపీ నాయకులు నిస్తేజంలో ఉన్నారు. బాబు వైఖరి పార్టీ కొంప ముంచుతోందని వాపోతున్నారు.
చివరివరకు ఏమీ తేల్చకుండా నామినేషన్లు ముగిసే సమయం వరకు నాన్చడం బాబు నైజంగా పార్టీ కార్యకర్తలు దుమ్మెత్తిపోస్తున్నారు.
సీనియర్ నేతల నడుమ అంతర్గత కుమ్ములాటలు
పార్టీలోని సీనియర్ నేతల నడుమ అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. విభేదాలు ముదిరాయి. జిల్లా పార్టీ కార్యాలయంపై దాడి ఇందుకు ఉదాహరణ. ఒకరి సీటు మరొకరు అడ్డుకునేందుకు నిన్నటివరకు తీవ్రంగా యత్నించిన పార్టీ నేతలు ఇప్పుడు బీసీ, ఎస్సీలతో రాజకీయ చదరంగం ఆడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
జిల్లాలో టీడీపీ సీట్లు సోమవారం నాటికి మూడు విడతలుగా చంద్రబాబు ప్రకటించారు. ఈ మూడు విడతల్లోనూ జిల్లాలో ఇంకా ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఎన్నికలకు ఏడాది ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తానని ప్రకటించిన చంద్రబాబు ఎప్పటిలాగే పాత పంథాలోనే పయనించడం పార్టీ కేడర్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఇప్పటివరకు జిల్లాలో బీసీ అభ్యర్ధిని ఒక్కరినే బాబు ప్రకటించారు. రేపల్లె నియోజకవర్గానికి తొలి జాబితాలో అనగాని సత్యప్రసాద్‌ను ఎంపిక చేశారు.
సత్తెనపల్లి పార్టీ ఇన్‌చార్జి నిమ్మకాయల రాజనారాయణ, గుంటూరు నగర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. అయితే వీరిద్దరికీ ఎక్కడ సీట్లు కేటాయించాలనేది అధినేతకు తలనొప్పిగా మారింది. సత్తెనపల్లి సీటును సీనియర్ నేత కోడెల శివప్రసాద్‌కు ఖరారు చేశారు. దీంతో నిమ్మకాయల రాజనారాయణను మాచర్ల నుంచి పోటీ చేయాలని బాబు సూచిస్తున్నట్టు సమాచారం. అయితే నిమ్మకాయల అందుకు ససేమిరా అంగీకరించడం లేదు. బోనబోయినకు బాబు ఆఫర్ ఇచ్చినా ఫలితం లేదని తెలుస్తోంది.
రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు నిమ్మకాయల సమాయత్తం?
సత్తెనపల్లి నుంచే పోటీ చేస్తానని తన అనుచరుల వద్ద నిమ్మకాయల ప్రకటించారు. ఈ నెల 16న సత్తెనపల్లి నుంచి నామినేషన్ వేసేందుకు సమాయత్తమవుతున్నట్టు సమాచారం. మంగళగిరి సీటుపై ఇంకా పీటముడి వీడలేదు. ఇక్కడ రోజుకో కొత్త పేరు ప్రచారంలోకి రావడంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న పోతినేని శ్రీనివాసరావు హైదరాబాదులో మకాం వేసి సీటు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
అయితే ఇక్కడ్నుంచి ఇటీవలే మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసిన గంజి చిరంజీవి పేరు ప్రముఖంగా వినబడుతోంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇప్పటికే నియోజకవర్గంపై పూర్తి స్థాయి పట్టు సాధించడం, కాంగ్రెస్ అభ్యర్థిగా కాండ్రు కమల పేరు ఖరారు చేయడంతో టీడీపీ నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎస్సీ నియోజకవర్గాలైన తాడికొండ, ప్రత్తిపాడు స్థానాలకు ఇంతవరకు అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో అక్కడి కార్యకర్తల్లోనూ నైరాశ్యం అలముకుంది.
తూర్పు నియోజకవర్గం సీటు కేటాయింపులోనూ ప్రతిష్టంభన కొనసాగుతోంది. అక్కడ ఆర్యవైశ్యులకు ఇవ్వాలా, యథాప్రకారం ముస్లింలకు ఇవ్వాలా అనేది చంద్రబాబు తేల్చుకోలేకపోతున్నారు. మొత్తంమీద చివరివరకూ సాగదీయడం వలన ఆయా స్థానాలకు మొదటి నుంచీ ఆశలు పెట్టుకున్న నాయకులు ఆశాభంగంతో రెబల్ అభ్యర్థులుగా బరిలో ఉంటారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.