బడేటి బుజ్జి బరితెగింపు

Tdp Leaders Illegally Attract The Voters - Sakshi

సాక్షి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో అధికార పార్టీ నాయకులు ఎన్నికల కోడ్‌ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంతో ఎన్నికల కోడ్‌ అమలులోకి రాగా ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసే హోర్డింగులు తొలగించకుండా కొన్నిరోజులు ఉంచిన నాయకులు అనంతరం సైకిళ్లు పంపిణీ, గొర్రెలు, గేదెలు పంపిణీ, కొన్ని ప్రాంతాల్లో మోటార్‌ సైకిళ్లు పంపిణీ కూడా చేసి కోడ్‌ను బహిరంగంగానే ఉల్లంఘిస్తూ తాము కోడ్‌కు అతీతులమన్నట్టు వ్యవహరించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి మరొకడుగు ముందుకు వేసి ఏకంగా డ్వాక్రా మహిళలతోనే సమావేశం నిర్వహించారు. దీనిలో రిసోర్స్‌ పర్సన్లను (ఆర్‌పీలను) పావులుగా వాడుకున్నారు. బుధవారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో డ్వాక్రా మహిళలను సమావేశానికి రావాలని ఆర్‌పీలు ఆదేశించారు. దీనిపై డ్వాక్రా మహిళలు ఏ సమావేశం, ఎన్నికల సమావేశమేనా అడిగితే మీకు సమాధానం కావాలా? లేక ఇటీవల ప్రభుత్వం మీకు ఇచ్చిన చెక్కులు డబ్బులుగా మారడం కావాలా? అంటూ మారు మాట్లాడనీయలేదు.

టీడీపీకి ఓటేస్తేనే చెక్కులకు నగదు
సమావేశానికి వెళ్లకపోతే చెక్కులు డబ్బులు కావేమో అనే ఆందోళనతో సమావేశానికి వెళ్లిన డ్వాక్రా మహిళలకు ఆర్‌పీలు టీడీపీకి ఓటు వేయాలని, లేకపోతే చెక్కులు నిరుపయోగమౌతాయని, తరువాత రుణాలు కూడా వచ్చే అవకాశం ఉండదని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే చెక్కులు అందుకున్న డ్వాక్రా మహిళలు వాటిని బ్యాంకుల్లో వేయడానికి వెళితే బ్యాంకు అధికారులు చెక్కులు మీరు నేరుగా తెస్తే తీసుకోమని, ఆర్‌పీలకు ఇచ్చి పంపాలని తిప్పి పంపుతున్నారని చెబుతున్నారు. ఇది కూడా అధికార పార్టీ నాయకుల కుట్రలో భాగంగానే జరుగుతోందని వారు గుర్తించారు. ఆర్పీలు సంతకాలు పెట్టి చెక్కులను బ్యాంకుల్లో వేస్తేనే డబ్బులయ్యే పరిస్థితి కల్పించి డ్వాక్రా మహిళలను వారి చెప్పుచేతల్లో ఉంచుకునేలా చేశారు. ఇదే అదనుగా తీసుకున్న ఆర్పీలు డ్వాక్రా మహిళలను ప్రతి సమావేశానికి రావాలని, వారు ఎంతరాలేని పరిస్థితిలో ఉన్నా రాకపోతే డబ్బులు రావని బెదిరిస్తున్నారు. బుధవారం కూడా బెదిరించి సమావేశానికి రప్పించుకున్నారు.

చంద్రబాబు సీఎం అయితేనే ఫోన్లు
సమావేశానికి వచ్చిన డ్వాక్రా మహిళతో ఆర్పీలు మాట్లాడుతూ చంద్రబాబు గతంలో ప్రకటించిన మాదిరిగా సెల్‌ఫోన్లు ఇప్పటికే ఇచ్చేసేవారని, ఎన్నికల కోడ్‌ హఠాత్తుగా రావడంతో సెల్‌ఫోన్ల పంపిణీ కుదరలేదని చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే మీకు సెల్‌ఫోన్లు వస్తాయని,డ్వాక్రా రుణాలు రావాలన్నా చంద్రబాబుకే ఓటేయాలని ప్రచారం చేశారు. చంద్రబాబుకు ఓటేయకపోతే డ్వాక్రా సంఘాలకు తాము సహాయ నిరాకరణ చేస్తామని హెచ్చరించినట్టు కొంతమంది డ్వాక్రా మహిళలు ‘సాక్షి’ దృష్టికి తీసుకువచ్చారు.  

అధికారిక కార్యక్రమాలు నిషిద్ధం
కోడ్‌ అమలులో ఉండగా ఎటువంటి అధికారిక కార్యక్రమాలు చేయకూడదనే నిబంధన ఉన్నా ఎమ్మెల్యే బుజ్జి డ్వాక్రా మహిళలతో సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక 47వ డివిజన్‌లో చోడిదిబ్బ మంచినీటి ట్యాంకు ప్రాంతంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న బుజ్జి వచ్చే ఎన్నికల్లో కూడా తమ పార్టీకే ఓటు వేయాలని, లేనిపక్షంలో డ్వాక్రా మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటారని పరోక్షంగా హెచ్చరించారు. ఇంత జరుగుతున్నా తమను సమావేశాలకు రావాలని వేధిస్తున్నా, బహిరంగంగానే అధికారికంగా సమావేశాలు నిర్వహిస్తున్నా రిటర్నింగ్‌ అధికారులు ఏం చేస్తున్నారని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు కూడా అధికార తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top